భక్తుడు భగవంతునికి దాసునిగా మారాలి – విభిషణ్ ప్రభుజీ
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్) : భగవంతునికి నిత్య దాసునిగా మారి నిజస్థితిని తెలుసుకోవాలని సంగారెడ్డి జిల్లా కంది హరేకృష్ణ టెంపుల్ ప్రతినిధి విభిషణ్ ప్రభుజీ ఉద్బోధించారు. కృష్ణ భక్తి భావన మినహా సమస్త కలాపములను త్యజించువారే భగవంతునికి అత్యంత ప్రీతి పాత్రులవుతారని పేర్కొన్నారు. జహీరాబాద్ హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు పట్టణంలోని శ్రీ మాణిక్ ప్రభు వీధిలో 173 వ నగర సంకీర్తన వైభవంగా జరిగింది. అనంతరం హనుమాన్ మందిర్ లో జరిగిన సత్సంగ ప్రవచన కార్యక్రమం లో ఆయన పాల్గొని ప్రవచించారు. భగవంతుని దివ్యమైన ప్రేమ యుక్తమైన సేవయే జీవులకు నిజమైన కర్మ అని వివరించారు. కృష్ణ పరమైన కర్మలు తప్ప మిగిలిన కర్మలన్నీ జనన, మరణ చక్రబంధంలో బంధించబడుతాయని తెలిపారు.
ప్రతి కర్మను శ్రీకృష్ణుడి ప్రీత్యర్థమే ఆచరించాలని హితవు పలికారు. ఈ సందర్బంగా భగవద్గీత సాంఖ్య యోగంలోని 48 వ శ్లోకాన్ని ఉటంకిస్తూ పలు ఉపమానాలను వివరించారు. భక్తులు అడిగిన పలు ఆధ్యాత్మిక సందేహాలను నివృత్తి చేశారు. అంతకుముందు శ్రీకృష్ణ కీర్తనలు ఆలపిస్తూ బసవేశ్వర వీధి లో శోభాయాత్ర నిర్వహించారు. కీర్తనలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ భక్తులు తన్మయ్యత్వంలో మునిగిపోయారు.భువన సంగీత మోహనంగా సాగిన ఈ సంకీర్తన లో బెజుగం లక్ష్మణ్, స్వస్తిక్ రెస్టారెంట్ మహేందర్ గోడకే ప్రసాద వితరణ చేశారు.
ఇదిలాఉండగా మండలంలోని హుగ్గెల్లి గ్రామంలోనూ 138 వ పల్లె సంకీర్తన అట్టహాసంగా జరిగింది. గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయం నుండి గ్రామం ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. హరేకృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.