
Anti-Corruption Law Symposium in Warangal
యాంటీ కరప్షన్ లా సదస్సును విజయవంతం చేయండి.
న్యాయవాది పరిషద్ ఆధ్వర్యంలో యాంటీ కరప్షన్ లా పోస్టర్ ఆవిష్కరణ.
అవినీతి నిర్మూలన కోసం అందరూ చైతన్యంతో ముందుకు రావాలి.
ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ సదస్సు ఏర్పాటు.
:__ న్యాయవాది పరిషద్ వరంగల్-హనుమకొండ జిల్లా అధ్యక్షులు చొల్లేటి రామకృష్ణ అడ్వకేట్.
వరంగల్, నేటిధాత్రి:
https://youtu.be/P-tFvsSUVDg?si=l59BVy67t8lI2R8x
న్యాయవాది పరిషద్ తెలంగాణ ఆధ్వర్యంలో రేపు (సెప్టెంబర్ 13న) జరగబోయే యాంటీ కరప్షన్ లా సదస్సును విజయవంతం చేయాలని న్యాయవాది పరిషద్ వరంగల్, హనుమకొండ అధ్యక్షులు చొల్లేటి రామకృష్ణ అడ్వకేట్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన హనుమకొండ బార్ అసోసియేషన్ హాల్లో, పలువురు సీనియర్ అడ్వకేట్ల సమక్షంలో యాంటీ కరప్షన్ లా పోస్టర్‌ను ఆవిష్కరించారు.
న్యాయవాది పరిషద్ తెలంగాణ, అఖిల భారతీయ అధివక్తా పరిషద్ (ఏబిఏపి) ఆధ్వర్యంలో “యాజమాన్య వ్యతిరేక చట్టాలు – ప్రాక్టీస్ & ప్రొసీజర్” పేరిట ప్రత్యేక సిమ్పోజియం సెప్టెంబర్ 13న ఉదయం 11 గంటలకు హనుమకొండ నక్కలగుట్టలోని డీసీసీబీ భవన్, అదాలత్ ప్రాంగణంలో జరుగనుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి హనర్బుల్ జస్టిస్ కునూరూ లక్ష్మణ్ హాజరుకానున్నారు. గౌరవ అతిథులుగా వరంగల్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి వి.బి. నిర్మల గీతాంబ, హనుమకొండ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కె.పట్టాభి రామరావు పాల్గొననున్నారు. అలాగే న్యాయవాదులు కరోర్ మోహన్, వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వల్స సుధీర్, హనుమకొండ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పులి సత్యనారాయణ, కేవీకే గుప్త తదితరులు హాజరుకానున్నారు. న్యాయవాది పరిషద్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సెమ్సాని సునీల్ నేతృత్వంలో కార్యక్రమం కొనసాగనుంది.
వరంగల్, హనుమకొండ న్యాయవాది పరిషద్ యూనిట్ల అధ్యక్షులు, కార్యదర్శుల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధ్యక్షుడు చొల్లేటి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి మురళీధర్ రెడ్డి తెలిపారు. న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై అవినీతి నిర్మూలనలో చైతన్యాన్ని పెంపొందించే ఈ సదస్సును విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
అఖిల భారతీయ అధివక్త పరిషద్ (ఏబిఏపి) స్థాపన.., లక్ష్యాలు…!
భారతదేశ న్యాయవాదుల అధిష్ఠాన సంస్థగా గుర్తింపు పొందిన “అఖిల భారతీయ అధివక్త పరిషద్” (ఏబిఏపి) 1992వ సంవత్సరం, ఢిల్లీలో స్థాపించబడింది. ఈ సంస్థను ప్రముఖ విజనరీ దత్తోపంత్ థెంగడిజీ ఆధ్వర్యంలో ప్రారంభించారు. అభ్యుదయ భావాలు, భారతీయ విలువలు, సంప్రదాయాలు ప్రతిబింబించే న్యాయవ్యవస్థ ఏర్పాటుకు కృషి చేస్తుంది. ధర్మాన్ని న్యాయవాదులకు పరిచయం చేయడం ప్రధాన లక్ష్యం. న్యాయ వ్యవస్థ సామర్థ్యం పెరగాలి, నైతికత, సంకల్పం, ఆచార వ్యవస్థలు న్యాయవాదులలో పెంపొందాలి అనే ఉద్దేశంతో పనిచేస్తుంది.
అఖిల భారతీయ అధివక్త పరిషద్ (ఏబిఏపి) కార్యకలాపాలు, నిర్మాణం.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా శాఖలు కలిగిన న్యాయవాదుల నెట్‌వర్క్‌గా వ్యవహరిస్తుంది. ప్రతి రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఒక బృహత్తర న్యాయవాదుల సంఘంగా కల్సి, అభ్యాసకులకు న్యాయంపై అవగాహన పెంచే శిక్షణ, సమావేశాలు, సదస్సులు నిర్వహిస్తారు. జాతీయ న్యాయ సదస్సులు, సెమినార్లు, వివిధ అంశాలపై చర్చలు జరుగుతుంటాయి. న్యాయ విద్యార్థుల కోసం స్టడీ సర్కిల్స్, లీగల్ అవగాహన క్యాంపులు, కాంటిన్యూయస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ నిర్వహిస్తారు.
‘న్యాయప్రవాహ్’ అనే ద్వైభాషా పత్రిక కూడా ప్రచురిస్తున్నారు, ఇందులో నూతన విధానాలు, న్యాయ నిర్ణయాలు, న్యాయ వ్యవస్థకు సంబంధించిన వ్యాసాలు ఉంటాయి. సామాజిక న్యాయం, చట్టాల రిఫార్మ్స్, నైతిక న్యాయ అనుసంధానం, భారతీయ న్యాయవాదులకు మరింత ప్రాముఖ్యత కల్పించడమే లక్ష్యంగా ఈ సంస్థ పని చేస్తుంది. ఈ సంస్థ ద్వారా న్యాయవాదులకు నేటి సామాజిక, చట్టపరమైన సమస్యలపై అవగాహన పెంపొందటమే కాదు, దేశ అభివృద్ధిలో న్యాయ రంగ పాత్రను వివరంగా చర్చిస్తారు. ఏబిఏపి కి అనుగుణంగా తెలంగాణలో “న్యాయవాది పరిషద్ తెలంగాణ” కొనసాగుతుంది.
రాష్ట్ర ఋషి దత్తోపంత్ థెంగడిజీ అరుదైన మహానుభావుడు
మహారాష్ట్రలోని ఆర్వీ గ్రామంలో 1920 నవంబర్ 10న జన్మించిన రాష్ట్ర ఋషి దత్తోపంత్ థెంగడిజీ, తన ఆలోచనలతో, కార్యచరణతో జాతీయ జీవనంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. 1942లో ఆరెస్సెస్ ప్రచారకుడిగా చేరిన ఆయన కేరళ, బెంగాల్ ప్రాంతాల్లో పని చేసి, తరువాత కార్మికులు, రైతులు, స్వదేశీ ఆవశ్యకతల కోసం భారతీయ మజ్దూర్ సంగ్, భారతీయ కిసాన్ సంగ్, స్వదేశీ జాగరణ మఠ్ వంటి జాతీయ స్థాయి సంస్థలను స్థాపించారు. థెంగడిజీ తన జీవితంలో ఒకవైపు మార్క్సిస్ట్ సిద్ధాంతాలను లోతుగా అధ్యయనం చేయగా, మరోవైపు భారతీయ తత్త్వశాస్త్రంలోని అనాశక్తి యోగాన్ని ఆచరించడం ద్వారా విరుద్ధతల మధ్యన ఒక సమన్వయాన్ని చూపించారు.
“ధర్మం, అర్థం, కామం, మోక్షం” అనే హిందూ జీవన సూత్రాలను ఆచరణలో పాటించారు. 1975లో జయప్రకాశ్ నారాయణ ఏర్పాటుచేసిన లోకసంఘర్ష్ సమితికి నేతృత్వం వహిస్తూ, ఎమర్జెన్సీ పాలనకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నడిపించారు. దీని ఫలితంగా 1977లో ఇందిరా గాంధీ పరాజయం చెందటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత అధికారంలో భాగం అవ్వకుండా, పదవులను స్వీకరించకుండా జీవించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చదలచిన పద్మ విభూషణ్ బహుమతిని కూడా నిరాకరించారు. దేశంలో ఊహాత్మక వ్యాపారాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. స్టాక్ ఎక్స్చేంజ్, డెరివేటివ్స్, కరెన్సీ మార్కెట్లకు బదులుగా స్వయం ఉపాధిపైనే దృష్టి పెట్టాలని సూచించారు. ఆలోచనాపరుడిగా ఆయన 100కు పైగా పుస్తకాలు రచించారు. కార్యకర్త, థర్డ్ వే, ఆన్ రివల్యూషన్, హిందూ ఎకనామిక్స్ వంటి పుస్తకాలు విస్తృత ఆదరణ పొందాయి. డాక్టర్ అంబేద్కర్‌తో కలిసి ఆయన ఆదిమ జాతి సంఘ్‌ను స్థాపించి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు. రాజ్యసభ సభ్యుడిగా రెండు పర్యాయాలు సేవలందించిన థెంగడిజీ, జీవన విలువల్లో స్పష్టత, ఆచరణలో నిబద్ధతతో దేశానికి మార్గదర్శకుడిగా నిలిచారు.
✍️ గంగరాజు కందికొండ రిపోర్టర్ వరంగల్..