
`తెలంగాణలో విచిత్రమైన రాజకీయ వాతావరణం.
`గతంలో నాయకులతో పాటు వందలాది మంది కార్యకర్తలు కదిలేవారు.
`ఇప్పుడు నాయకులు మాత్రమే కొత్త దారి వెతుక్కుంటున్నారు.
`బీఆర్ఎస్ నుంచి నాయకులు కారు దిగుతున్నారు.
`ఇతర పార్టీల నుంచి నాయకులు కారెక్కుతున్నారు.
`కారు దిగుతున్న నాయకులతో మేం రామంటున్నారు.
`అధికారంలో వున్న కాంగ్రెస్ వైపు కార్యకర్తలు ఎందుకు చూడడం లేదు!
`కాంగ్రెస్ లో కొత్త వారిని కలుపుకుపోరన్న భయమా!
`ఇప్పటికే రెండేళ్ళు గడిచింది.. పార్టీ మారితే ఒరిగేముందన్న భావనా?
`బీఆర్ఎస్ లో కూడా కార్యకర్తలు అసంతృప్తిగానే వున్నారు.
`అయినా కారు దిగి జారుకోవడానికి సిద్ధంగా లేరు!
`ఇతర కండువాలు కప్పుకోవడానికి సిద్ధంగా లేదు.
`గువ్వల బాలరాజు మీటింగ్ తో కొంత తేట లెల్లమైంది.
`మేం రామని తెగేసి చెప్పినట్లైంది.
హైదరాబాద్,నేటిధాత్రి:
అటు లీడర్..ఇటు క్యాడర్! తెలంగాణలో విచిత్రమైన రాజకీయ వాతావరణం. పార్టీలు మారుతున్న నాయకులతో క్యాడర్ రావడం లేదు. పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా క్యాడర్ కదలేదు. ఏ ఎమ్మెల్యేతో పట్టు పని పది మంది వెళ్లలేదు. వెళ్లినా ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో పొసగడం లేదు. తమతో ఎంతో మంది నాయకులు, కార్యకర్తలు వస్తారని, రావాలని కూడా ఎమ్మెల్యేలు అనుకోలేదు. అందుకే కాంగ్రెస్‌లో చేరిన ఏ ఎమ్మెల్యే కూడా దర్జాగా కండువా కప్పుకోలేదు. గతంలో ఈ పరిస్దితి భిన్నంగా వుంది. కాంగ్రెస్ నుంచి గాని, తెలుగుదేశం నుంచి గాని బిఆర్ఎస్లో నాయకులు చేరిన క్రమంలో పెద్ద పెద్ద ర్యాలీలు. వందల కార్లు కాన్వాయిలు. గులాబీలు. జెండాలో అబ్బో అదో పెద్ద సెటప్‌తో వెళ్లేవారు. జిల్లాల నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు, నాయకులతో చేరి, కండువాలు కప్పుకున్నారు. కండువాలు కప్పే నాయకులు కూడా ఇంకా వున్నారా? అని ఎదురుచూసిన పరిస్దితి కనిపించేది. ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీలో నాయకులు చాలానే చేరారు. కాని వారి వెంట క్యాడర్ పెద్దగా కదిలినట్లు లేదు. వందల మంది చేత వచ్చి కాంగ్రెస్‌లో కలిసిన నేతలు లేరు. బిఆర్ఎస్ నుంచి గెలిచి, కాంగ్రెస్‌లో చేరి, కండువా కప్పుకొని, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన దానం నాగేందర్ వెంట కూడా జనం వెళ్లలేదు. క్యాడర్ ఆయనతో కదలేదు. ఆయన అదృష్టం పాత పరిచయాలు ఆయనకు దానంకు పనికి వస్తున్నాయి. వ్యతిరేకతకు తావు లేకుండా చేస్తున్నాయి. కాని మిగతా ఎమ్మెల్యేలందరికి మాత్రం విచిత్రమైన వాతావరణమే వుంది. ఇందులో కడియం శ్రీహరి లాంటి నాయకుడు గతంలో తెలుగుదేశంలో వున్నంత కాలం బలమైన క్యాడర్‌ను మెంటైన్ చేశారు. తర్వాత పదేళ్లకాలం పాటు బిఆర్ఎస్లో కూడా బాగానే అధికారం చెలాయించారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఆయన జిల్లాకు, నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైన నాయకుడిగా మిగిలిపోయారు. ఆఖరుకు ఏ పార్టీలో వుండాలో ఆపార్టీలోనే వున్నానంటూ ముక్తాయించాల్సిన పరిస్ధితి తెచ్చుకున్నారు. కాకపోతే తన రాజకీయ చాణక్యంతో, చైతన్యంతో మాత్రం తన కూతురు కావ్యను ఎంపిని చేశారు. ఇది ఎంతైనా గొప్ప విషయం. రాజకీయాల్లో నైతికత అనే పదం ఈరోజుల్లో వాడడమే శుద్ద దండగ. నిజం చెప్పాలంటే రాజకీయాల్లో వుండి, నైతికత గురించి మాట్లాడడం అంటేనే గొంగడిలో కూర్చొని అన్నం తిన్నట్లే లెక్క. పార్టీలు మారినా, తన రాజకీయ ప్రస్తానాన్ని దిగ్విజయంగా కొనసాగించిన నాయకులలో కడియంశ్రీహరి ఎంతైనా ప్రత్యేకమే. అందుకే ప్రత్యర్ధి రాజకీయాలు చేసినా, ఒకే పార్టీలో కలిసి రాజకీయాలు చేసినా ఆయన స్దానం ఎప్పుడూ నిలబెట్టుకున్నారు. అధికారం చెలాయించారు. ఇతరుల అదృష్టాన్ని కూడా ఆయన సొంతం చేసుకున్నారు. అలాంటి నాయకుడు బహుశా దేశంలో కూడా లేకపోవచ్చు. తెలుగుదేశం పార్టీలో వున్నప్పుడు తనకు ఎదురులేకుండాపాలించారు. బిఆర్ఎస్లో చేరిన తర్వాత తన రాజకీయ ప్రత్యర్ధి అదృష్టం లాగేసుకున్నారు. 2018 తర్వాత మంత్రి కాకపోయినా, సరే తన పాత్రలోకి ఎవరూ రాకుండానే చూసుకున్నారు. వరంగల్ జిల్లా రాజకీయాల్లో తన దరిదాపుల్లోకి కూడా ఎవరినీ రాకుండాచూసుకున్నారు. ఇంత పెద్ద నాయకుడైనా సరే ఇప్పుడు క్యాడర్ ను వెతుక్కొవాల్సిన పరిస్ధితి వచ్చింది. రాజకీయాలలో వున్న వారు ఎప్పుడు ఏ పార్టీలో వుంటారో..వుండాలో అన్న దానిపై ఎవరి స్ధిర నిర్ణయం లేదు. నిలకడ అసలే లేదు. గాలి వాటం రాజకీయాలు. ఎందుకంటే గతంలో తన జీవితమంతా గులాబీతోనే అని అనేక సార్లు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చెప్పేవారు. ఆయనతోపాటు ఆయన సతీమణి కూడా వేరే రక్తం మనలో పారదు అని కూడా చెప్పారు. కాని అధికారం పోయింది. ఆయన ఓడిపోయారు. బిఆర్ఎస్లో తనను అనుమానంగా చూస్తున్నారు. మరో వైపు లెక్క చేయడం లేదు. మహబూబ్ నగర్ బిఆర్ఎస్లో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పెత్తనం ఎక్కువైపోయింది. పార్టీ కూడా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. తనను లెక్క చేయకుండా పార్టీ కార్యక్రమాలు చేపడుతోంది. ఇలాగే వుంటే వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా వచ్చే అవకాశం వుంటుందో లేదో అన్న అనుమానం వచ్చింది. ఎందుకంటే మహబూబ్ నగర్ రాజకీయాలను ఇప్పుడున్న పరిస్దితుల్లో ఒంటి చేత్తో లాగించుకొస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సామాజిక వర్గం, గువ్వల బాలరాజు సామాజిక వర్గం ఒకటే. అంతే కాకుండా అది రిజర్వుస్ధానం. రాజకీయ సమీకరణాలలో భాగంగా చూసుకున్నా, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ లాంటి వారిని జనరల్ సీట్లో పోటీ చేయించే అవకాశం వుండదు. రిజర్వు స్ధానంలో బలమైన నాయకులను పెట్టిన పార్టీలే గెలుస్తుంటాయి. కడియం రాజకీయం కూడా అలాగే సాగింది. ఆయన స్టేషన్ ఘన్‌పూర్‌లో ఆది నుంచి అక్కడినుంచే పోటీ చేస్తూ వస్తున్నారు. గెలుస్తున్నారు. 2014లో పార్లమెంటుకు ఎన్నికైనా సరే వరంగల్ ఎస్సీ రిజర్వుడు నుంచే గెలిచారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా తన సొంత జిల్లా నుంచే పోటీచేయాలని చూస్తున్నారు. గతంలో ఆయన ఆదిలాబాద్ నుంచి పోటీ చేసి పొరపాటు చేశారు. ఇది పాత రోజులు కాదు. గతంలో నాయకులకు పార్టీలు సీట్లు ఇచ్చినా గెలిచేవారు. అలా చరిత్రలో చాలా మంది వున్నారు. ఇప్పటికీ వున్నారు. మల్లు భట్టి విక్రమార్క అసలు జిల్లా పాలమూరు. కాని ఆయన మధిరను ఎంచుకొని వరుసగా గెలుస్తూ వస్తున్నారు. కాని ఇప్పుడు కొత్త నాయకత్వానికి ప్రజలనుంచి ఆ సహకారం అందేలా వుండేలా లేదు. ఉమ్మడి జిల్లా వరకు సరే,గాని జిల్లాలు దాటి వెళ్లి గెలవడం అంటే సాద్యమయ్యే పని కాదు. నాయకులు కొత్త దారితోపాటు సరికొత్త పంధాలో వెళ్లాలనుకుంటున్నారు. తాజాగా కారు దిగి, కమలం గూటికి చేరిన గువ్వల బాలరాజుతో పెద్దగా నాయకులు వెళ్లలేదు. దాంతో చేరిక సభ కార్యక్రమంలో గువ్వల బాలరాజుతో బిజేపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు వంద మందికూడా రాలేదని సభా సాక్షిగానే నవ్వుతూనే ఎద్దేవా చేశారు. పైగా వంద మంది జాయిన్ అయినప్పుడు అసలైన సభ్యత్వం ఇస్తామనే అర్దం వచ్చేలా చిన్న చెనుకు వదిలారు. కాని అది ఒక నాయకుడికి ఇబ్బందికరమే. ఇదిలా వుంటే బిఆర్ఎస్ నుంచి పెద్ద నాయకులు కారు దిగిపోతున్నారు. అదే సమయంలో జిల్లాలలో నాయకులతో సంబంధం లేకుండా పెద్దఎత్తున ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు చేరుతున్నారు. అలా మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలలో ఇటీవల చాలా మంది చేరారు. సహజంగా ఒక నాయకుడు ఎటు వైపు వెళ్తే క్యాడర్ అటు వైపు వెళ్లడమే చూశాం. కాని కారు దిగుతున్న నేతలతో క్యాడర్ మేం రామని తెగేసి చెబుతున్నారు. మీరు వెళ్తే వెళ్లండి..మమ్మల్ని రమ్మకనండి అని ముఖం మీదే చెబుతున్నారు. కాంగ్రెస్‌లో చేరడానికి కార్యకర్తలు ఒకింత భయపడుతున్నారు. కాంగ్రెస్‌లో కొత్తవారిని కలుపుకుపోయే వాతారణం కనిపించడం లేదు. పార్టీ మారినా పనులు వస్తాయన్న నమ్మకం లేదు. పదవులు వస్తాయన్న ఆలోచన వారిలో అసలే లేదు. ఎందుకంటే పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి అండగా వుంటూ, సేవలు చేసిన నాయకులు, కార్యకర్తలను కాదని కొత్త వారికి పెద్ద పీట వస్తుందన్న విశ్వాసం కలగడం లేదు. పైగా చేరిన ఎమ్మెల్యేల పరిస్దితే అలా వుంటే, చేరితే మా పరిస్దితి అంత కన్నా భిన్నంగా వుంటుందా? అన్న ఆలోచనలో బిఆర్ఎస్ క్యాడర్ గులాబీ జెండాను వదలడం లేదు. పైగా కాంగ్రెస్, బిజేపిల నుంచి వస్తున్న వారిని వద్దని వారించడం లేదు. ప్రతిపక్షంలో వున్నప్పుడు చేరే నాయకులు ఎవరైనా సరే పార్టీ కోసం కష్టపడాల్సిందే. కొంత కాలం గడిస్తే అందరూ కలిసిపోతారు. పోటీ పడి పనులు చేస్తారు. పార్టీకి మరింత బలమౌతారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బిఆర్ఎస్ క్యాడర్ కూడా నిరుత్సాహం, అసంతృప్తిగానే వున్నారు. కాని కారు దిగడానికి, జారుకోవడానికి సిద్దంగా లేరు. కాంగ్రెస్‌లో పొసగలేరు. బిజేపిలో చేరినా గుర్తింపు, ప్రజల్లో ఆదరణ వుంటుందన్న నమ్మకం అసలే లేదు. అందుకే తెలంగాణ రాజకీయాల్లో ఒక్క బిఆర్ఎస్ క్యాడరే మరో కండువా కప్పుకోవడానికి సిద్దంగా లేరు. ఇది మాత్రం నిజం.