నర్సంపేట,నేటిధాత్రి :
జీవో నెం.1ను ఉల్లంగిస్తూ పాఠశాల పేరుతో ముద్రించిన పాఠ్యపుస్తకాలను, యూనిఫామ్, స్టేషనరీలను పాఠశాలలో విక్రయిస్తున్న ప్రైవేట్ పాఠశాలపై తక్షణమే చర్య తీసుకోవాలని పిడీఎస్యు నర్సంపేట డివిజన్ కార్యదర్శి కొమ్ముక రవి
విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా పిడీఎస్యు నర్సంపేట డివిజన్ కార్యదర్శి కొమ్ముక రవి ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ జీవో నెం.1లో స్పష్టంగా విద్యాశాఖ అనేక నియమ నిబంధనలను ప్రధానంగా ఫీజులు, పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫామ్, టై, బెల్ట్ వంటి అంశాలను నిశితంగా పొందుపరిచారని అన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో కూడా ఆయా పాఠశాలలకు సంబంధించిన పేరుతో ముద్రించిన పాఠ్యపుస్తకాలను, ఇతర వస్తువులను పాఠశాల ఆవరణలో విక్రయాలు చేయరాదని స్పష్టంగా అదేశాలున్నాయన్నారు. కానీ ఆ ఆదేశాలను భేఖాతరు చేస్తూ స్కూల్ గదిలో పాఠ్యపుస్తకాలను విక్రయిస్తున్నదని ఆరోపించారు. అదే విధంగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో వేలాది రూపాయలు ఫీజుల రూపంలో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూళ్లు చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టాన్ని రూపొందించి, అమలు చేయాలని వారు కోరారు. జిల్లా విద్యాశాఖ అధికారులు నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా తక్షణమే అన్ని పాఠశాలల్లో తనిఖీలు చేపట్టాలని, నిబంధనలను ఉల్లంగిస్తున్న విద్యాసంస్థల పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాజు రమేష్ వెంకటేష్ బాలు తదితరులు పాల్గొన్నారు.