
School Disrupted by Bank Elections in Warangal
స్కూల్ వర్కింగ్ డే నాడు బ్యాంక్ ఎన్నికలు?
ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
తల్లిదండ్రుల ఆందోళన….
కలెక్టర్ జోక్యం కోరుతూ విజ్ఞప్తి….
నేటిధాత్రి, వరంగల్.
ఈ రోజు ఉదయం 9గంటలకు ఏవివి స్కూల్లో ప్రారంభమైన వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
సాధారణ పాఠశాల పని దినానికే బ్యాంకు ఎన్నికలకు పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం విద్యార్థులు, గురువులను గందరగోళానికి గురి చేస్తుంది.
ఓ వైపు తరగతులు సాగుతుండగా, మరోవైపు బ్యాంక్ ఎన్నికల్లో ఓటు వేయడానికి పెద్ద సంఖ్యలో ఓటర్లు రావడంతో స్కూల్ ప్రాంగణం హోరెత్తుతోంది.
ఇరు వర్గాల నేతలు ముమ్మురంగా ప్రచారం చేయడంతో పాఠశాల వాతావరణం రాజకీయ ప్రచారంలా మారిపోయింది?
చదువుకోడానికి వచ్చిన విద్యార్థులు ఆకస్మికంగా ఈ రకమైన హడావుడి చూడడం వల్ల అసౌకర్యం, భయం వ్యక్తం చేస్తున్నారు.
“ఎన్నికల కోసం స్కూల్ భవనాన్ని వాడినా, కనీసం ఆ రోజు పిల్లలకు సెలవు ఇవ్వాల్సింది” అని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థుల పాఠశాల వాతావరణం భంగం కలగకుండా భవిష్యత్తులో పని దినాల్లో ఇలాంటి ఎన్నికల ఏర్పాట్లు చేయవద్దని, తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని కలెక్టర్‌ను కోరుతున్నారు.
విద్యార్థుల చదువుకే ప్రాధాన్యం ఇవ్వాలని తల్లిదండ్రులు గళమెత్తుతున్నారు.