డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ జాతీయ సాహిత్య పురస్కారం
తొలి గ్రహీతగా డా. చిటికెన కిరణ్ కుమార్ ఎంపిక
సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)
తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవలు అందిస్తూ కవిగా, రచయితగా, విమర్శకుడిగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన సిరిసిల్ల వాస్తవ్యులైన డా. చిటికెన కిరణ్ కుమార్ డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ జాతీయ సాహిత్య పురస్కారం తొలి గ్రహీతగా అఖిల భారత పద్మశాలి సంక్షేమ సంఘం ఎంపిక చేసింది.డా. కిరణ్ కుమార్ సాహిత్య ప్రస్థానం విస్తారమైనది. చైతన్య స్ఫూర్తి వంటి ప్రథమ గ్రంథం, ఓ తండ్రి తీర్పు లఘు చిత్రకథ, వందలాది పత్రికలలో వెలువడిన అనేక కవితలు,వ్యాసాలు, సమీక్షలు, సంపాదకీయాలు—ఇవి అన్నీ తెలుగు పాఠకలోకంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన కృషి గర్వకారణంగా నిలిచింది.
ఈ అవార్డు, పద్మశాలి కుల భూషణులు, వేలాది లలితగీతాలు రచించిన సుప్రసిద్ధ సినీ గేయరచయిత, జాతీయ మహాకవి స్వర్గీయ డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ స్మారకార్థం సంస్థ స్థాపించింది. తెలుగు సాహిత్యానికే కాదు, సంగీత, సినీ ప్రపంచానికీ ఆయన అందించిన విలువైన కృషి ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలుస్తుంది.
ఈ అవార్డును మొదటిసారిగా డా. చిటికెన కిరణ్ కుమార్ అందజేయడం తమ సంఘానికి గర్వకారణమని సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు తుమ్మ సత్యనారాయణ, సూరేపల్లి రవికుమార్ లు ఒక ప్రకటనలో తెలియజేశారు. త్వరలోనే హైదరాబాద్లో జరగబోయే ప్రత్యేక కార్యక్రమంలో, ప్రముఖుల సమక్షంలో ఈ పురస్కారం ఘనంగా ప్రదానం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగా సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ఎలగొండా రవి, ప్రధాన కార్యదర్శి ఆడెపు లక్ష్మణ్, ఉపాధ్యక్షులు బూర దేవానందం, యువజన కార్యదర్శి అంకారపు రవి, కవులు,కళాకారులు, రచయితలు అభినందించారు