సెలబ్రిటీలతో ప్రకటనలు.!..రియల్‌ మోసాల ఉచ్చులో సమిదలవుతున్న సామాన్యులు.!

`సెలబ్రిటీలతో ప్రకటనలు

`చాలా సందర్భాల్లో మోసపోయేది వినియోగదారులే

`మార్కెట్‌ మాయాజాలం ఎప్పుడూ భ్రమింపజేస్తుంది

`కొనుగోళ్లకు ముందు కంపెనీ ట్రాక్‌ రికార్డు అధ్యయనం చేయడం అవసరం

`ప్రకటనలో పాల్గనేముందు ట్రాక్‌ రికార్డు అధ్యయనం చేయడం సెలబ్రిటీలకు అవసరం

`తమ ప్రభావం సమాజంపై ఉన్నప్పుడు దీన్ని నైతిక బాధ్యతగా స్వీకరించాలి

`డబ్బు తీసుకున్నాం…మాకు సంబంధం లేదనుకోవద్దు

`సెలిబ్రిటీలపై గుడ్డి విశ్వాసంతో కొనుగోళ్లకు ముందుకొచ్చే ప్రజలే అధికం

`సమిధలయ్యే జీవితాలకు ఎవరు బాధ్యులు?

`ఇల్లు కొనడం మిగిలిన వస్తువుల మాదిరి కాదు

`ఎన్నో జాగ్రత్తలు తీసుకొని అడుగు ముందుకెయ్యాలి

హైదరాబాద్‌,నేటిధాత్రి:
రియల్‌ ఎస్టేట్‌ మోసాలు పలురకాలుగా బయటపడుతున్న నేపథ్యంలో కొనుగోలుదార్లు స్థిరాస్తి గోలు విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్రంగా నష్టపోక తప్పడంలేదు. కొన్ని రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు టాలివుడ్‌ లేదా బాలీవుడ్‌ సెలబ్రిటీలను తమ బ్రాండ్‌ అంబాసిడర్లుగా వ్యాపారాన్ని పెంచు కోవడానికి ఉపయోగించుకుంటుండటంతో ప్రజలు తమ హీరోలు లేదా హీరో యిన్లపై పెంచుకున్న విపరీత అభిమానం, గుడ్డి నమ్మకంతో ఆయా వెంచర్లలో కొనుగోళ్లు చేసి తర్వాత సదరు కంపెనీ బోర్డు తిప్పేసినా లేక చేపట్టింది అక్రమ నిర్మాణమని తేలినా నిండా మునుగుతున్నారు. సరిగ్గా ఇటువంటి సంఘటనే ఈమధ్య జరిగింది. నైజీరియాకు చెందిన ఒక ప్ర వాస భారతీయుడు ఒక రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ చేసిన మోసానికి ఏకంగా 30.6మిలియన్‌ యు.ఎస్‌. డాలర్లు (రూ.3.6కోట్లు) నష్టపోయాడు. కొండాపూర్‌ ప్రాంతంలో మంచి డిమాండ్‌ ఉండే భూమిని ఇస్తామని ఆశచూపి, అతని వద్దనుంచి అవసరమైన మొత్తం అందగానే సదరు రియల్టర్‌ పత్తాలేడు. విచిత్రమేమంటే ఈ మోసపూరిత కంపెనీకి ఒక టాలీవుడ్‌ హీరో బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేశారు. భవిష్యత్తులో భూమిరేటు పెరుగుతుందన్న ఆశతో రియల్టర్‌ చూపిన ఆశకు 2100 చదరపు గజాలస్థలం కోసం చెల్లించిన మొత్తం బూడిదలో పోసిన పన్నీరు కావడంతో ప్రస్తుతం అతడు సైబర్‌ పోలీసులను ఆశ్రయించాడు. సదరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిపై క్రమినల్‌ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని బోగస్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలుసెల బ్రిటీలను ఏవిధంగా మోసం చేస్తాయో తెలియజెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇది వెలుగులోకి రావడంతో అందరికీ తెలిసింది. మోసపోయి ఏమీ చేయలేక నిస్సహాయంగా మిగిలిన సామాన్యులు ఇంకెంతమంది ఉన్నారో?
2012లో హైదరాబాద్‌కు సమీపంలో ఒక రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ పెద్ద వెంచర్‌ను మొదలుపెట్టిదానికి ఒక బాలీవుడ్‌ నటిని బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుంది. తర్వాత ఆ కంపెనీ ప త్తాలేకపోవడంతో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సదరు బాలీవుడ్‌ నటిని పిలిచి ఈ విష యంలో తాను చెప్పదలచుకున్నదేదో వివరించాలని కోరాల్సివచ్చింది. సెలబ్రిటీలను రోల్‌మోడల్‌గా భావించే భారతీయ సమాజంలో వారు చెప్పే విషయాలను ప్రజలు గుడ్డిగా నమ్మడం ఒక బలహీనత కాగా, ప్రజల మనోఫలకాలపై బలమైన ముద్రవేయగలిగే స్థితిలో ఉన్న సెలబ్రిటీలు తాము ఒక కంపెనీ ప్రకటనలో పాల్గంటున్నప్పుడు సదరు కంపెనీ నిజాయతీ దాని నేపథ్యాన్ని పరిశీలించకుండా కేవలం డబ్బుకే ప్రాధాన్యమివ్వడం మరో తప్పిదం. డబ్బు అవసరమే…కానీ డబ్బే సర్వస్వం కాదు. డబ్బు తీసుకొని ప్రకటనకు సంబంధించిన షూటింగ్‌లో పాల్గన్నాం…అంతవరకే మా బాధ్యత…కంపెనీకి తమకు ఎటువంటి సంబంధం లేదని ఒకవేళ సెలబ్రిటీలు వా దించవచ్చు. ఇక్కడ సదరు సెలబ్రిటీ…కంపెనీకి మధ్య లావాదేవీ అయినప్పుడు ఎవ్వరూ ప్రశ్నించరు. కానీ దీని ప్రభావం సమాజంపై పడుతున్నప్పడు, వారు తమ సామాజిక బాధ్యతనుంచి తప్పించుకోలేరు. ఇక్కడ ప్రజలు కూడా ఒక సెలబ్రిటీ చెప్పాడు కదా అని గుడ్డిగా ముందుకు పో కుండా, అన్నీ బేరీజు వేసుకొని అడుగులు ముందుకు వేయకపోతే నిండా మునిగేది వీళ్లే. ఎందుకంటే వీరు చెల్లించే డబ్బునుంచే, కంపెనీలు సెలబ్రిటీలకు ప్రకటన రెమ్యూనిరేషన్‌ చెల్లిస్తాయ న్న సంగతి గుర్తుంచుకోవాలి. అంతేకాదు సెలబ్రిటీలు దేవుళ్లేం కాదు. అయితే బ్రాండ్‌ వ్యూహ కర్తలు చెప్పేదేమంటే…సెలిబ్రిటీ బ్రాండ్‌ అంబాసిడర్లపై విపరీత అభిమానం లేదా అంతటివాడు చెప్పిన తర్వాత తిరుగుండదనే ఒక గుడ్డినమ్మకం రూపంలోని బలహీనత ప్రజలను మరో ఆలోచన లేకుండా ముందుకెళ్లడానికే ప్రేరేపిస్తుంది. దీన్నే వివిధ కంపెనీలు సొమ్ము చేసుకోవడానికి పెద్ద సెలిబ్రిటీలను బ్రాండ్‌ అంబాసిడర్లుగా తమ వెంచర్లను ప్రమోట్‌ చేసుకోవడంలో నియోగి స్తుంటారు. ఇందుకోసం వారి రెమ్యూనరేషన్‌ కూడా కోట్లలో ముట్టచెప్పడానికి వారు వెనుకాడరు.
సెలిబ్రిటీలు అంబాసిడర్లుగా వుండటం కేవలం రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌కే పరిమితం కాదు. వివిధ రకాల ఉత్పత్తులకు కూడా వీరు ఎండార్సర్లుగా కొనసాగుతారు. ముఖ్యంగా వివిధ కంపెనీలు తమ మార్కెట్‌ను మరింత బలోపేతం చేసుకోవడానికి సెలిబ్రిటీలను అబాసిడర్లుగా ఉపయోగిస్తాయి. కంపెనీలు ప్రమోట్‌ చేసే వాటికి సెలిబ్రిటీల గ్లామర్‌ ఒక ప్రధాన మా ర్కెట్‌ ఉపకరణంగా ఉపయోగపడుతుంది. అంతేకాదు వీరివల్ల గుడ్‌విల్‌ మాత్రమే కాదు విశ్వసనీయత పెరుగు తుందన్న నమ్మకమే రియల్‌ ఎస్టేట్‌నుంచి వివిధ రకాల ఉత్పత్తులకు సెలిబ్రిటీలను అంబాసిడర్లుగా వినియోగించుకోవడానికి ప్రధాన కారణం. ప్రధానంగా రియల్‌ ఎస్టేట్‌లో కూడా బ్రాండ్‌ గుర్తింపుకోసం సెలిబ్రిటీలు ఎంతగానో దోహదం చేస్తారు. ఇందుకు ప్రధాన కారణం భారత ప్రజ ల్లో సెలిబ్రిటీలపై వున్న విశ్వసనీయత. ముఖ్యంగా ఒక ప్రాజెక్టు తొలిదశలో ఈ బ్రాండ్‌ అంబాసిడర్లు (ఎండార్సర్లు) వల్ల బూస్ట్‌ ఏర్పడుతుంది. ఫలితంగా ఆ ప్రాజెక్టును అభివృద్ది చేసే వ్యక్తులపై కూడా ఒక నమ్మకం కలుగుతుంది. అయితే ఇల్లు కొనుగోలు అనేది కేవలం మిగిలిన ప్రాడక్ట్‌ల వంటిది కాదు కనుక కేవలం ఎండార్సర్లపై ఆధారపడి ముందుకెళ్లడం వినియోగదార్లకు అంత శ్రేయస్కరం కాదు. అందువల్ల బయ్యర్లు లేదా మదుపర్లు ముందుగా సదరు ప్రాజెక్టు అభివృద్ధి చేస్తున్న వ్యక్తులు లేదా కంపెనీల ట్రాక్‌ రికార్డును క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే అడుగు ముందుకెయ్యాలి.
తప్పుడు ప్రకటనల్లో పాల్గనే సెలిబ్రిటీలను కూడా బాధ్యులను చేయాలన్న ప్రతిపాదనను ప్రభు త్వం ముందుకు తెచ్చింది. దీనిపై న్యాయ నిపుణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వర్గం చెప్పేదేమంటే, కేవలం సెలబ్రిటీల పాత్ర ఒక ప్రాజెక్టుకు సంబంధించిన గ్లామర్‌ను పెంచడానికి మాత్రమే పనికొస్తుంది తప్ప మరేవిధంగా ఉపయోగపడదు. అటువంటప్పుడు వారిని ఇందుకు బాధ్యులను చేయడం సమంజసం కాదనేది వారి వాదన. కేవలం ఒక ప్రాజెక్టు లేదా ఉత్పత్తికి సంబంధించిన ఓనర్లు మాత్రమే తప్పుడు ప్రకటనలకు బాధ్యులు కనుక వారు శిక్షార్హులవుతారన్నది వీరు చెప్పేమాట. అదీ కాకుండా ఉత్పత్తి దారు, అంబాసిడర్‌ మధ్య ఎటువంటి కాంట్రా క్టు ఒప్పందం ఉండదు కనుక ఒక కంపెనీకి సంబంధించి ప్రకటన విషయంలో అంబాసిడర్‌కు ఎటువంటి సంబంధం వుండదని, కేవలం సదరు కంపెనీ మాత్రమే అందుకు బాధ్యత వహిం చాలన్నది వీరి అభిప్రాయం. అయితే మరో వర్గం వాదన ఏంటంటే ఒక సెలిబ్రిటీ ఒక ప్రాజెక్టు లేదా ప్రోడక్ట్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వుండాలంటే చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సిందే. ఎందుకంటే తప్పుడు ప్రకటనల ప్రభావం వల్ల సామాన్యులు బాధితులుగా మారే అవకాశాలు మెండు. ఆవిధంగా జరిగాయి కూడా. ఇదే సమయంలో చాలా సందర్భాల్లో ఒక కంపెనీ ప్రాజెక్టు లేదా ప్రోడక్ట్‌ విషయాలపై ఎండార్సర్లకు పెద్ద అవగాహన వుండటంలేదు. ఆ యా కంపెనీలు తమను ఉపయోగించుకొని మోసాలకు పాల్పడతాయన్న అవగాహన లేకపోవ డం కూడా చాలా సందర్భాల్లో కనిపిస్తోందని వారి వాదన. ఈ నేపథ్యంలో ఎండార్సర్లుగా వుండేముందు క్షుణ్ణంగా అధ్యయనం చేసి, సదరు కంపెనీ ట్రాక్‌ రికార్డును పరిశీలించి మాత్రమే ముందడుగు వేయాలని వారు సెలిబ్రిటీలకు సలహా ఇస్తున్నారు. ఇదిలావుండగా కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ (సీఏఐటీ) చెప్పేదేమంటే, బ్రాండ్‌ అంబాసిడర్లుగా ఉన్న సెలిబ్రిటీలు కూడా సెల్లింగ్‌ ఏజెంట్లగానే వ్యవహరిస్తున్నారు కనుక వారిని కూడా బాధ్యులను చేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నది.
తన ఉత్పత్తికి సంబంధించి ఏదైనా ఒక కంపెనీ మరియ సెలబ్రిటీల మధ్య కుదిరిన అంగీకారా న్ని ఎండార్స్‌మెంట్‌ అంటారు. 2019 వినియోగదారుల హక్కుల చట్టంలోని సెక్షన్‌ 2(18) ఎండార్స్‌మెంట్‌ను ఒక విధమైన సందేశం లేదా ప్రకటన లేదా వివరణగా పేర్కొంటున్నది. ఇదే చ ట్టంలోని సెక్షన్‌ 21(2) ప్రకారం తప్పుడు ప్రకటన ఇస్తే రూ.లక్ష వరకు జరిమానా విధించవచ్చు. సెక్షన్‌ 21(3) ప్రకారం అటువంటి ఎండార్సర్‌ ఇక ముందు మరే ఇతర ఎండార్స్‌మెంట్స్‌ చే యడానికి వీల్లేదు. ఒకవేళ ఎండార్సర్‌ కనుక ఒక వస్తువు లేదా ఉత్పత్తికి సంబంధించిన ప్రకటన విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే 21(5)ప్రకారం అతను శిక్షార్హుడు కాడు.
మొత్తంమీద చెప్పాలంటే సెలబ్రిటీలు ఒక ప్రకటనలో పాలుపంచుకునే ముందు, సమాజంపై దీని ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని, సదరు ప్రోడక్ట్‌ లేదా ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు తెలుసుకొని ముందుకెళ్లడ మనేది నైతిక బాధ్యతగా స్వీకరించడం చాలా అవసరం.
ఎన్ని వాదనలు వినిపించినా, కొనుగోలు చేసేవారు తాము కొనుగోలు చేసే ఇల్లు, స్థలం లేదా వస్తువుపై కనీస అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. ఒకళ్లు చెప్పారని కాకుండా, తనకు ఎంతవరకు సమంజసమో, ఎంతవరకు ఉపయోగకరమో క్షుణ్ణంగా తెలుసుకొని అడుగు ముం దుకేస్తే నష్టపోకుండా సురక్షితంగా వుండగలడు. నేడు మార్కెట్‌ మాయాజాలం, వినియోగదారులనుంచి కొనుగోళ్లు జరిపించడం ద్వారా లాభం పొందాలనే చూస్తున్నది తప్ప, వారు చెల్లించిన మొత్తానికి తగిన సేవ అందించాలన్న దృక్పథం కొన్ని కంపెనీలు లేదా వ్యక్తులకు మాత్రమే వుంటోంది. బియ్యంలో రాళ్లు ఎలా ఏరివేస్తామో, కొనుగోలు మార్కెట్‌లోకి ప్రవేశించే ముందు, తప్పుడు కంపెనీలు, వెంచర్లను కూడా అదేవిధంగా పక్కనబెట్టి, నిజాయతీగా వ్యవహరించే వాటిని గుర్తిస్తే తప్ప వినియోగదారుడు న్యాయం పొందలేడు. డబ్బును ఔషధం మాదిరిగా అవసరానికి తగిన విధంగా జాగ్రత్తగా ఉపయోగిస్తే జీవితం సాఫీగా సాగిపోతుంది. మద్యం మాదిరిగా విచ్చలవిడిగా తప్పుడు నిర్ణయాలకు ఉపయోగిస్తే పతనమే మిగులుతుంది! ఈ సత్యాన్ని గుర్తించిన వారిని ఏ ప్రకటనలూ ఏమీ చేయలేవు! వారిని మోసపుచ్చలేవు! ఆ స్థాయికి సమాజం ఎదగాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!