
Training on Bathukamma Day Irks Women Teachers
మహిళా ఉపాధ్యాయులకు సద్దుల బతుకమ్మ రోజే ఎన్నికల శిక్షణ ఇవ్వడం ఏంటీ….???
అధికారుల వింత ప్రవర్తన తో బతుకమ్మ ఆడలేక ఆవేదన చెందిన మహిళా ఉపాధ్యాయులు.
ప్రభుత్వం బతుకమ్మ ఆడమని సెలవులిస్తే అధికారులు శిక్షణ ఇవ్వడం ఏంటి..?
ఇది బతుకమ్మ పండుగ స్ఫూర్తికే విరుద్ద్ధం
ఉపాధ్యాయ సంఘాల ప్రాతినిధ్యాన్ని సైతం లెక్కచేయని అధికారులు
అధికారుల తీరు మారాలి.విచక్షణతో ఆలోచించాలి.
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ విమర్శ
కేసముద్రం/ నేటి ధాత్రి
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రిసైడింగ్ అధికారులైన మహిళా ఉపాధ్యాయులకు సైతం సోమవారం సద్దుల బతుకమ్మ రోజే ఎన్నికల సోమవారంశిక్షణ ఇవ్వడాన్ని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ ఖండించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో బతుకమ్మ పండుగకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని, మహిళలందరూ ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారని ఆయన అన్నారు. ఈ పండుగ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించిందని ఈ క్రమంలోనే మహిళా ఉపాధ్యాయులు అందరూ తమ పుట్టింటికి వెళ్లి పండుగ సంబరాలు జరుపుకుంటున్న సందర్భంలోనే అధికారులు ఉన్నఫలంగా ఎన్నికల శిక్షణ నిర్వహించడం ఏంటి..? అని విమర్శించారు. మహిళా ఉపాధ్యాయులను బతుకమ్మ ఆడనీయకుండా వారిని మనోవేదనకు గురిచేయడం సమంజసం కాదని, ఇది బతుకమ్మ పండుగ స్ఫూర్తికే విరుద్ధమని అన్నారు.
ఈరోజు తప్ప అధికారులకు వేరే రోజు ఏది అనుకూలంగా కనిపించలేదా..? అని ప్రశ్నించారు.
“దేవుడు వరమిచ్చినా పూజారి వరమియ్యనట్లు ” ఉంది అధికారుల ప్రవర్తన అని ఎద్దేవా చేశారు .
అధికారులు విచక్షణతో ఆలోచించి ఉంటే బాగుండేదని, కనీసం ఉపాధ్యాయ సంఘాల ప్రాతినిధ్యాన్ని పరిగణలోకి తీసుకున్నా ఈ శిక్షణ కార్యక్రమం తేదీ మారేదని, మహిళా ఉపాధ్యాయులు నష్టపోయే వారు కాదని, వారు మనోవేదనకు గురయ్యే వారు కాదని ఆయన ఆవేదన వ్యక్తం వారు. సంబంధిత అధికారులు భవిష్యత్తులోనైనా ఇలాంటి తప్పిదాలు చేయకుండా ఉండాలని అర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.