మంచిర్యాల నేటిదాత్రి
మంచిర్యాల శాసనసభ సభ్యునిగా ఎన్నికైన వంద రోజుల్లోనే నియోజకవర్గం అభివృద్ధి కోసం సుమారు మూడు వందల కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చినట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు వెల్లడించారు. బుధవారం తన నివాస గృహంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కేవలం వంద రోజుల్లోనే భారీగా నిధులు మంజూరు చేయించానని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ రావడంతో మిగతా నిధులు నిలిచిపోయాయని అన్నారు. మంచిర్యాల నియోజకవర్గములో సాగునీరు, తాగునీరు, మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు వివరించారు. ముఖ్యంగా ప్రభుత్వ పాటశాలలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి కలెక్టర్, విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమావేశం సత్ఫలితాలు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని చెప్పారు. పాటశాలల్లో తాగునీరు, మరిగుదొడ్ల నిర్మాణం ప్రహరిగొడ నిర్మాణం, విద్యుత్ సౌకర్యం ఏర్పాటుకు పెద్ద మొత్తంలో నిధులు తీసుకువచ్చానని తెలిపారు. అలాగే పాటశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటు మహిళా సంఘాలకు పాటశాల యాజమాన్య బాధ్యతలు అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. డ్వాక్రా సంఘాల ఆర్ధిక పరిపుష్టికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మంచిర్యాలలో అదనంగా రెండు రైలువే ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. గోదావరి పై వంతెన నిర్మాణం ఖచ్చితంగా జరుగుతుందని అయితే అది ముల్కల్ల ప్రాంతంలో నిర్మించే యోచనలో ఉన్నట్లు చెప్పారు. కాలేజ్ రోడ్ నుంచి అంతర్గాము వరకు బ్రిడ్జి నిర్మాణం కేవలం మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు కోసమేనని నేను స్వార్థంతో కాకుండా ప్రజల సుదీర్ఘ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. మంచిర్యాల లో తాగునీరు సమస్య భవిష్యత్తులో ఉండబోదని ఆయన ధీమా వ్యక్తంచేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఓర్వలేని దివాకర్ రావు ఆటో డ్రైవర్లను రెచ్చకొట్టడం శోచనీయమన్నారు. ఆటో డ్రైవర్లకు తాను సొంతంగా జీవిత భీమా చేయించానని గుర్తు చేశారు. కాళేశ్వరం వల్ల మంచిర్యాల వరద ముంపుకు గురైతే కనీస సాయంగా పదివేలు కూడా ఇప్పించలేదని దివాకర్ రావుపై విమర్శలు చేసారు. తాను ఎమ్మెల్యే కాగానే కరకట్ట నిర్మాణంకు 270 కోట్లు మంజూరు చేయించానని వెల్లడించారు. అలాగే ఐబీ స్థలంలో ఎన్నికల కోడ్ ముగియగానే మాతా, శిశు ఆసుపత్రి నిర్మాణం పనులు ఆరంభమవుతాయని అన్నారు. దశాబ్దాలు గా పట్టిపీడిస్తున్న డంప్ యార్డు సమస్య పరిష్కారం చూపానని సింగరేణి స్థలంలో డంప్ యార్డు ఏర్పాటు చేశామని తెలిపారు. సింగరేణి కార్మికులకు గత ప్రభుత్వం జారీ చేసిన ఇండ్ల పట్టాలను రద్దు చేసి స్థలంపై సర్వ హక్కులు కల్పిస్తూ పట్టాలు ఇస్తానని స్పష్టం చేశారు. తపాలపూర్ నుంచి లక్షెట్టిపేట చౌరస్తా వరకు నాలుగు లయిండ్ల రోడ్ మంజూరైందన్నారు. తరుగు పేరుతో రైతుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన సొమ్ము ఎవరి జేబులోకి వెళ్ళాయో ఎంపీ ఎన్నికల తర్వాత ప్రతి పైసా కక్కిస్తానని అన్నారు. అభివృద్ధి విషయంలో తాను రాజీపడపోనని తేల్చి చెప్పారు. చిత్తశుద్ధి ప్రజలకు మేలు చేయాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమేనని ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఈసమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ గారు, నాయకులు, నాయకురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు.