
Bathukamma–Dussehra Arrangements Begin in Bhupalpally
బతుకమ్మ దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి ఎమ్మెల్యే జి ఎస్ ఆర్
భూపాలపల్లి నేటిధాత్రి
ఈ నెల 21 నుండి ప్రారంభమయ్యే బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు.
సోమవారం ఐడిఓసి కార్యాలయంలో బతుకమ్మ సంబురాలు, దసరా ఉత్సవాల ఏర్పాట్లుపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుతో కలసి రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, మున్సిపల్ అధికారులతో
సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగ రాష్ట్ర ప్రజల సాంప్రదాయ, సంస్కృతికి ప్రతీక అని, పూల పండుగ అని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 9 రోజులు జరుగనున్న నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మలు తయారు చేసి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారని, బతుకమ్మలు ఆడిన తదుపరి చెరువుల్లో నిమజ్జనం చేస్తారు కాబట్టి గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీ పరిధిలో బతులమ్మ ఘాట్లు గుర్తించి విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అన్ని శాఖల ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రహదారులు, వీధి లైటింగ్, తాగునీరు, పరిశుభ్రత, భద్రతా చర్యలు, వైద్య సేవలు వంటి అన్ని సౌకర్యాలను ముందుగానే సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొనే ఈ వేడుకల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. ముఖ్యంగా అన్ని గ్రామాల్లో, భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లోని ముఖ్యమైన కూడళ్లను అందంగా తీర్చిదిద్దాలని సూచించారు. గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ సెక్రటరీలు స్పెషల్ డ్రైవ్ చేపట్టి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు. ముఖ్యంగా గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, వీధులలో, ప్రధాన కూడళ్లలో వీధిలైట్ల వెలిగేలా చూడాలని తెలిపారు. దసరా ఉత్సవాల ముగింపు రోజైన అక్టోబర్ 2న జిల్లా కేంద్రంలోని డా బిఆర్ అంబేడ్కర్ క్రీడా మైదానంలో జరిగే వేడుకలకు సాంస్కృతిక సారథి కళాకారులచే కళాజాత నిర్వహించాలని డిపిఆర్వో ను ఆదేశించారు. అలాగే విద్యుత్, మంచినీటి సరఫరా, పారిశుధ్యం, భద్రత, ఆరోగ్య కేంద్రాలు, అగ్నిమాపక, ట్రాఫిక్ నియంత్రణ, ఫుడ్ కోర్ట్ ఏర్పాటు వంటి అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అవసరమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ప్రజలు దసరా ఉత్సవాలను ఘనంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తిచేయాలని సూచించారు. అక్టోబర్ 2వ తేదీన దసరా ముగింపు వేడుకలకు డా బిఆర్ అంబేడ్కర్ మైదానంలో నిర్వహించడం జరుగుతుందని, వీక్షించేందుకు వచ్చే ప్రజలకు కుర్చీలు ఏర్పాటు చేయాలని సింగరేణి అధికారులకు సూచించారు. ఉత్సవాలు అందరికీ ఆనందాన్ని పంచేలా విజయవంతంగా నిర్వహించడమే మనందరి లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. బతుకమ్మ నిమజ్జన ప్రాంతాలను గుర్తించి రక్షణ ఏర్పాట్లు చేయాలని మున్సిపల్, పంచాయతి అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఎఎస్పీ నరేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, సింగరేణి ఎస్ ఓ టు జిఎం కవీంద్ర తదితరులు పాల్గొన్నారు.