వెంకటాపూర్, నేటిధాత్రి: మండల కేంద్రంలోని స్థానిక ఉన్నత పాఠశాలలో గురువారం రోజు ప్రధానోపాధ్యాయురాలు టి.రాధిక ఆధ్వర్యంలో స్వయం పరిపాలన దినోత్సవం మరియు పదవ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాధిక మాట్లాడుతూ స్వయం పరిపాలన దినోత్సవం ద్వారా విద్యార్థులు తమ బాధ్యతను తెలుసుకుంటారని, ఉపాధ్యాయులు ఏ విధంగా పాఠాలను, కొత్త విషయాలను నేర్చుకొని విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధిస్తున్న విధానాన్ని స్వయం పరిపాలన దినోత్సవం ద్వారా విద్యార్థులు తెలుసుకోవడం జరిగిందని తెలియజేశారు. అంతేగాక పదవ తరగతి విద్యార్థులు ఇష్టంతో బాగా చదివి అందరూ 10/10 జిపిఎ మరియు వంద శాతం ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. భవిష్యత్తులో ఉన్నతమైన స్థానంలో ఉండాలని, విద్యార్థులందరూ పరీక్షలు సమీపిస్తున్న వేళ ఎలాంటి ఒత్తిడులకు గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. తదనంతరం తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులకు ఈ రోజు వీడ్కోలు పలికారు. ఆ తర్వాత విద్యార్థులు ఆట పాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు జనగాం బాబురావు, ఫెరోజ్, సాంబయ్య, కిరణ్ కుమార్, శ్రీనివాసు, మహేష్, జ్యోత్స్న, సత్యం, సీఆర్పీ కుమార్ పాడ్య మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.