భారత్‌లో పుట్టి విశ్వవ్యాప్తమైన చదరంగానికి అంతర్జాతీయంగా ఎంతో క్రేజ్ ఉంది. అందుకే దాదాపుగా ఈ క్రీడలో విదేశీ ప్లేయర్లదే ఆధిపత్యంగా సాగింది. అమెరికా, రష్యా, నార్వే లాంటి దేశాల ఆటగాళ్లు ప్రపంచ టైటిళ్లను తమ ఖాతాలో వేసుకున్నారు. కానీ మన దగ్గర విశ్వనాథన్ ఆనంద్ మాత్రమే విశ్వ విజేతగా నిలిచాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అయిదు సార్లు ప్రపంచ చెస్ పీఠాన్ని అధిరోహించాడీ ఛాంపియన్. 2000లో తొలిసారి ప్రపంచ ఛాంపియన్ అయిన ఆనంద్, చివరగా 2012లో ఆ హోదాలో కొనసాగాడు. అయితే 2013లో కార్ల్‌సన్ చేతిలో ఓటమిని చవి చూశాడు. అప్పటి నుంచి భారత్ నుంచి మరో ప్రపంచ ఛాంపియన్ కోసం దేశం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తూనే ఉంది. అయితే ఇప్పుడా నిరీక్షణకు ముగింపు పలుకుతూ విషీ క్రీడా వారసుడు గుకేశ్ మరోసారి ప్రపంచ చెస్‌లో భారత ఆధిపత్యాన్ని చాటి మన్ననలు పొందుతున్నాడు.
2024 ఫిడే చెస్ ఛాంపియన్‌షిప్‌లో యంగ్ ప్లేయర్ గుకేశ్ ఓ అరుదైన రికార్డును నమోదు చేశాడు. తాజాగా జరిగిన చివరి సమ్మిట్ గేమ్‌లో చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించాడు. ఈ క్రమంలో అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా గుకేశ్ చరిత్రకెక్కాడు.
క్లాసికల్ ఫార్మాట్ లో డిఫెండింగ్ చాంపియన్, చైనా గ్రాండ్ మాస్టర్ డింగ్ లిరెన్ తో జరిగిన 14గేమ్ ల పోరులో గుకేశ్ 7.5-6.5 పాయింట్ల తేడాతో విజయం సాధించాడు. 13 గేమ్ లు ముగిసేసరికి గుకేశ్, లిరెన్ 6.5-6.5 పాయింట్లతో సమంగా ఉండగా నిర్ణయాత్మక చివరి పోరులో గుకేశ్ తన సత్తానుచాటి ప్రపంచ విజేతగా నిలిచాడు.
క్లాసికల్ చెస్ లో రికార్డులన్నీ బద్దలుకొట్టి అతిపిన్న వయస్సులో గుకేశ్ చాంపియన్ గా నిలిచాడు. విజేతగా నిలిచిన దొమ్మరాజు గుకేశ్ కు ట్రోఫీతో పాటు రూ.11.45 కోట్ల నగదు బహుమతి కూడా దక్కింది. రన్నరప్ లిరెన్ రూ.9.75 కోట్లు గెలుచుకున్నాడు. ఈ ఛాంపియన్ షిప్ ఫ్రైజ్ మనీ మొత్తం రూ.21.17 కోట్లు. అయితే, ఒక గేమ్ గెలిచిన ప్లేయర్ కు రూ.1.69 కోట్లు లభిస్తాయి. మూడు గేమ్ లు నెగ్గిన గుకేశ్ కు రూ.5.07 కోట్లు. రెండు గెలిచిన లిరెన్ కు రూ.3.38కోట్లు దక్కాయి. మిగిలిన ప్రైజ్ మనీని సమానంగా పంచారు.