Field Day Organ
క్షేత్ర దినోత్సవంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించిన వ్యవసాయ అధికారులు
రామడుగు, నేటిధాత్రి:
రైతు స్థాయిలో విత్తనోత్పత్తిని ప్రోత్సహించలనే సదుద్దేశంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామంలో ముగ్గురు రైతులకు, పరిశోధనా కేంద్రాల్లో అభివృద్ధి చేసిన నాణ్యమైన విత్తనాన్ని గ్రామగ్రామాన నాణ్యమైన విత్తనం (క్వాలిటీ సిడ్ ఇన్ ఎవ్రి విలేజ్-క్యూఎస్ఈవి) అనే కార్యక్రమo ద్వారా సరఫరా చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లి గ్రామంలో వరి (జేజిఎల్ – 24423) పొలంలో క్షేత్ర దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా గ్రామానికి చెందిన సత్యనారాయణరెడ్డి అనే రైతు తన అనుభవాన్ని, జేజిఎల్-24423 రకంలో విత్తనోత్పత్తి గురించి తను తీసుకున్న జాగ్రత్తలను తోటి రైతులకు వివరించారు. అనంతరం వ్యవసాయ పరిశోధన స్థానం కరీంనగర్ ప్రధాన శాస్త్రవేత్త డా.బి. రాంప్రసాద్ మాట్లాడుతూ రైతు స్థాయిలో విత్తనోత్పత్తి వల్ల కలిగే ప్రయోజనాలు మరియు వరిలో పురుగుల, తెగుళ్ళ యాజమాన్యం గురించి వివరించిన అనంతరం శాస్త్రవేత్తలు డా.జి.ఉషారాణి, ఇ.ఉమారాణిలు మాట్లాడుతూ విత్తనోత్పత్తి క్షేత్రాల్లో బెరుకుల తీసివేత గురించి తెలియజేశారు. ఈకార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి త్రివేదిక, వ్యవసాయ విస్తరణ అధికారి రమేష్, ఇతర రైతులు పాల్గొన్నారు. ఈసందర్భంగా గ్రామానికి చెందిన కొంతమంది రైతులు స్వయంగా ఉత్పత్తి చేసిన ఇదే విత్తనాన్ని రానున్న పంట కాలానికి వినియోగీస్తామని వారి సుముఖతను అధికారులకు తెలియజేశారు.
