
-లక్షలాది ఎకరాల మాయం లో రిజిస్టార్ల మాయాజాలం
’’నేటిధాత్రి’’ చేతిలో రాష్ట్రంలోని ‘‘అవినీతి రిజిస్టార్ల’’ బండారం
-దోచుకున్నాం…దాచుకున్నాం?
-తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 42 మందికి పైగా రిజిస్ట్రార్లు సెలవుల్లో..?
-మొదటిసారి మంత్రి ‘‘పొంగులేటి’’ ఆదేశాలతో జోన్ ట్రాన్స్ఫర్లు!
-ట్రాన్స్ఫర్లు ఒప్పుకోం..కొత్త చోట కొలువులు చేయం?
-వాటిని కాపాడుకోవాలంటే స్థానికంగానే వుంటాం?
-అవినీతికి అలవాటు పడి, స్థానికంగా బలపడి.
-ఆస్థులు కూడబెట్టి, పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి!
-వ్యాపారాలు, ఫంక్షన్ హల్స్ నిర్వహిస్తూ..
-అక్రమ రిజిస్ట్రేషన్లలో భూములు కొల్లగొట్టి..
-కొత్త చోట ఏసిబి దాడులు అంచనా వేసుకోలేం?
-15 ఏళ్లకు పైబడి ట్రాన్స్ఫర్లు లేకపోవడం రిజిస్ట్రార్లకు బలం.
-భరించలేకపోతున్న రిజిస్ట్రార్లు!
-ఇప్పుడు ట్రాన్స్ఫర్లు మేం ఒప్పుకోం!
-పాత చోట పెద్ద ఎత్తున అనుచరులు.
-ముళ్లెలకు ముళ్లెలు అందిన మూటలు.
-రియలర్టర్లతో భూ బంధాలు.
-వాటిని వదులుకునేందుకు సిద్ధంగా లేరు.
-ఒకప్పుడు వేలల్లో పుచ్చుకునే లంచాలు!
-గత పదేళ్లుగా లక్షల్లో, కోట్లల్లో పెరిగిన ఆదాయాలు!
-అక్రమ రిజిస్ట్రేషన్లలో లంచాలుగా సొమ్ముకు బదులు భూ సంతర్పణలు.
-బినామీల పేరుతో పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు.
-‘‘ఆదిలాబాద్’’ లో పెద్ద ఎత్తున అటవీ భూముల అన్యాక్రాంతంలో భాగస్వాములు.
-కరీంనగర్లో వక్ఫ్ భూముల మాయంలో రిజిస్ట్రార్ల సహకారాలు.
-వరంగల్ లో ఏడాదిగా చిట్స్ రిజిస్ట్రార్ లేకుండా పోవడం.
-‘‘ఖమ్మం’’లో వాగులు, వంకలు అటవీ భూముల రిజిస్ట్రేషన్లు!
-రంగారెడ్డి జిల్లాలో ‘‘కోట్లల్లో’’ లంచాలు?
-గత పదేళ్లుగా ‘‘నేటిధాత్రి’’ సాగిస్తున్న అక్షర పోరాటం.
-ఫలితంగా ఎంతో మంది రిజిస్ట్రార్ల సస్పెన్షన్లు!
-అయినా మార్పు రాని యంత్రాంగం.
హైదరాబాద్, నేటిధాత్రి: కొంత మంది రిజిస్ట్రార్లు జీవితానికి అరగనంత తిన్నారు. తరతరాలు తరగనంత సంపాదించుకున్నారు. లంచాలు మింగి రంది లేకుంటానే వున్నారు. అయినా ఇంకా వారికి లంచాల ఆకలి తీరలేదు. సంపాదన ఇంకా సరిపోవడం లేదు. కోట్లు కూడబెట్టుకున్నా, ఇంకా ఆశ చావలేదు. ఇది జనాల్లో రిజిస్ట్రేషన్ శాఖపై వున్న అభిప్రాయం. తెలంగాణ వ్యాప్తంగా వున్న 140 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పని చేసే రిజిస్ట్రార్ల దగ్గర నుంచి అందులో పనిచేసే ఏ ఉద్యోగులు సుద్దపూసలు కాదన్న సత్యం అందరూ చెబుతుంటున్నారు. వారిలో కూడా కొందరు మంచి వాళ్లుండొచ్చు. కాని వారిని ఎవరూ గుర్తించరు. శరీరంలో చాలా భాగం చెడిపోయినప్పుడు, బాగున్న అవయవం చేసేదేమీవుండదు. అలా తింటున్నా, కూర్చున్నా, నిద్రలో కూడా లంచం, లంచం అనే మాటతోనే కొందరు కాలం గడిపే ఉద్యోగులు అనేకం వున్నారు. వారిని మారమంటే మారు. మార్చాలని చూసినా మారరు. ఎందుకంటే లంచానికి అలవాటు పడిన ప్రాణం రూపాయి తీసుకోకుండా వుండే పరిస్ధితి వుండదు. వ్యవస్ధ కళ్లిపోయిందంటే ఇలాంటి ఉద్యోగులే కారణం. ఎంతో మంది ప్రజల వద్ద దోచుకున్నారు. దాచుకున్నారు. ఇంకా చాలడం లేదు. అంతే కాదు వారి గొంతెమ్మ కోరికలు అంతా ఇంతా కాదు. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే ట్రాన్స్‌ఫర్‌కు ఎప్పుడూ సిద్దంగా వుండాలి. అది కలెక్టర్ దగ్గర నుంచి జూనియర్ అసిస్టెంట్ వరకు ఎవరైనా ఒక్కటే. కాని తెలంగాణలో రిజిస్రేషన్ శాఖలో సుమారు 15 సంవత్సరాలుగా ట్రాన్స్ఫర్లు లేని వాళ్లు ఎంతో మంది వున్నారు. అంతకాన్న ఎక్కువ కాలం కూడా ఒకే చోట, ఒకే సీట్లో కూర్చున్న వారు కూడా వున్నారు. వారికి ప్రమోషన్లు వచ్చినా అవసరం లేదని అక్కడే తిష్ట వేసుకొని వున్నవాళ్లున్నారు. కారణం కేవలం లంచం. సహజంగా ఉద్యోగులు ప్రమోషన్లు వస్తే ఎంతో సంతోషిస్తారు. జీతం పెరగుతుందని ఆనందపడతారు. హోదా పెరుగుతుందని సంబరపడతుంటారు. ప్రమోషన్ల కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తుంటారు. తమ పరపతి పెరుగుతుందని కలలుకంటారు. కాని రిజిస్ట్రేషన్ శాఖలో సబ్ రిజిస్ట్రార్ కుర్చీ మాత్రమే చాలనుకుంటారు. ఆ కుర్చీ విడిచిపెట్టేందుకు అసలే ఒప్పుకోరు. ఒక వేళ ప్రభుత్వం వారిని ట్రాన్స్ఫర్ చేసినా మళ్లీ ఏదో రకంగా పైరవీ చేసుకొని అదే కుర్చీలో కూర్చున్న వారు కూడా వున్నారు. అంతే కాదు ఏసిబికి పట్టుబడి, కొంత కాలానికి మళ్లీ కొలువు తెచ్చుకొని, అదే కుర్చీలో అతుక్కుపోయిన వారు కూడా వున్నారు. ఇదీ స్ధూలంగా కొంత మంది రిజిస్ట్రార్ల బాగోతం. ఇదంతా ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు చాలా మంది రిజిస్ట్రార్లు చోటు కదలకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. ట్రాన్స్ఫర్లు అనేవి లేకుండా తిష్టవేసుకొని కూర్చున్నారు. అయితే ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రివెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రిజిస్ట్రేషన్ శాఖలో మార్పులు తీసుకురావాలని చూశారు. రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి లేకుండా చేయాలని అనుకున్నారు. దాంతో ఆయన జోన్ ట్రాన్స్ఫర్లు చేశారు. ఇది రిజిస్ట్రేషన్ శాఖలో చాలా మంది ఉద్యోగులకు నచ్చలేదు. దాంతో కొంత మంది సీనియర్లు ఏక కాలంలో సెలవులు పెట్టినట్లు సమాచారం. మా ట్రాన్స్ఫర్లు రద్దు చేయకుంటే మేం సెలువుల్లోనే వుంటాం…కొలువులు మాత్రం చేయం. ట్రాన్ష్ఫర్లు అసలే ఒప్పుకోం. జీతాలు తీసుకుంటాం.. ట్రాన్స్ఫర్ చేసిన చోటకు వెళ్లమని భీష్మించుకొని కూర్చున్నారు. ఎందుకంటే ఇంత కాలం అవినీతికి అలవాటు పడి బాగా సంపాదించుకున్నారు. చాలా వరకు అక్కడే స్ధిరపడిపోయారు. స్దిర చరాస్ధులు సంపాదించుకున్నారు. సమీపంలో వుండే బంధువులను బినామీలుగా చేసుకున్నారు. ప్రతి రిజిస్ట్రార్ కొంత మంది అనుచరులను ఏర్పాటు చేసుకున్నారు. అందులో బంధువులుంటారు. తనకు అత్యంత నమ్మకస్తులుంటారు. వారి పేర్ల మీద ఆస్ధులు కూడబెట్టారు. వారి పేర్ల మీద ఆస్ధులు పెట్టుకున్నారు. పైగా ఎక్కడైతే అంత కాలం కొలువు చేస్తున్నారో అక్కడ వ్యాపారాలు కూడా మొదలు పెట్టిన వారున్నారు. పెద్దపెద్ద ఫంక్షన్‌హాల్స్ కూడా నిర్మాణాలు చేసుకున్నారు. పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు జోన్ మార్పులంటే జిల్లాలు దాటాల్సి వస్తుంది. పాత జిల్లాలకు వెళ్లాల్సి వస్తుంది. రోజూ వెళ్లలేరు. అక్కడే వుండలేరు. కుటుంబాలను అక్కడికి తీసుకెళ్లలేరు. కుటుంబాలను వదిలేసి కొలువులు చేయాల్సిన చోట వుండలేరు. తెలంగాణ రాకముందు సహజంగా రిజిస్ట్రార్లు లంచాలు తీసుకునే వారు. అది కూడా వేలల్లో వుండేవి. కాని తెలంగాణ వచ్చిన తర్వాత వేల రూపాయలు దాటిపోయాయి. లక్షలకు చేరుకున్నాయి. ఎప్పుడైతే తెలంగాణలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయో? అప్పుడు రిజిస్ట్రార్ల ఆశలకు రెక్కలొచ్చాయి. లంచాలు తీసుకోకుండా ఏకంగా భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఇచ్చే లంచాల స్ధానంలో భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అలా అక్రమ రిజిస్ట్రేషన్లను చేస్తూ, అందులోనూ తమకు కొంత భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే అవి ఆ రిజిస్ట్రార్లకు చెందిన అనుచరులు, బంధువుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి వున్నాయి. ఒక్కసారి అక్కడి నుంచి కదిలిలే ఇక ఆ భూములు, ఆస్ధులు దక్కకపోవచ్చన్న భయం వారిలో పట్టుకున్నది. దాంతో కొంత మంది రిజిస్ట్రార్లు సెలవులు పెట్టారు. ఇంట్లోనే వుంటున్నారు. సుమారు 15 సంవత్సరాలుగా ట్రాన్స్ఫర్లు లేకపోవడం వారికి వరంగా మారింది. గతంలో తిష్టవేసుకున్న ప్రాంతాల్లో వారికి పెద్దఎత్తున అనుచర గణం వుంటుంది. పైగా స్దానికంగా వున్న రియల్టర్లతో భూ బందాలున్నాయి. పాత స్థలాలపై రిజిస్ట్రార్లకు పూర్తి అవగాహన వుంటుంది. రిజిస్ట్రేషన్ కోసం వచ్చేవారు ఎలాంటి భూముల రిజిస్ట్రేషన్ చేయించుకుంటన్నారన్నదానిపై పూర్తి పట్టు వుంటుంది. దాంతో ఆ భూముల విషయంలో ఎంత వరకు లంచం తీసుకోవచ్చు. ఎంత వరకు భూములను లంచంగా అడగొచ్చన్నదానిని గురించి నిర్ణయం తీసుకోగలరు. అదేకొత్త ప్రాంతానికి వెళ్తే పుణ్యకాలం ముగిసిపోతుంది. పైగా కొత్త ప్రాంతంలో ఎప్పుడు ఏసిబి దాడులు ఎక్కడి నుంచి జరుగుతాయో తెలియదు. అక్కడ అనుచర గణం తయారు చేసుకోవాలంటే చాలా కాలం పడుతుంది. వారిని ఎంత వరకు నమ్మలో కూడ నమ్మకం కుదిరేందుకు చాలా సమయం పడుతుంది. ఎప్పుడూ భయం గుప్పిట్లో కొలువులు చేయాల్సి వుంటుంది. దానికన్నా సెలవు పెట్టి హాయిగా వుండడమే మేలనుకుంటున్నారు. ఇలా ఉద్యోగులు తీసుకున్న నిర్ణయం వల్ల శాఖలో పనులు పెండిరగ్‌ల పడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ధరణి వచ్చిన తర్వాత లక్షలాది ఎకరాలు మాయం కావడానికి ప్రదాన కారణం రిజిస్ట్రార్లే కావడం గమనార్హం. ఆదిలాబాద్ జిల్లాలో పెద్దఎత్తున వేలాది ఎకరాల అటవీ భూములను సీటు ముక్కల్లా అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారు. కరీంనగర్ జిల్లాలో వున్న వక్ఫ్ భూములు అన్యాక్రాంతం కావడం లో రిజిస్ట్రార్ల పాత్ర పెద్దది. వరంగల్ జిల్లాలో చిట్స్ రిజిస్ట్రార్ లేక ఎంతో మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో అనేక చిట్ పండ్ కంపనీలు బిచాన ఎత్తేయడం వల్ల ఎంతో మంది ప్రజలు నష్టపోయారు. వారు తమ గోడును వినిపించుకునేందుకు ఏడాది కాలంగా రిజిస్ట్రార్ లేడు. ఇలా ట్రాన్ష్ఫర్ను తిరస్కరించి కొలువుల్లో చేరకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా ఉద్యోగులు సంతోషంగానే వున్నారు. ఖమ్మం జిల్లాలో వాగులు, వంకలు కూడా కొందరు రియల్టర్లు వదల్లేదు. ఆ భూములను కూడా అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారు. కోట్లు కూడబెట్టుకున్నారు. ఆస్దులు పోగేసుకున్నారు. నేటిధాత్రి గత పదేళ్ల కాలంగా అక్రమ రిజిస్ట్రేషన్లు, లంచాల రిజిస్ట్రార్లపై అక్షరపోరాటం సాగిస్తూనే వుంది. ఎంతోమంది అవినీతిత సబ్ రిజిస్ట్రార్లను ఇంటికి పంపడంలో నేటి దాత్రి పోరాటం ఫలించింది. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఏసిబికి ఎంతో మంది పట్టుబడుతున్నా, కొందరు రిజిస్ట్రార్లు తమ అవినీతిని ఆపడంలేదు. వారి అక్రమ సంపాదన ఆగడం లేదు. అలాంటి రిజిస్ట్రార్ల అవినీతి బాగోతమంతా నేటి దాత్రి చేతిలో వుంది. వారిపై వరస కథనాలు త్వరలోనే నేటిదాత్రి బైటపెడుతుంది. వారి బంగారం బట్టబయలు చేస్తుంది. త్వరలో వరుస కధనాలు అందిస్తుంది. ప్రభుత్వానికే సవాలు విసురుతున్న వారి వివరాలు త్వరలోనే…మీ నేటిధాత్రిలో…