-ఎల్లవేళలా పార్టీకి అండగా నిలిచేది వాళ్లే!
-పార్టీ కోసం కష్టాలు పడతారు!
-కష్టకాలం కన్నీళ్లతో కాలం వెళ్లదీస్తారు.
-పార్టీ కోసం ప్రాణాలు ఫణంగా పెడతారు.
-పార్టీ అధికారంలో వున్నా లేకున్నా అండగా వుంటారు.
-అన్ని పరిస్థితులను ఎదుర్కొని జెండాలు మోస్తారు.
-ఆకలిని భరిస్తారు..ఆవేదనలు దిగమింగుతారు.
-కాలానికి ఎదురు తిరిగి కండువా కప్పుకుంటారు.
-పార్టీ అధికారంలోకి తెచ్చేదాక కంటినిండా కునుకుతీయరు.
-ఆస్థులమ్ముకొని జెండాలు కడుతారు.
-పార్టీలు అధికారంలోకి రాగానే వారిని వెనక్కి నెట్టేవాళ్లొస్తారు.
-అవకాశ వాదులు ముందుకు తోసుకొస్తారు.
-వారికి అవకాశం ఇవొద్దు!
-నాయకులను దూరం పెట్టొద్దు!
-భవిష్యత్తు పేరు చెప్పి కాలయాపన చేయొద్దు.
-అధికారంలో వున్నప్పుడే వారికి గుర్తింపు ఇవ్వాలి.
-అందివచ్చినప్పుడే అవకాశాలు కల్పించాలి.
-పార్టీకి భవిష్యత్తే వాళ్లు..వాళ్లను నిర్లక్ష్యం చేయొద్దు!
-పార్టీలో విద్యావంతులున్నారు.
-విద్యార్థి నాయకులున్నారు.
-రాష్ట్ర పరిస్థితుల మీద అవగాహన వున్న వాళ్లు అనేకం వున్నారు.
-వారి సేవలు పార్టీకి అవసరం.
-సమాజం మీద వారికున్న పట్టు ప్రభుత్వానికి మరెంతో అవసరం.
-వారికి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి.
-అసలైన కార్యకర్తలకు న్యాయం చేయండి!
-మాయ మాటలు చెప్పే వారు ఇప్పుడు చుట్టూ మూగుతారు.
-అబద్దాలు చెప్పి అధిష్టానాన్ని తప్పు దోవ పట్డిస్తారు.
-స్వార్థపరులంతా ఏకమై, అసలు కార్యకర్తలను చెదరగొడతారు.
-అధిష్టానానికి దూరం చేస్తారు…
-ఒకరకంగా వాళ్లే దూరం కొట్టిస్తారు.
-మాయ మాటలు చెప్పి లబ్ధి పొందుతారు.
-అధికారం ఎక్కడుంటే అక్కడ వాలిపోతారు.
-పార్టీకి కష్టకాలమొస్తే ముఖం చాటేస్తారు.
-గోడలు దుంకేందుకు సిద్ధంగా వుంటారు.
హైదరాబాద్,నేటిధాత్రి:
నిజం చెప్పాలంటే తెలుగు దేశం పార్టీలో వృద్ద తరం పెరిగిపోయింది. కొత్త తరం రెడీగా వుంది. నిన్నటి తరం నాయకుల పుణ్యమా అని కొత్త పురుడుపోసుకున్నది. కానీ వాళ్లకు ఇంకా పూర్తి స్థాయిలో అవకాశాలు రావడం లేదు. ఇప్పటికీ తెలుగు దేశం ఆవిర్భావం నుంచి పార్టీ కోసం దశాబ్దాలుగా సేవలు చేస్తున్న నాయకులు అనేక మంది వున్నారు. ఆ కుటుంబాలు పార్టీకి కంచుకోటగా మారిపోయారు. రాజకీయ పార్టీ అంటేనే ఒక నదీ ప్రవాహం లాంటిది. తెలుగుదేశం పార్టీలోకి ఎంతో మంది నాయకులు వచ్చారు. వెళ్లిపోయారు. స్వార్థం చూసుకున్న వాళ్లు పార్టీని వదిలేశారు. పార్టీ కోసం ఇంకా అవకాశాలు రాకున్నా సేవ చేస్తున్న వారు అనేక మంది నాయకులున్నారు. నిన్నటి తరం నాలుగు దశాబ్దాలుగా సేవలందిస్తున్నారు. కొత్త తరం ఎప్పుడూ వస్తూనే వుంటుంది. అలా వచ్చిన వాళ్లు యువకులుగా పార్టీలో చేరి, సేవలు చేస్తున్నారు. యువతలో రకరకాల మనస్తత్వం వున్న వారుంటారు. రకరకాల ఆశయాలుండే వారు వుంటారు. భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేస్తుంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను ఆదర్శంగా రాజకీయాలలోకి వచ్చిన వారు తెలుగు దేశం పార్టీలో కొన్ని వేల మంది వున్నారు. వాళ్లంతా ఉన్నత విద్యావంతులు. యూనివర్సిటీలలో విద్యార్థి రాజకీయాలను అవపోసన పట్టిన వారున్నారు. యూనివర్సిటీ చదువు తర్వాత ఏదో ఉద్యోగమో, వ్యాపారమో చేసుకునే వాళ్లే ఎక్కువగా వుంటారు. కానీ కొద్ది మంది మాత్రమే సామాజిక సేవ చేయాలనుకునే వారు వుంటారు. సామాజిక సమస్యల మీద స్పందిస్తూ వుంటారు. సామాజిక రుగ్మతల మీద పోరాటం చేస్తుంటారు. సమాజ చైతన్యం కోసం ఆలోచిస్తుంటారు. సామాజిక ప్రగతి కోసం పాటు పడుతుంటారు. విద్యార్థి దశ నుంచి రాజకీయాల వైపు మళ్లి, సామాజిక బాధ్యతలను భుజాన వేసుకుంటారు. ఆయా పరిస్థితులలో రాజకీయ వేధికను ఎంచుకుంటారు. ఆదర్శవంతమైన రాజకీయం కోసం స్పూర్తిగా నిలిచిన నాయకుల బాటలో నడుస్తుంటారు. అలాంటి వారిలో తిరుపతికి చెందిన అనిమిని రవి నాయుడు ఒకరు. విద్యార్థి రాజకీయాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆదర్శంగా తీసుకొని రాజకీయాలకు వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలోనే రాజకీయాల రూపు రేఖలనే మార్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు. నాయకుడు అంటే ఏసి గదులలో వుండే వారు కాదు, నిత్యం, అను నిత్యం, అనుక్షణం ప్రజల మధ్యనే వుండాలని కొత్త బాష్యం చెప్పి, ఆచరించిన నాయకుడు చంద్రబాబు నాయుడు. రాజకీయాలలోకి వచ్చిన కాలం నుంచి చంద్రబాబు నాయుడు లాగా నిత్యం ప్రజల్లోనే వున్న నాయకులు దేశంలో ఎవరూ లేరు. గెలిచినప్పుడు రాజకీయాలు చేయడం, ఓడిపోయినప్పుడు ప్రజలకు దూరంగా వుంటారు. కానీ పార్టీ గెలిచినా, ఓడినా నిరంతరం ప్రజల్లో వుండే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు మాత్రమే. అలాంటి చంద్రబాబు నాయుడును స్పూర్తిగా రాజకీయాలలోకి వచ్చి నిరంతరం ప్రజల్లో వుండే నాయకులు తెలుగు దేశం పార్టీలోనే ఎక్కువ మంది వున్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి ప్రజాసేవ చేస్తున్న నాయకులలో తిరుపతికి చెందిన, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిమిని రవి నాయుడు అందరికన్నా ముందున్నారు. పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా పార్టీ పునాదులే కార్యకర్తలు! ఈ విషయం విస్మరించిన పార్టీలు మనుగడ సాగించిన దాఖలాలు లేవు. గతంలో తెలుగు దేశం పార్టీ ఓడిపోయిన సందర్భాలలో ప్రతిసారీ చంద్రబాబు నాయుడు కూడా ఇదే విషయాన్ని అంగీకరించారు. 2004 ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ప్రభుత్వ కార్యకలాల మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సి రావడం వల్ల పార్టీకి, ప్రభుత్వానికి కొంత గ్యాప్ వచ్చింది. దాని వల్లనే ఈ అనర్థం ఏర్పడిరదని చెప్పారు. 2019 ఎన్నికలలో పడిపోయినప్పుడు కూడా అమరావతి నిర్మాణం కోసం సమయం ఎక్కువ కేటాంచడంతో కార్యకర్తలకు అన్యాయం జరిగిన మాట వాస్తవం అని కూడా అంగీకరించారు. భవిష్యత్తులో ఇక ఎప్పుడూ కార్యకర్తలను, నాయకులను విస్మరించమని మాట ఇచ్చారు. దాని వల్లనే ఈ ఐదేళ్ల కాలంలో పార్టీ కోసం క్యాడర్ అహర్నిశలు కృషి చేశారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ గెలుపు చరిత్ర సృష్టించింది. అందుకు పార్టీ శ్రేణులకు ఎంతో రుణపడి వున్నానని కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఎన్టీఆర్ కాలం నుంచి మొదలు ఈసారి తెలుగు దేశం సాధించిన విజయం నభూతో నభవిష్యతి అని చెప్పకతప్పదు. గత ఐదేళ్ల కాలంలో వైసిపి నుంచి తెలుగు దేశం కార్యకర్తలు అనుభవించిన ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఏకంగా చంద్రబాబు నాయుడు నే అనేక రకాల ఇబ్బందులకు గురిచేశారు. గొప్ప పరిపాలన దక్షుడైన చంద్రబాబు నాయుడు ను జైల్లో పెట్టించారు. అంటే క్షేత్ర స్థాయిలో కార్యకర్తలను ఎంతటి క్షోభకు గురిచేశారో అర్థం చేసుకోవచ్చు. గతంలో వైఎస్. జగన్ పాదయాత్ర కు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తిగా సహకరించింది. పూర్తి స్థాయిలో భద్రత కల్పించింది. అంతే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సమయంలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్నారు. ఆనాడు కూడా ఎలాంటి సమస్యలు లేకుండా చూశారు. అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు ప్రభుత్వం తరుపున అందించారు. కానీ విద్యాశాఖ మంత్రి లోకేష్ పాదయాత్ర రోజు నుంచి మొదలు యాత్ర పూర్తయ్యే వరకు అడుగడుగునా అవాంతరాలు సృష్టించారు. ప్రజలు లోకేష్ పాదయాత్రకు తండోపతండాలుగా వస్తున్న సమయంలో సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదు. పోలీసు వ్యవస్థ సహకరించకుండా చేశారు. అలాంటి సమయంలో తెలుగు యువత జనరల్ సెక్రటరీ అనిమిని రవి నాయుడు వందల మంది యువకులతో వాలెంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని స్వయంగా పాదయాత్రను పర్యవేక్షించారు. కొన్ని వందల మంది కార్యకర్తల భద్రత మధ్య పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి కావడానికి కృషి చేశారు. అలాంటి వాళ్లు మరి కొంత మంది నాయకులు కూడా వున్నారు. అలాంటి నాయకులకు న్యాయం జరగాల్సిన అవసరం వుంది. ఎందుకంటే ఎల్లవేళలా పార్టీకి అండగా నిలిచేది వాళ్లే! వాళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీపై వుంది. పార్టీ కోసం ప్రాణం పెట్టే వాళ్లు తెలుగు దేశం పార్టీలో కొన్ని లక్షల మంది వున్నారు. వాళ్లు అనేక రకాలుగా పార్టీ కోసం కష్టాలు పడ్డారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడున్న పరిస్థితులలో పొత్తు ధర్మం పాటించాల్సిన అవసరం కూడా వుండొచ్చు. అయినంత మాత్రాన నామినేటెడ్ పదవుల విషయంలో కూడా తెలుగు దేశం శ్రేణులకు అన్యాయం జరగకూడదు. ఎందుకంటే ఇంత కాలం పార్టీ కోసం కన్నీళ్లతో వెళ్లదీశాడు..పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. ఊరూరు తిరిగి పార్టీకి పూర్వ వైభవాన్ని తెచ్చారు. గడప గడప తిరిగి ఓట్లేయించారు. పార్టీ ఇచ్చిన హామీలను ప్రతి వ్యక్తికి చేరవేశారు. వారిలో విశ్వాసం కలిగించారు. ఓటు బ్యాంకుగా మలిచి పార్టీకి విజయంలో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. ఐదేళ్ల పాటు పార్టీ కోసం ప్రాణాలు ఫణంగా పెట్టారు. పార్టీ అధికారంలో వున్నా లేకున్నా అండగా వుంటూ వచ్చారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భుజం మీద నుంచి పార్టీ జెండా దించలేదు. అన్ని పరిస్థితులను ఎదుర్కొని జెండాలు మోశారు. ఆకలిని భరించారు. అర్థాకలితో కాలం వెల్లదీశారు. భయం గుప్పిట్లో బతికారు. అయినా పార్టీని వీడలేదు. అనేక కేసులు ఎదుర్కొన్నారు. జైలు జీవితం అనుభవించారు..ఆవేదనలు దిగమింగుకున్నారు. ఆస్థులు పొగొట్టుకున్నారు. కాలానికి సైతం ఎదురించారు. పార్టీని అధికారంలోకి తెచ్చేదాక కంటినిండా కునుకుతీయలేదు. కానీ అదేం విచిత్రమో గాని పార్టీ ప్రతిపక్షంలో వున్నప్పుడు కనిపించని వాళ్లంతా అధికారంలోకి రాగానే ప్రత్యక్షమౌతారు. తమకంటే పార్టీని ఉద్దరించే వారులేరన్నంతగా ఫోజులు కొడుతుంటారు. ప్రచార ఆర్భాటం ప్రదర్శిస్తారు. పది మందిని తోసుకుంటూ ముందుకు వస్తుంటారు. పార్టీ అధికారంలోకి రాగానే అసలైన కార్యకర్తలను వెనక్కి నెట్టేవాళ్లొస్తారు. అవకాశ వాదులు ముందుకు తోసుకొస్తారు. అలాంటి వారికి అవకాశం ఇవొద్దు!అసలైన నాయకులను దూరం పెట్టొద్దు! కార్యకర్తలను భవిష్యత్తు పేరు చెప్పి కాలయాపన చేయొద్దు. కొత్తగా వచ్చిన వారికి పెద్ద పీట చేయొద్దు. అధికారంలో వున్నప్పుడే అసలైన వారికి గుర్తింపు ఇవ్వాలి. అందివచ్చినప్పుడే అవకాశాలు వారికి కల్పించాలి. పార్టీకి భవిష్యత్తే వాళ్లు..వాళ్లను నిర్లక్ష్యం చేయొద్దు!తెలుగు దేశం పార్టీలో అనేక మంది విద్యావంతులున్నారు.విద్యార్థి దశనుంచి నాయకులు పార్టీకి సేవ చేస్తున్నారు. రాష్ట్ర పరిస్థితుల మీద అవగాహన వున్న వాళ్లు చాలా మంది కార్యకర్తలున్నారు. వారి సేవలే పార్టీకి ఎంతో అవసరం. సమాజం మీద వారికున్న పట్టు ప్రభుత్వానికి మరెంతో అవసరం. వారికి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. అసలైన కార్యకర్తలకు న్యాయం చేయండి! మాయ మాటలు చెప్పే వారు ఇప్పుడు చుట్టూ మూగుతారు. అబద్దాలు చెప్పి అధిష్టానాన్ని తప్పు దోవ పట్డిస్తారు. స్వార్థపరులంతా ఏకమై, అసలు కార్యకర్తలను చెదరగొడతారు. అధిష్టానానికి దూరం చేస్తారు… ఒకరకంగా వాళ్లే దూరం కొట్టిస్తారు. మాయ మాటలు చెప్పి లబ్ధి పొందాలని చూస్తారు. అధికారం ఎక్కడుంటే అక్కడ వాలిపోయేవారు చాలా మంది పోగౌతారు. పార్టీకి కష్టకాలమొస్తే ముఖం చాటేస్తారు. అవకాశ వాదులు గోడలు దుంకేందుకు సిద్ధంగా వుంటారు. వారిని నమ్మొద్దు…వారికి ప్రాధాన్యత కల్పించొద్దు. ఇది సగటు తెలుగు తమ్ముళ్ల ఆవేదన! నివేదన!!