
నస్పూర్,(మంచిర్యాల) నేటి ధాత్రి:
చిన్నతనం నుండి క్రీడల పట్ల ఆసక్తితో,బాక్సింగ్ రంగంలో పట్టు సాధించి స్పోర్ట్స్ కోటాలో ఆదర్శ్ సాధించిన ఉద్యోగం మిగతా క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని మంచిర్యాల జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి బోయిని రాజకుమార్ ఆనందం వ్యక్తం చేశారు.మంగళవారం శ్రీరాంపూర్ – నస్పూర్ ప్రెస్ క్లబ్ లో జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారుడు ఆదర్శ్ కి ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించి ట్రైనింగ్ పూర్తి చేసుకొని వచ్చిన భాసాని ఆదర్శ్ ని జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ తరపున ప్రశంసించారు. బాక్సింగ్ సీనియర్ కోచ్ చైర్మన్ మైసూర్ శిక్షణలో గతంలో పదుల సంఖ్యలో క్రీడాకారులు స్పోర్ట్స్ కోటాలో కేంద్ర, రాష్ట్ర పోలీస్ శాఖలలో ఉద్యోగాలను సాధించి సేవలందిస్తున్నారని పేర్కొన్నారు.భవిష్యత్తులో కూడా అదే స్ఫూర్తితో గురువుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని క్రీడాకారులకు తమ వంతు సహాయ సహకారాలు అందించడంలో ఎప్పుడు సిద్ధంగా ఉంటామని అన్నారు. జిల్లాలో బాక్సింగ్ అసోసియేషన్ ఏర్పడిన అనతి కాలంలోనే ఎన్నో విజయాలను నమోదు చేసుకుందని తెలిపారు.భవిష్యత్తులో కూడా జిల్లాలో బాక్సింగ్ ఫౌండర్ కే ఈ దాస్ ఆశయాలను ముందుకు తీసుకు వెళ్తూ బాక్సింగ్ క్రీడను మారుమూల గ్రామాల్లో ఉన్న క్రీడాకారులకు అందేలా కృషి చేస్తామని అన్నారు.ఇటీవల ఆలిండియా యూనివర్సిటీ స్థాయి పోటీలలో పాల్గొని వచ్చిన ఒల్లాల గణేష్ ని ప్రత్యేకంగా అభినందించారు.జిల్లాలో అసోసియేషన్ ద్వారా నిర్వహించబడే వేసవి శిక్షణ శిబిరాలను క్రీడాకారులు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పాదం రవీందర్,చైర్మన్ నిట్టూరు మైసూర్ చిరంజీవి, కోచ్ లు జగత్ సాయి,సందీప్, ఫెన్సింగ్ సీనియర్ క్రీడాకారుడు బోయిని అశోక్,అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.