
మహబూబ్ నగర్ జిల్లా అంగన్ వాడీ కేంద్రాలకు కుళ్లిన, నాసిరకం కోడిగుడ్ల?..
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా అంగన్ వాడీ కేంద్రాలకు కుళ్లిన, నాసిరకం గుడ్లను సరఫరా చేస్తున్నారు. జిల్లాలోని అంగన్ అంగన్వాడి కేంద్రాలలో ఏదో ఒకచోట కుళ్ళిపోయిన నాసిరకం గుడ్లు కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. వాటిలో చిన్న పిల్లలు గర్భిణీలు బాలింతలకు కుళ్ళిన కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారు.వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటుండగా, సదరు కాంట్రాక్టర్‌పై అధికారులు చర్యలు తీసుకోకపోవడం పై పలు విమర్శలు వస్తున్నాయి. కాంట్రాక్టర్ ఇచ్చే మామూళ్లకు ఆశపడే జిల్లా అధికారులు ఈ విషయంపై స్పందించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తోంది. గుడ్లు, పాలతో పాటు పోషకాలు ఉన్న ఆహారాన్ని ఇస్తోంది. గుడ్డు నుంచి పోషకాలు బాగా అందాలంటే దాని బరువు 44 గ్రాముల నుంచి 50 గ్రాముల బరువు ఉండాలని సూచించింది.
ఒక ట్రే లో ఉన్న గుడ్ల బరువు దాదాపు కిలోన్నర ఉండాలి. కానీ కాంట్రాక్టర్లు 30 గ్రాముల కన్నా తక్కువ బరువున్న, కుళ్లిన గుడ్లను కేంద్రాలకు సరఫరా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే బుధవారం మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలంలోని గుడిమల్కాపూర్ అంగన్ వాడి కేంద్రంలో పిల్లలకు కోడి గుడ్డు ఇవ్వగా అవి పూర్తిగా కుళ్ళిపోయి ఉండడంతో ఆ గ్రామంలోని బాలింతలు కుళ్ళి నా గుడ్లను చూసి అవ్వక్కయ్యారు. జిల్లా లో నెల రోజుల క్రితం కూడా ఇలాగే కుళ్ళిన కోడి గుడ్డు కలకలం రేపింది.ఇప్పటికైనా అధికారులు గుడ్లు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాలని పలు గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.