
Poor sanitation in villages.
పల్లెల్లో కొరవడిన పారిశుధ్యం…
వసతి గృహాల్లో విధిగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి…
సీజనల్ వ్యాధులు ప్రభలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి…
గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలి…
మురుగునీరు నిల్వ లేకుండా చర్యలు చేపట్టాలి…
తరచుగా మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయాలి…
గ్రామాల్లో మంచినీటి ట్యాంకులను శుభ్రపరిచి క్లోరినేషన్ చేసి ఉపయోగించాలి…
డయేరియా, డెంగ్యూ, మలేరియా కేసులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి…
ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్ శుభ్రంగా ఉంచాలి…
సీజనల్ వ్యాధుల నివారణకు వైద్య ఆరోగ్యశాఖ కసరత్తు చేపట్టాలి…
సుదూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్న వైద్యులు,సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి…
నేటి ధాత్రి -గార్ల :-
వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రభలకుండా వైద్య ఆరోగ్యశాఖ ముందస్తు చర్యలు చేపట్టాలి. సీజనల్ వ్యాధులను అరికట్టాలి. వర్షాకాలం ప్రారంభం నుండి నీటి వరకు మండల వ్యాప్తంగా ఎక్కడ కూడా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజలకు స్థానికంగా ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన వైద్యులు, సిబ్బంది ఖమ్మం వరంగల్ లాంటి సుదూర ప్రాంతాల నుండి యదేచ్ఛగా రాకపోకలు సాగిస్తూ సమయపాలన పాటించనప్పటికీ జిల్లా అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలం చెందుతున్నారు. ఏటా వర్షాకాలం ప్రారంభంలో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదు అవుతాయి, జలుబు, దగ్గు, జ్వరం, వాంతులు,విరేచనాల బాధితులు వందల సంఖ్యలో వస్తుంటారు. వారికి సకాలంలో వైద్యం అందించడంలో వైద్యులు విఫలమవుతున్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో దోమలు ఈగలు స్వైర విహారం చేస్తున్నప్పటికీ దోమల మందు పిచికారి చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తు, తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనేది నిజం. వర్షాకాలంలో నీరు మారడం మూలంగా ఎక్కువగా వ్యాధులు వస్తుంటాయి. వర్షపు నీరు ప్రవహిస్తూ రావడంతో దుమ్ము,చెత్త,మట్టి కలిసిపోతాయి. నీటి రంగు మారుతుంది. అందుకు కాచిన, చల్లార్చిన నీటిని వడ పోసి త్రాగేలా, ఇంటి లోపల దోమలు రాకుండా, నీటి నిల్వ లేకుండా జాగ్రత్తలు పాటించేలా ప్రజలను చైతన్య పరచాలి. క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి ఇంటింటికి తిరిగి ప్రచారం చేసేలా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు చేపట్టాలి. పల్లెల్లో సైడ్ కాలువలలో మురుగు నీరు తొలగించి బ్లీచింగ్ పౌడర్ వేయాలని, త్వరితగతిన దోమల మందు పిచికారి చేయాలని, వైద్యులు, సిబ్బంది స్థానికంగా ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.