
Science Congress.
తెలంగాణ సైన్స్ కాంగ్రెస్‌లో – గుడి తిరుపతి ప్రసంగం
హనుమకొండ నేటి ధాత్రి:
జిల్లా శ్రీరాములపల్లికి చెందిన గుడి తిరుపతి, కాకతీయ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ – 2025 లో పాల్గొని ప్రత్యేక ప్రసంగం చేశారు. సరిగ్గా 24 సంవత్సరాల క్రితం గుడి తిరుపతి అదే విశ్వవిద్యాలయం గణిత విభాగంలో విద్యార్థి. ఆర్థిక ఇబ్బందులు, అనేక వడదడుగులు ఎదుర్కొంటూ “పేదరికం విద్యకు అడ్డంకి కాదని” తన కృషితో నిరూపించారు. ఇంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా విద్యకు దూరమయ్యానేమో అన్న భయంతో, నిరంతరం కష్టపడి జాతీయస్థాయి పరీక్షల్లో విజయాలు సాధిస్తూ, కాకతీయ విశ్వవిద్యాలయం మాస్టర్స్‌లో మొదటి ర్యాంకు పొందారు. తండ్రి లక్ష్మారెడ్డి, తల్లి లక్ష్మమ్మ దంపతుల కుమారుడైన ఆయన, 2001లో పీజీ పూర్తి చేసి, అనంతరం ఐఐటి బాంబేలో న్యూమరికల్ ఎనాలసిస్‌లో పిహెచ్డి చేశారు. అమెరికా, జర్మనీలో రెండు పోస్ట్‌డాక్టరల్ పరిశోధనలు పూర్తి చేసి, ప్రస్తుతం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), బెంగళూరులో ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో గౌరవనీయ స్థానాన్ని సంపాదించిన గుడి తిరుపతి, ప్రపంచంలో నంబర్ వన్ జర్నల్ ఆఫ్ న్యూమరికల్ ఎనాలసిస్‌కి ఎడిటర్‌గా కొనసాగుతున్నారు. అలాగే ఆయన ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, బెంగళూరు మరియు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ప్రయాగ్‌రాజ్ ఫెలోగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మార్గదర్శకత్వంలో 8 మంది పిహెచ్.డి పరిశోధకులు మరియు 6 మంది పోస్ట్‌డాక్టరల్ ఫెలోస్ (పిడిఎఫ్) పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన గుడి తిరుపతి, గణితంపై ఆసక్తి పెంపొందించుకోవాలని, ప్రాథమిక అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని సూచించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అనేక సంస్థలు విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం గణితంపై పరిశోధన, శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని, వాటిలో పాల్గొనడం ద్వారా ఆధునిక జ్ఞానం పొందవచ్చని ప్రోత్సహించారు. కార్యక్రమంలో గణిత విభాగాధిపతి డాక్టర్ భారవి శర్మ, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్ సౌజన్య, ప్రొఫెసర్ మల్లారెడ్డి, డాక్టర్ రాజ్ కుమార్, డాక్టర్ తిరుమలాదేవి, రిటైర్డ్ ఆచార్యులు శ్రీహరి, డాక్టర్ సోమయ్య, డాక్టర్ నాగయ్య, డాక్టర్ చందులాల్, డాక్టర్ శ్రీనివాస్, రుద్రాణి, విభాగ పరిశోధకులు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.