
Cresco Housing Scam: Victims Demand Justice
శంకర్పల్లిలోని క్రెస్కో హౌసింగ్ ప్రాజెక్టు కు నలుగురు బాధితులు బలి
పది సంవత్సరాలు గడుస్తున్నా పూర్తికాని ఇండ్ల నిర్మాణం
న్యాయం చేయండి అంటూ మీడియా ముందు బాధితులు
శంకర్పల్లి,నేటిధాత్రి :
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని సింగాపూర్ వార్డు సంగారెడ్డి రోడ్డు లో సర్వేనెంబర్ 317, 324 లలో 22 ఎకరాల 31 గుంటలతో 2015 మార్చి 14న క్రెస్కో హౌసింగ్ ప్రాజెక్టు విల్లాల ఏర్పాటుకు భూమి పూజ చేసింది. భూమి యజమాని జీకే రాజు. జీకే రాజు వద్ద క్రెస్కో కంపెనీ యాజమాన్యం అనిల్ కుమార్ సిద్ధూ, శ్యాంసుందర్ బేతి, దొమ్మాట నరసింహారావు అనే ముగ్గురు బిల్డర్లు వెంచర్ ను ఏర్పాటు చేస్తామని భూమిని తీసుకున్నారు. భూమి యజమానికి ఒప్పదం ప్రకారం డబ్బులు ఇవ్వాలని స్థానిక ఇన్వెస్టర్స్ విట్టలయ్య తండ్రి పెంటయ్య, సత్యం రెడ్డి తండ్రి అడివిరెడ్డి, పట్నం యాదయ్య తండ్రి సాంబయ్య, ఎస్ లచ్చయ్య తండ్రి పెంటయ్య వద్ద నుండి కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ గా తీసుకున్నారు. ఆ తర్వాత దొమ్మాట నరసింహారావు తన వాటాలో భాగస్వామిగా స్వాగతిస్తూ ప్రభాకర్ రెడ్డి తండ్రి బుచ్చిరెడ్డి నుండి రెండు కోట్ల రూపాయలు తీసుకున్నారు. అనంతరం ముందుగా ఇచ్చిన చెక్కులు ఫెయిల్ అవ్వడంతో భూమి యజమాని జీకే రాజుతో ల్యాండ్ డెవలప్ మెంట్ కొరకు అగ్రిమెంట్ ఒప్పదం చేసుకున్నారు. ల్యాండ్ దేవలప్ మెంట్ సమయంలో స్థానిక పెట్టుబడి దారులు చెల్లించిన 3 కోట్ల రూపాయలు వారికి చెల్లించారు. అనంతరం 123 విల్లాలుగా చేసి అమ్మకానికి పెట్టారు. మొదటి విడతగా 10% చెల్లిస్తే చాలు అంటూ ఎక్కువ మందిని ఆకర్షించారు. సొంత ఇల్లు కట్టుకోవాలన్న కల నిజం అవుతుందన్న నమ్మకంతో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగస్తులు, చిరు వ్యాపారులు క్రెస్కో వెంచర్ లో విల్లాలను తీసుకుందామని అప్పులు చేసి మరి 10% సొమ్ము చెల్లించి అగ్రిమెంట్ చేసుకున్నారు. వెంచర్ యాజమాన్యం మొదటి లైనులో 200 గజాలను 35 లక్షలకు, రెండవ లైనులో 167 గజాలను 23 లక్షలకు, మూడవ లైనులో 2002 గజాలను 41 లక్షలకు అమ్మింది. పది శాతం పోగా మిగిలిన సొమ్మును లోన్ ద్వారా చెల్లించే సదుపాయాన్ని కల్పిస్తామని చెప్పి డాక్యుమెంట్ ప్రాసెస్ కూడా చేసింది. దాని ఫలితంగా విల్లాలు కొన్న యజమానులకు లోన్ అప్రూవల్ లెటర్ కూడా రావడంతో ప్లాట్ యజమానులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలోనే భూమి యజమాని హఠాత్తుగా మరణించారు. ఇదే అదునుగా భావించిన క్రెస్కో హౌసింగ్ ప్రాజెక్టు ఇండియన్ బ్యాంకు యాజమాన్యానికి భూ యజమాని మరణించిన విషయం తెలిపి కొనుగోలుదారుల లోన్ ప్రాసెస్ ను నిలిపివేయించారు. అనంతరం వారిపై వారే ఆరోపనలను చేసుకొని ఒకరిపై ఒకరు కేసు పెట్టుకుని నమ్ముకున్న కొనుగోలు దారులను గందరగోళానికి గురి చేశారు. ఇచ్చిన గడువు లోపల విల్లాలు నిర్మించలేక పోతున్నామని పివిఆర్ కంపెనీతో 50% భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందానికి అడ్వాన్స్ గా 5 కోట్ల రూపాయలు క్రెస్కో హౌసింగ్ ప్రాజెక్టు యాజమాన్యానికి ఇచ్చింది. పనులు ప్రారంభించిన పివిఆర్ కంపెనీ దాదాపు 5 కోట్ల రూపాయలు వెచ్చించి కొంతవరకు భవన నిర్మాణాన్ని కొనసాగించింది. వారితో తగాదా చేసుకుని వారిని భాగస్వామ్యం నుండి తప్పించింది. అనంతరం తర్వాత కొన్ని సంవత్సరాలకు రాధా టిఎంటి వారి దగ్గర కూడా వెంచర్ యాజమాన్యం 6 కోట్ల వరకు డబ్బు తీసుకుని ఇండ్ల నిర్మాణ పనులను పూర్తి చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. భూ యాజమాన్యానికి అగ్రిమెంట్ డబ్బులు ఇవ్వనందున రాధా టిఎంటి వారికి భూమి రిజిస్ట్రేషన్ చేయలేక ఒప్పందం రద్దుకై 6 కోట్లకు బదులుగా 9 విల్లాలు, 31 గుంటల భూమిని అగ్రిమెంట్ చేసి ఇచ్చింది. ఈ విధంగా వెంచర్ యజమాన్యం 2 కంపెనీల వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఇద్దరిని క్రెస్కో మోసం చేసింది. 123 విల్లాలను కడతామని చెప్పి, మార్కెట్లో బ్రోచర్లను విడుదల చేసి మార్కెటింగ్ చేయించారు. 106 ఇండ్లు ఇప్పటికీ కూడా అసంపూర్తిగా ఉన్నాయి.

ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగస్తులు, చిరు వ్యాపారులు 2018లో క్రెస్కో వెంచర్ లో విల్లాలను తీసుకుందామని అప్పులు చేసి మరి కొనుగోలు చేశారు. వెంచర్ యాజమాన్యం ఇండ్లను అసంపూర్తిగా వదిలి వేయడం వల్ల కొనుగోలు చేసిన యజమానులు 5 గురు వారే సొంత డబ్బులతో పనులు పూర్తి చేసుకొని, బయట కిరాయి ఇళ్లల్లో కిరాయి కట్టలేక, వసతులు, అండర్ డ్రైనేజీ సరిగ్గా లేకుండా అందులో నివాసం ఉంటున్నారు. వెంచర్ యాజమాన్యం ఇండియన్ బ్యాంక్ ద్వారా లోన్లు ఇప్పిస్తానని చెప్పి, లక్షల్లో నగదును తీసుకొని మోసం చేసిందని బాధితులు ఆరోపించారు. మూడు దఫాలుగా నగదును కట్టామని తెలిపారు. ఇండ్లు పూర్తికాక ఇప్పటివరకు నలుగురు బలైపోయారు. ఇప్పటికైనా క్రెస్కో వెంచర్ యాజమాన్యం స్పందించాలని, బాధితులకు న్యాయం చేయాలని మీడియా ముందు మొరపెట్టుకున్నారు.