-బాధితురాలు గన్నారపు పోషక్క
-పోలీసులకు ఫిర్యాదు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్
మొగుళ్లపల్లి మండలం మొట్లపల్లి గ్రామానికి చెందిన ఒక ఘనుడు తనను మోసగించాడని బాధితురాలు గన్నారపు పోషక్క మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నా అక్క కుమారుడైన మిరుపూరి సదయ్య భార్య పుష్ప అనారోగ్యానికి గురై అవస్థ పడుతుండగా సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్నానని పేర్కొన్నారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించి పుష్ప మరణించింది. దీనిని ఆసరా చేసుకుని అదే గ్రామానికి చెందిన రాళ్ల బండి శ్రీనివాస్ తానోక విలేకరినని చెప్పి వారిని నమ్మించాడు. సీఎం రిలీఫ్ ఫండ్ రూ. 4 లక్షలు రావడానికి చర్యలు తీసుకుంటానని రూ. 70 వేలు పోషక్క దగ్గర నుంచి తీసుకున్నాడు. నాలుగేళ్లయిన ఆ ఆర్థిక సహాయం రాకపోవడంతో పలుమార్లు తానిచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని రాళ్ల బండి శ్రీనివాస్ ఇంటి చుట్టూ తిరిగినప్పటికీ..డబ్బులు వస్తున్నాయి..ఎందుకు తొందర పడుతున్నావని నమ్మబలికాడు. ఒంటరి మహిళనైన తాను అతని వద్దకు వెళ్లి డబ్బులు ఇవ్వాలని ఇన్నాళ్లు ఆగినప్పటికీ..ఎలాంటి సమాధానం ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. అతను తీసుకున్న డబ్బులు రూ. 70 వేలు తిరిగి ఇప్పించాలని ఆ ఫిర్యాదులో పోషక్క పేర్కొంది. ఇదిలా ఉండగా మరి కొంతమంది బాధితులు కూడా పోలీస్ స్టేషన్ బాట పట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.