500 కోట్లతో గౌడ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
జిల్లా గోపా అసోసియేట్ అధ్యక్షులు రామగోని సుధాకర్ గౌడ్
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న నాయకులు
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదకు డిమాండ్ల వినతిపత్రం
వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:
గౌడ కులస్తుల అభివృద్ధి కొరకు 500 కోట్లతో గౌడ కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలని వరంగల్ జిల్లా గౌడ అఫీషియల్స్ ,ప్రొఫెషనల్స్ అసోసియేషన్ గోపా అసోసియేట్ అధ్యక్షులు రామగోని సుధాకర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బహుజన బావుటా ఎగురవేసిన తొలి విప్లవయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టగా సోమవారం వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఘనంగా నిర్వహించారు.ఈ నేపథ్యంలో అధికారులతో పాటు గోపా నాయకులు, మోకుదెబ్బ నాయకులు హాజరయ్యారు.గౌడ గీత కార్మికుల సమస్యల పట్ల గోపా జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు రామగోని సుధాకర్ గౌడ్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1650 ఆగస్టు 18న వరంగల్ జిల్లాలోని ఖిలాషాపురంలో జన్మించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పురాణంలోని కుల మూల పురుషుడు కాటమయ్య నాయకత్వ మానవీయ కోణాలను పుణికి పుచ్చుకున్న వీరుడని పేర్కొన్నారు.
తెలంగాణ గడ్డమీద బహుజన బావుటా ఎగురవేసిన తొలి విప్లవకారుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు.పశువుల కాపరి నుంచి అన్ని కుల సంఘాలు,సబ్బండ వర్గాలను కూడగట్టుకొని అన్యాయంపై సనాతన సాంప్రదాయాలకు విరుద్ధంగా దళిత, బహుజన,మైనార్టీ వర్గాలను ఏకం చేసి అప్పటి భూస్వామ్య దొరలగడీలు నుండి మొఘల్ సామ్రాజ్య కోట గోడలను బద్దలు కొట్టిన మొనగాడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు.సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసి జనగాం జిల్లాకు పాపన్న గౌడ్ పేరు పెట్టాలన్నారు.గౌడ కులస్తుల అభివృద్ధి కొరకు 500 కోట్లతో గౌడ కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేసి,పెన్షన్ 2 వేల నుండి 5 వేల రూపాయలకు పెంచాలని పేర్కొన్నారు.ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో, వైన్ షాప్స్ వేలం పాటల్లో 50 శాతం గౌడ కులస్తులకు రిజర్వేషన్ కల్పించాలని అలాగే 18 సంవత్సరాలు నిండిన యువతకు గీత కార్మిక సభ్యత్వం ఇవ్వాలని సుధాకర్ గౌడ్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గోపా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మి నారాయణగౌడ్,గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంతుల రమేష్ గౌడ్,జిల్లా అధ్యక్షుడు గోపగాని వేంకటేశ్వర్లుగౌడ్,రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దెల సాంబయ్య గౌడ్,పలువురు అధికారులు పాల్గొన్నారు.
