
*బంగారు కుటుంబాలకు మార్గదర్శి గా కమిషనర్ ఎన్.మౌర్య..
తిరుపతి నేటి ధాత్రి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పి4 కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య ఏడు బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని ఆదర్శంగా నిలిచారు. పేదలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను నిలపాలని ఉద్దేశ్యంతో చేపట్టిన పి4 కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య భాగస్వాములై నిరుపేదలైన ఏడు కుటుంబాలకు అండగా నిలబడుతున్నారు. బుధవారం ఆ కుటుంబ సభ్యులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి వివరాలు తెలుసుకుని చలించిపోయారు.ఓ చిన్నారికి తండ్రి,తల్లి లేకపోవడం తెలుసుకుని, మీ కుటుంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తల్లిదండ్రులు లేని చిన్నారికి విద్యను,తండ్రి లేని ఇద్దరు పిల్లలకు,
తండ్రి లేని మరో బాలికకు విద్యను, అందిస్తానని హామీ ఇచ్చారు.
ఇల్లు లేని ఓ కుటుంబానికి ఇల్లు ఇప్పిస్తానని, జీవనోపాధి కోసం ఒకరికి తోపు బండి, కిరాణా షాపు పెట్టుకునేందుకు తను ఆర్థికంగా సాయం అందించేందుకు కమిషనర్ ఎన్.మౌర్య అంగీకరించారు.ఇందుకు బంగారు కుటుంబాలు ఆనందం వ్యక్తం చేశారు. నగరంలోని పేదలను (బంగారు కుటుంబాలు) ఏదో విధంగా సాయం చేసేందుకు మార్గదర్శకులు ముందుకు రావాలని కమిషనర్ పిలుపునిచ్చారు.