
Vemulawada EO Appointment: Minister Clarifies
ఈవో నియామకం.. మంత్రి కొండా సురేఖ కార్యాలయం వివరణ
వేములవాడలోని దేవాలయం ఈవో నియామకంపై వార్త పత్రికల్లో విభిన్న కథనాలు వెల్లువెత్తుతోన్నాయి. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కార్యాలయం స్పందించింది.
హైదరాబాద్, ఆగస్టు 31: వేములవాడ ఈవోగా రమాదేవిని ఎటువంటి ఒత్తిడులు కానీ, ఎవరి అభిష్టం మేరకు కానీ నియమించ లేదని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ కార్యాలయం స్పష్టం చేసింది. వేములవాడ ఈవో నియామకంపై వస్తున్న వార్త కథనాలపై తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కార్యాలయం ఆదివారం వివరణ ఇచ్చింది. సదరు ఈవో రమాదేవిని తొలుత హౌసింగ్ డిపార్టుమెంటుకు పంపాలని ఆదేశాలు రాగా.. సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆమోదం తీసుకొని మళ్లీ ఎండోమెంట్ డిపార్టుమెంటులో ఆమెను కొనసాగించాలని మంత్రి కొండా సురేఖ నిర్ణయించారని పేర్కొంది. ఆ క్రమంలో వేములవాడ ఈవోగా రమాదేవిని నియమిస్తూ.. ఉత్తర్వులు ఇవ్వాలని మంత్రి కొండా సురేఖ ఆదేశించారని చెప్పింది.
వేములవాడ ఈవోగా రమాదేవి నియామకం ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామాయ్యర్ అభిష్టం మేరకు జరిగిందంటూ ఆగస్టు 31వ తేదీన ఆంగ్ల పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ కార్యాలయం స్పందించింది. కాగా ఈ అంశంలో ఎండోమెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్ సొంత నిర్ణయం ఏ మాత్రం లేదని గుర్తించాలని మీడియా మిత్రులకు తెలంగాణ దేవాదాయ మంత్రి కొండ సురేఖ కార్యాలయం వివరణ ఇచ్చింది.
అదీకాక.. ఈ రోజు ఆంగ్ల పత్రికలో వెలువడిన కథనం.. కొంత మేర తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే విధంగా ఉందని అభిప్రాయపడుతూ.. దేవాదాయ శాఖ మంత్రి కార్యాలయం ఈ మేరకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఎండోమెంట్స్ ప్రిన్సిపల్ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యార్ ప్రమేయం లేదని.. మంత్రి కొండా సురేఖ ఆదేశాలతోనే ఈవోగా రామాదేవి నియామకం జరిగిందని మంత్రి కార్యాలయం స్పష్టం చేసింది.