
Effective Use of Mineral Development Funds
మినరల్ డవలప్మెంట్ నిధులు వినియోగించుకోవాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం జిల్లా మినరల్ డవలప్మెంట్ నిధులు సమర్థవంతంగా వినియోగించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
గురువారం ఐడిఓసి కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో పలు శాఖల జిల్లా స్థాయి అధికారులతో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో డిఎంఎఫ్టి మేనేజింగ్ కమిటి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాధాన్యత కలిగిన రంగాలకు డిఎంఎఫ్టి నిధులు సమర్థవంతంగా వినియోగించాల్సిన అవసరం ఉందని అన్నారు.
పారిశ్రామికీకరణ వల్ల ప్రభావితం అవుతున్న ప్రాంతాలలో
ప్రజలకు మౌలిక సదుపాయాలైన ఆరోగ్యం, విద్య, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్య, వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాలను ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని నిధులు వినియోగించాలని తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసి, పారదర్శకతతో అమలు చేయాలని సూచించారు.
ప్రతి మూడు నెలలకు ఒకసారి డి.ఎం.ఎఫ్.టి మేనేజింగ్ కమిటి సమావేశాలు నిర్వహించాలని
అలాగే, ఇప్పటికే మంజూరైన పనుల పురోగతిని వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. చేపట్టిన పనులలో నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని అధికారు లను ఆదేశించారు. నిధుల వినియోగంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకోరాదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, సీపీఓ బాబూరావు, మైనింగ్, సంక్షేమ, వ్యవసాయ, విద్యా, వైద్య తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.