రామడుగు, నేటిధాత్రి:
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి వ్యవసాయ పరిశోధన స్థానం, కరీంనగర్ జిల్లా ఏరువాక కేంద్రం, కరీంనగర్ శాస్త్రవేత్తలు రామడుగు మండలంలోని కొక్కెరకుంట మరియు దేశరాజుపల్లి గ్రామంలోని రైతుల పొలాల్లో క్షేత్ర సందర్శన నిర్వహించడం జరిగింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిలో ప్రధాన సమస్య అయిన మొగి పురుగు, సల్ఫైడ్ దుష్ప్రభావం గమనించడం జరిగింది. ఇందులో భాగంగా శాస్త్రవేత్తల బృందం రైతులకు తగు నివారణ చర్యలు సూచించారు. మొగి పురుగు నారుమడి దశలో మరియు పిలక దశలో ఆశిస్తే మొక్కలు ఎండి చనిపోతాయని, ఆలస్యంగా ముదురు నారు నాటడం, కరువు పరిస్థితులు, తక్కువ రాత్రి ఉష్ణోగ్రతలు వుండి, సూర్యరశ్మి రోజుకు ఏడు గంటల కంటే ఎక్కువ వుంటే ఈపురుగు రావడానికి అనుకూలమని తెలపటం జరిగింది. తల్లి పురుగు ముదురు గోధుమ, ఎoడుగడ్డి, పసుపు రంగులో ఉన్న ఆడ పురుగుల ముందు జత రెక్కలపై నల్లటి మచ్చ కలిగి వుంటాయి.తెలుపు గోధుమ రంగులో వుండే పిల్ల పురుగులు (లార్వా) ఎదిగిన తరువాత నారింజ పసుపు రంగు తల కలిగి వుంటుంది. నారు పీకే ఏడు రోజుల ముందు రెండు గుంటల నారు మడికి 800 గ్రాముల కార్బోప్యురాన్ 3జి గులికలను చల్లి నీటిని ఆమడిలోనే ఇంకెట్లు చేయాలి. ముదురు నాటు నాటేటప్పుడు నారు కొనలను త్రుంచి వేయాలి. నాట్లు వేసిన పది నుండి పదిహేను రోజులలో కార్బోప్యురాన్ 3జి గుళికలను ఏకరానికి 10 కిలోల చొప్పున లేదా కార్టప్ హైడ్రో క్లోరైడ్ 4జి గుళికలు ఎకరానికి 8 కిలోలు లేదా క్లోరాoత్రనిలిప్రోల్ 0.4 జి గుళికలు నాలుగు కిలోలు చల్లుకోవాలి. ఎక్కువగా ఉన్నప్పుడు కార్టప్ హైడ్రో క్లోరైడ్ 50ఎస్.పి. 400గ్రా/ఎకరాకు లేదా క్లోరనింత్రినీలిప్రోలు 60మి. లి ఎకరాకు పిచికారి చేసుకోవాలి. అలాగే సల్ఫైడ్ దుష్ప్రభావం నివారణకు కాంప్లెక్స్ ఎరువులను పైపాటిగా చల్లకుండా చూసుకోవాలి. మురికి నీరుని తీసేసి సన్నటి పగుళ్లు వచ్చేవరకు వరి పొలాన్ని ఆరబెట్టుకోవాలి. బురద పదను మీద స్వర్ణఫల్ 10 కిలోలు ఎకరాకు చల్లుకోవాలని సూచించటం జరిగింది . ఈవిధంగా సల్ఫయిడ్ దుష్ప్రభావాన్ని నియంత్రించుకోవచ్చని రైతులకు వివరించటం జరిగింది. తదుపరి మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు గమనించడం జరిగింది. కావున దాని నివారణకు లింగాకర్షణ బుట్టలు ఎకరానకి 8 నుండి 10 అమర్చుకోవాలి. అదేవిధంగా మోగిలో పడేవిధంగా వేప కషాయం ఒక లీటరు ఎకరానికి పిచికారి చేయాలి. దీనితోపాటు ఇమామెక్టిన్ బెంజోట్ 80గ్రా. లేదా క్లోరంత్రనిల్ ప్రోల్ ఎంఎల్ /ఎకరాకు పిచికారీ చెయ్యాలని సూచించారు. ఈకార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన స్థానం, కరీంనగర్ సీనియర్ శాస్త్రవేత్త డా.ఎ.విజయ భాస్కర్, శాస్త్రవేత్తలు డా.జి . ఉషారాణి, డా.పి.మధుకర్ రావు, జిల్లా ఏరువాక కేంద్రం, కరీంనగర్ కోఆర్డినేటర్ డా. కె.మదన్ మోహన్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి సంజీవ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి రమేష్, కొక్కెరకుంట గ్రామసర్పంచ్ అభిషేక్ రెడ్డి, రైతులు, తదితరులు పాల్గొన్నారు.