హసన్ పర్తి / నేటి ధాత్రి
అతని ఒంటిపై ఏడు సర్జరీలు, చూస్తే అతను వికలాంగుడు,
ఆయన టెన్త్ ఫెయిల్, ఇంటర్ లేదు, దూర విద్యలో డిగ్రీ అందులోనూ ఇంగ్లీషులో ఫెయిల్, కానీ ఇప్పుడు ఇంగ్లీష్ అధ్యాపకుడు, అందులోనూ ప్రతిష్టాత్మక “ఇంగ్లీష్ మరియు ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఎఫ్ఎల్యు) హైదరాబాద్ నుంచి ఆంగ్లంలో పి హెచ్ డి పట్టాను సాధించిన అతనికి ఇది ఎలా సాధ్యమైంది?
వివరాల్లోకి వెళితే హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం కోమటిపల్లి ప్రాంతం నిరూప్ నగర్ తండా వాసి అయిన కేలోతు గణేష్ ఇంగ్లీష్ మరియు ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ, హైదరాబాద్ నుండి ఇంగ్లీషులో డాక్టరేట్ పట్టా పొందారు. ఈ సందర్భంగా గణేష్ ను ఇఫ్లూ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు పరిశోధకులు అభినందించారు.
ఒక సామాన్య నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన గణేష్ తినడానికి తిండి లేక వేసుకునేందుకు బట్టలు లేక పూటకు గడవని పరిస్థితి లో చిన్ననాటి నుంచి గంజి అన్నం, రాత్రి బువ్వ తినడంతో పాటు ఎన్నో పూటలు పస్తులు కూడా ఉన్నారు. దురదృష్టవశాత్తు తన 15వ ఏట పదవ తరగతిలో బైక్ యాక్సిడెంట్ లో కాలు విరిగి అంగ వికలంగుడు గా మారిన గణేష్ చదువుకునేందుకు పడిన తాపత్రయం, తపన అంతా ఇంత కాదు. దురదృష్టం మళ్లీ మళ్లీ వెంటాడినట్టు ఇంటర్మీడియట్ లో కాలేజీకి వెళుతుండగా మళ్ళీ కాలు విరగడంతో దిక్కు తోచని స్థితిలో మంచాన పడ్డారు. కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో చీత్కారాలు, నిరాశ నిస్పృహలతో బతుకు మీద ఆశలు లేని స్థితిలో నుండి చదువుకోవాలనే బలమైన కాంక్ష, మొక్కవోని పట్టుదల, అంకుటిత దీక్షతో ఓపెన్ లో టెన్త్ పాస్ అయి, ఇంటర్ లేకుండానే దూరవిద్య ద్వారా డిగ్రీ పాసై, స్కాలర్షిప్ లు ఫీజు రీయింబర్స్మెంట్ ల ద్వారా రెగ్యులర్ గా ఉచితంగానే ఆంగ్లంలో పీజీ చేసి అనంతరం బీఈడీ, ఎంఈడి పూర్తి చేశారు. పది సంవత్సరాల కాలం పాటు వివిధ ప్రైవేట్ స్కూల్లో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా, ఎ పి ఆర్ ఎస్ గురుకుల పాఠశాల ఏటూరు నగరంలో గెస్ట్ టీచర్గ, బిఈడి కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తూ పట్టువదలని విక్రమార్కుడిగా ఆసియా ఖండంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇఫ్లు విశ్వవిద్యాలయం హైదరాబాద్ నందు పిజిడిటిఈ చేసి అనంతరం పిహెచ్డి ఎంట్రన్స్ ద్వారా అడ్మిషన్ పొంది పరిశోధన చేస్తుండగా బీసీ గురుకుల పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా (టిజిటి) సాధించారు. ఇప్పుడు ఆంగ్లంలో జూనియర్ లెక్చరర్ గా విధులు నిర్వహిస్తూ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఇఫ్లూ విశ్వవిద్యాలయంలో ఆంగ్లంలో పీహెచ్డీ చేయడం చాలా అభినందనీయమని మిత్రులు, శ్రేయోభిలాషులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తన జీవితం ద్వారా నేటి యువతరానికి, పేదరికంలో మగ్గుతూ అవకాశాలు లేక సతమతమవుతున్న సమాజానికి తాను ఇచ్చే సందేశం ”ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని, నేటి యువతరాన్ని జీవితంపై అవగాహన చేయాలని, చేతనైనంత మటుకు సాటి వారికి సహాయం చేయాలని” చెప్తున్న ఈయన జీవన విధానం మన ఎందరికో ఆదర్శం.