
BC Leaders Threaten Post-Dasara Protest
దసరా తర్వాత దండయాత్రే..!
-వేముల మహేందర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో 42 శాతం రిజర్వేషన్లను పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని, దసరా పండుగ లోపు బీసీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే పండుగ తర్వాత లక్ష మందితో బీసీల రాజకీయ యుద్ధభేరి మహాసభను నిర్వహించి ప్రభుత్వంపై దండయాత్ర చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం మహేందర్ గౌడ్ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. 22 నెలలుగా బీసీలు రిజర్వేషన్లను పెంచాలని పోరాటం చేస్తుంటే..కేంద్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని, బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అంటుంటే..ఇంకొక వైపు మైనార్టీ రిజర్వేషన్లను బూచిగా చూపిస్తూ..కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు రిజర్వేషన్లను పెంచకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లను పెంచాలని రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు మద్దతు ప్రకటిస్తున్న రాజకీయ పార్టీలు వాటి ఆమోదం కోసం చివరి వరకు కృషి చేయడం లేదన్నారు. రాజకీయ ఎజెండాతోనే పని చేస్తున్నారు తప్ప బీసీ రిజర్వేషన్లపై ఏ రాజకీయ పార్టీ చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లను పెంచాలని ఇప్పటివరకు పార్టీలను గదుమ పట్టి అడిగామని, నేటి నుంచి ఎవరిని దేహి అని అడిగేది లేదని, నిలదీయడానికి దసరా తర్వాత పోరాటాలకు పురిటి గడ్డ అయినా భువనగిరిలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనన్న నేతృత్వంలో లక్ష మందితో బీసీల రాజకీయ యుద్ధభేరి మహాసభను నిర్వహించి..రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలను భూస్థాపితం చేస్తామని మహేందర్ గౌడ్ హెచ్చరించారు.