
National Flag
500 మీటర్ల జాతీయ జెండా తో తిరంగా ర్యాలీ
భూపాలపల్లి నేటిధాత్రి
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో 500 మీటర్ల జాతీయ జెండా తో తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ తిరంగా ర్యాలీకి ముఖ్య అతిథిగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ బ్రిటిష్ వలస పాలన నుండి ఈ దేశానికి స్వాతంత్ర్యం ఊరికే రాలేదని లక్షల మంది ప్రాణత్యాగం చేస్తే వచ్చిందని అన్నారు.మహమ్మదీయుల నుండి బ్రిటిష్ పాలన వరకు మన దేశం బానిస సంకెళ్లను అనుభవించడానికి కారణం మన దేశ ప్రజల్లో ఐకమత్యం, దేశపట్ల ప్రేమ లేకపోవడమే కారణం అని అన్నారు. లక్షల మంది ప్రాణత్యాగంతో వచ్చిన ఈ స్వేచ్ఛను కాపాడుకునే బాధ్యత ఈ దేశ పౌరులుగా మన అందరి మీద ఉందని పునరుద్ఘాటించారు. దేశంలో ఇప్పుడు కూడా కొన్ని శక్తులు డీప్ స్టేట్ కనుసన్నల్లో, విదేశీ భావజాల ముసుగులో ఈ దేశాన్ని అస్థిర పరిచే కుట్రపన్నుతున్నారని దీనిని అడ్డుకొని తీరాలన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, వ్యక్తి నిర్మాణమే ఆదర్శం కావాలి తప్ప నిర్మూలన కాదన్నారు. ఈ దేశం ప్రపంచానికి మానవ వనరులను అందించే కర్మాగారంగా ఉందని, శాస్త్ర సాంకేతిక రంగాల్లో, ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతూ విశ్వగురు స్థానం వైపు దూసుకెళ్తున్న సమయంలో మరోమారు దేశ విచ్ఛిన్నకర శక్తులు పెట్రేగి పోతున్నారని బాధ్యత గల పౌరులుగా, దేశభక్తులుగా భరతమాతను కాపాడుకోవాలని యువతకు,విద్యార్థులకు పిలుపునిచ్చారు.పూర్వ రాష్ట్ర కార్యదర్శి అంబాల కిరణ్, భూపాలపల్లి జిల్లా కన్వీనర్ గుజ్జుల.ప్రేమ్ కుమార్, ప్రదీప్, విఘ్నేష్, సాయితేజ, వైష్ణవి, సహస్ర, అభి, బంటి, పేట. సాయి, వరుణ్, రాంచరణ్ తదితరులు పాల్గొన్నారు.