
`ఐటి డ్రీమ్స్ ఢమాల్!
`దిగ్గజ సంస్థల కమాల్!
`ఏఐ పేరుతో ఉద్యోగుల తొలగింపు!
`జీతాలు పెంచలేక కోతలు పెడుతున్నారు.
`ఏఐ పేరుతో వంకలు పెడుతున్నారు.
`జూనియర్లతో తక్కువ జీతాలతో పని చేయించుకోవాలనుకుంటున్నారు.
`సీనియర్కిచ్చే జీతంతో నలుగురుని రిక్రూట్ చేసుకోవాలనుకుంటున్నారు.
`లాభాలు 400 శాతాలున్నాయి.
`అయినా ఉద్యోగులను వదులుకుంటున్నాయి!
`భారత అర్థిక వ్యవస్థను కుదేలు చేస్తాయి.
`లక్షలాది మంది జీవితాలను వీధిపాలు చేస్తాయి.
`ఉద్యోగాలు పోగొట్టుకోవడమే కాదు, అప్పుల పాలౌతారు.
`ఉద్యోగాలను నమ్ముకొని చేసిన రుణాలు తీర్చలేక అవస్థలు పడతారు!
`ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి.
`ఐటికి కూడా కార్మిక చట్టాలు అమలు జరిగేలా చూడాలి.
`విదేశీ సంస్థలకిచ్చిన భూములు వెనక్కి తీసుకోవాలి.
హైదరాబాద్,నేటిధాత్రి:
ఐటి బతుకులు అంధకారం కానున్నాయా? ఐటిని నమ్మకున్న వారి జీవితాలు ఆగం కానున్నాయా! పోతున్న ఉద్యోగాల మూలంగా నిరుద్యోగ సమస్య మరింత జఠిలమౌతుందా? ఐటిపై లే ఆఫ్ ఏఐ పిడుగు శాశ్వతమా! ఉద్యోగాలు కోల్పోతున్న వారికి కొత్త ఉద్యోగాలు రావడం కష్టమే? వారి భవిష్యత్తుకు భరోసా లభించే అవకాశం లేదా! ఐటిలో ఏం జరుగుతోంది. ఒక్కసారిగా కొన్ని వేల ఉద్యోగాలు పోవడానికి కారణం ఏమిటి? అసంఘటిత కార్మికులన్నా అద్వాహ్నంగా ఐటి రంగం ఎందుకు తయారౌతోంది. ఏఐ టెక్నాలజీ మన ఇండియాలో అంతగా ఎదగలేదా? విద్యా రంగంలో మనం చాలా వెనుబడి వున్నామా? అంతర్జాతీయ సమస్యలు మన దేశం మీద ఈ రకంగా ఇబ్బందులు ఎందుకు సృష్టించబడుతున్నాయి. రాను రాను అర్థిక పరిస్థితులు ఎందుకు దిగజారుతున్నాయి. ఐటి దిగ్గజ సంస్థలను మన తెలుగు వాళ్లు, మన భారతీయులు శాసించే స్థాయి నుంచి ఎందుకు పడిపోతున్నారు. ప్రమాణాలు ఎక్కడ దెబ్బతింటున్నాయి. వీటిని ప్రభుత్వాలు సమాధానం చెప్పలేవా? ద్వైపాక్షిక సంబంధాలు గొప్పగా వున్నాయంటారు. దేశంలో నిరుద్యోగం పెరుగుతుంటే ఎందుకు చోద్యం చూస్తున్నారు. చదువు చెప్పినప్పుడే స్కిల్ డెవలప్మెంట్ అనే కోర్సులు ఎందుకు అందించడం లేదు. గతంలో రండి, రండి పిలిచిన కంపెనీలు ఇప్పుడు ఎందుకు వద్దంటున్నాయి. ఉద్యోగులను వదిలించుకుంటున్నాయి? దీనికి ఎవరు బాధ్యులు! ఐటి అంటే ఆశల ప్రపంచం అని చెప్పి, ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నదెవరు? ప్రపంచమంతాటా ఇదే పరిస్థితి వుందంటూ ప్రచారం చేస్తున్నదెవరు? ఇంత పెద్ద జనాభా వున్న మన దేశం దేశీయ సంస్థలకన్నా విదేశీ సంస్థలే ఎందుకున్నాయి. విదేశాలలో ఐటి విద్య రంగాన్ని ప్రభుత్వాలు గుప్పిట్లో పెట్టుకున్నాయి. మన దేశంలో ఏం జరుగుతోంది? ఐటి కంపెనీలు పెట్టండి. అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి పిలిపించారు. ఉద్యోగ కల్పన పేరుతో ఆ కంపెనీలకు అనేక రాయితీలు కల్పించారు. ఇప్పుడు అవే కంపెనీలు తమ ఉద్యోగులలో స్కిల్స్ లేవని తొలగిస్తున్నారు. ప్రాజెక్టులు లేవని ఇంటికి పంపిస్తున్నారు. సామ్యవాదం నుంచి ఉమ్మడి ఆర్థిక వ్యవస్థకు మారడమే మన ప్రభుత్వాలు చేసిన తప్పా? ఉద్యోగులకు ఉద్యోగ భద్రత అవసరం లేదా? రాత్రికి రాత్రే ఉద్యోగులను తొలగిస్తూ పోతుంటే పట్టించుకునే వాళ్లు లేరా? ఐటి డ్రీమ్స్ ఢమాల్ మంటున్నాయా? ఇది నిజమైన వార్తేనా? సీనియర్ ఉద్యోగులకు లక్షల రూపాయల జీతాలు ఇవ్వడానికి కంపెనీలకు మనసొప్పడం లేదా? ఒకప్పుడు ఐటి ఉద్యోగులకు ఎంతో జాగ్రత్తగా చూసుకున్న కంపెనీలు ఇప్పుడు ఎందుకు వదిలించుకుంటున్నాయి. వారి జీతాలు మోయలేని భారాలౌతున్నాయా? కంపెనీలు నష్టపోతున్నాయా? ఇదంతా దిగ్గజ సంస్థల కమాల్ కాదా? అప్పటి చదువులకు ఇప్పటి చదువులకు తేడాలెక్కడ వచ్చాయి? ఒకప్పుడు ఉద్యోగాలు చేస్తున్న వారికే ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్పేవారు. ఇప్పుడు కూడా ఏఐ అనే టెక్నాలజీని ఆ ఉద్యోగులు నేర్చుకోవడం కష్టమా? వారికి అంత స్కిల్ లేదని నిర్థారించుకుంటున్నారు. దేశీయ దిగ్గజ సంస్థ టిసిఎస్ కూడా విదేశీ సంస్థల బాటలో ఎందుకు నడుస్తున్నాయి. ఐటి కంపెనీలు నడపలేమని చేతులెత్తేస్తున్నాయా? ఉద్యోగులకు తొలగించే ఉపాయాలు పన్నుతున్నాయా? ఒకరిని చూసి మరొకరు అన్నట్లు కంపెనీలన్నీ ఉద్యోగులను తొలగించుకోవడానికే నిర్ణయం తీసుకున్నాయా? టాటా కంపెనీ కూడా ఒక్కసారిగా 12 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించడం దుర్మార్గమైన చర్య. ఏఐ పేరుతో ఉద్యోగుల తొలగింపు సరైంది కాదు. మన దేశంలో ఇప్పటి వరకు ఏఐ టెక్నాలజీ మీద పట్టున్న ఐటి రంగ నిపుణులు కేవలం 20 శాతం మాత్రమే వున్నారా? భవిష్యత్తులో ఏఐ వస్తుందన్న సంగతి ఉద్యోగులకు తెలియదా? లేక కంపెనీలకే తెలియదా? పొరపాటు ఎక్కడ జరిగింది. ఇదంతా కంపెనీలు ఆడుతున్న నాటకం. జీతాలు పెంచలేక కోతలు పెడుతున్నారు అనేది ముమ్మాటికీ నిజం. ఇది అందరికీ తెలిసిన సత్యం. కానీ దానికి మసిబూసి మారేడు కాయ చేసి, ఏఐ టెక్నాలజీని అందుకోలేకపోతున్నారనే నెపంతో వదిలించుకోవడం సరైన పద్ధతి కాదు. విధానం అసలే కాదు. మన టెక్నాలజీ నిపుణులను ఒక రకంగా అవమానించడమే అవుతుంది. వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయడమే అవుతుంది. తాము ఇక భవిష్యత్తుకు పనికి రామా? అనే న్యూనతా భావంలోకి నెట్టివేయడమే అవుతుంది. ఏఐ పేరుతో ఉద్యోగులను తొలగించడం ఒక వంకల మాత్రమే. దీనిని ఎవరు ప్రశ్నించాలి. ఇలాంటి సందర్భం ఒకటొస్తుందని ఉద్యోగులు ఊహించలేకపోవడం కూడా తప్పే. ఉద్యోగ భద్రతపై ఉద్యోగుల నిర్లక్ష్యం కూడా కారణమే. ఎప్పటికైనా ఉపద్రవం రాకపోదన్న ముందు చూపు లేకపోవడం కూడా ఉద్యోగుల వైఫల్యమే. ప్రతి వ్యవస్థలో ఒక సంఘటిత వ్యవస్థ వుంటుంది. ఐటికి అది లేకపోవడంతో కూడా ఇలాంటి పరిస్థితికి కారణమౌతుంది. గతంలో కంపెనీకి వచ్చి కూర్చుంటే చాలు, ట్రైనింగ్ మేమే ఇస్తామన్నారు. ఇప్పుడు మీకు ప్రపంచంతో పోటీ పడే శక్తి లేదని తరిమేస్తున్నారు. మొత్తానికి సీనియర్లకు ఇచ్చే జీతాల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. జూనియర్లతో తక్కువ జీతాలతో పని చేయించుకోవాలనుకుంటున్నారు. సీనియర్కిచ్చే జీతంతో నలుగురుని రిక్రూట్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికీ ఐటి కంపెనీలు లాభాలు 400 శాతంతోనే వున్నాయి. నష్టాలతో నడుస్తున్నాయని చెప్పడంలో నిజం లేదు. అర్థం లేదు. అయినా ఉద్యోగులను వదులుకుంటున్నాయి! ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నదే ఐటి రంగం. ఇలాంటి పరిణామాలు భారత అర్థిక వ్యవస్థను కుదేలు చేస్తాయని చెప్పడంలో సందేహం లేదు. లక్షలాది మంది జీవితాలను వీధిపాలు చేస్తాయి. ఉద్యోగాలు పోయి నిరుద్యోగులుగా మిగిలిపోయే ప్రమాదం వుంది. ఉద్యోగాలు పోగొట్టుకోవడమే కాదు, అప్పుల పాలౌతారు. ఉద్యోగాన్ని నమ్ముకొని అనేక రకాల ఖర్చులు చేశారు. స్థిర, చరాస్థులు కొనుగోలు చేసుకున్నారు. వారి పిల్లల భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్లంతా ఒక్కసారిగా బజారున పడతారు. ఉద్యోగాలను నమ్ముకొని చేసిన రుణాలు తీర్చలేక అవస్థలు పడతారు! ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి. ఐటికి కూడా కార్మిక చట్టాలు అమలు జరిగేలా చూడాలి. అవసరమైతే విదేశీ సంస్థలకిచ్చిన భూములు వెనక్కి తీసుకోవాలి. ఆ కంపెనీలు ప్రభుత్వం చేతిలో వుండేలా నిర్ణయాలు తీసుకోవాలి. లేకుంటే లక్షలాది మంది జీవితాలు ఆగమౌతాయి. కుటుంబాలు అస్తవ్యస్తమౌతాయి.