
Minister Konda Surekha
అభివృద్ధి–సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యం : మంత్రి కొండా సురేఖ
వరంగల్, నేటిధాత్రి.
అభివృద్ధి, సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మొత్తం రూ. 5.87 కోట్లు వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆమె గురువారం శంకుస్థాపన చేశారు. జిడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో 15వ ఆర్థిక సంఘ నిధులు, జనరల్ ఫండ్ మరియు ఎస్ఎఫ్సి పథకాల కింద రూ. 4.87 కోట్ల విలువైన పలు పనులను ప్రారంభించారు. వీటిలో బస్తీ దవాఖాన, బీఆర్ నగర్లో సీసీ రోడ్లు, ఎన్ఎన్ నగర్, జ్యోతినగర్‌లో సీసీ రోడ్లు, అంబేడ్కర్ భవన్ కమ్యూనిటీ హాల్, బీరన్నకుంట కమ్యూనిటీ హాల్ నిర్మాణం, బట్టలబజార్ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో కిచెన్ షెడ్, రంగశాయిపేటలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణం ఉన్నాయి. అదనంగా ఆర్అండ్బి శాఖ కింద రూ.

కోటి వ్యయం తో మషూఖ్ రబ్బానీ దర్గాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అదనంగా, బీరన్నకుంట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మంత్రి, మేయర్, జిల్లా కలెక్టర్, జిడబ్ల్యూఎంసీ కమిషనర్‌తో కలసి మధ్యాహ్న భోజనం వడ్డించారు. తరువాత కరీమాబాద్ పరపతి సంఘ భవనంలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. తూర్పు నియోజకవర్గంలో 2690 కొత్త కార్డులను జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 6815 రేషన్ కార్డులు మంజూరు, వాటిలో 26766 కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసినట్లు వివరించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ….

ప్రతి నిరుపేద కుటుంబానికి ఆహార భద్రతే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను అందజేస్తోందని, గతంలో ఇచ్చిన దొడ్డు బియ్యం స్థానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలకు సన్న బియ్యం అందిస్తున్నారని,
లబ్ధిదారులకు అన్ని సంక్షేమ పథకాలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. అదనంగా, జిల్లాలోని విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందించేందుకు రామకృష్ణ మిషన్ అక్షయపాత్ర ఆధ్వర్యంలో 123 ప్రభుత్వ పాఠశాలల్లో కార్యక్రమం ప్రారంభించామన్నారు.

మొదటి విడతలో కరీమాబాద్ సహా 55 పాఠశాలల్లో అమలు చేస్తున్నట్లు తెలిపారు. వరంగల్ నగరాన్ని హైదరాబాద్ తరహాలో సమగ్ర అభివృద్ధి చేయడానికి మామునూరు విమానాశ్రయం, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పనులు వేగవంతం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే ముంపు నివారణకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని చెప్పారు.నియోజకవర్గంలో అర్హులైన పేదల కోసం 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్టు, మరో 3500 ఇళ్లు ఈ సంవత్సరం కేటాయించనున్నట్టు వెల్లడించారు. దేవాదాయ శాఖ ద్వారా జిల్లాలోని అన్ని దేవాలయాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహాత్ బాజ్ పాయి, కార్పొరేటర్లు, రెవెన్యూ అధికారులు, బల్దియా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
