
Harish Rao Blames Govt for Thimmapur Dengue Deaths
వీరిది ప్రభుత్వ హత్యే.. తిమ్మాపూర్ డెంగ్యూ మరణాలపై హరీష్ రావు ఫైర్..
డెంగ్యూ జ్వరంతో చనిపోయిన తిమ్మాపూర్ యువకుల కుటుంబాలను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని.. పారిశుద్ధ్యం సరిగా లేక గ్రామాలు పడకేస్తే రేవంత్ సర్కార్ మొద్దునిద్రపోతోందని మండిపడ్డారు.
సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో డెంగ్యూ జర్వంతో చనిపోయిన మహేష్ (35), శ్రవణ్ కుమార్ (15) అనే యువకుల కుటుంబాలను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిమ్మాపూర్ గ్రామంలో 40 నుండి 50 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో వైరల్ ఫీవర్ చికిత్స కోసం వెళ్లినా ప్రయోజనం లేక.. గ్రామ ప్రజలు ప్రైవేటు వైద్యం కోసం అప్పుల పాలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో స్పెషల్ డ్రైవ్ పెట్టామని.. ఇప్పుడు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పోయిందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్యం లోపించి గ్రామాలన్నీ పడకేశాయని.. తిమ్మాపూర్లో ఇద్దరు యువకులు డెంగ్యూతో మృత్యువాత పడటానికి రేవంత్ సర్కార్ నిర్లక్ష్యమే కారణమని ఫైర్ అయ్యారు.