చిన్నారుల కలల లోకం లోకి అడుగులు
– ప్రగతిలో 3D ప్లానిటోరియం అనుభవం!
రాయికల్, అక్టోబర్ 13: నేటి ధాత్రి:
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ప్రగతి పాఠశాలలో సోమవారం నిర్వహించిన 3D ప్లానిటోరియం విజ్ఞాన కార్యక్రమం అన్ని వయసుల విద్యార్థులను ఆకట్టుకుంది. ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులు నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీల అద్భుత ప్రపంచాన్ని ప్రత్యక్షంగా వీక్షించి మంత్రముగ్ధులయ్యారు.చిన్న తరగతుల విద్యార్థులకు సౌరమండల పరిచయం, భూమి–చంద్రుని కదలికలు, పగలు–రాత్రి మార్పు, ఋతువుల మార్పు వంటి అంశాలను సరళంగా చూపించగా,పెద్ద తరగతుల విద్యార్థులకు నక్షత్ర సమూహాలు,గెలాక్సీలు,బ్లాక్ హోల్‌లు,అంతరిక్ష పరిశోధనలు, ఉపగ్రహాల ప్రయాణం వంటి అధునాతన విషయాలను 3D రూపంలో ప్రదర్శించారు.విద్యార్థులు తాము తరగతుల్లో చదివిన విషయాలను ప్రత్యక్షంగా వీక్షించడంతో ఆసక్తి మరింత పెరిగింది.శాస్త్ర విజ్ఞానం, ఖగోళ శాస్త్రంపై ఆసక్తి కలిగించే ఈ కార్యక్రమం పాఠశాల ప్రాంగణంలో ఆనందోత్సాహాల నడుమ సాగింది.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలె శేఖర్ మాట్లాడుతూ —
“విజ్ఞానం వినోదంతో మిళితమైతేనే విద్యార్థుల్లో ఆసక్తి పుడుతుంది. ఇలాంటి ప్రదర్శనలు పిల్లల్లో ఊహాశక్తి, ప్రశ్నించే స్వభావం, పరిశోధనా దృక్పథం పెంపొందిస్తాయి” అన్నారు.కార్యక్రమం నిర్వహణలో ఉపాధ్యాయులు సక్రియంగా పాల్గొనగా, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై 3D ప్రదర్శనను ఆస్వాదించారు.ఈ కార్యక్రమంలో
కరస్పాండెంట్ జయశ్రీ, అకాడమీ డైరెక్టర్ నిఖిల్ కుమార్, ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు పాల్గొన్నారు