
Raksha Bandhan
* ఘనంగా రక్షాబంధన్ వేడుకలు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
రక్షాబంధన్ అంటేనే అక్కా తమ్ముళ్లు..అన్నా చెల్లెల అనురాగం, మమకారంతో..ప్రేమానుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది. ప్రేమని తీలకంగా పెట్టి..రాఖీని రక్షగా కట్టి..మంగళ హారతిని ఆశీస్సులుగా ఇచ్చి..నోటిని తియ్యగా చేసి..ఆనందించే వనితే సోదరీ..ఏడాదికోమారు అక్కా తమ్ముళ్ల, అన్నా చెల్లెళ్ల అపురూప కలయిక..ఆప్యాయతనురాగాల పొందిక..పవిత్ర బంధాల మేళవింపు..ప్రకాశించే రాఖీ కిరణాల సొంపు..భారతీయ సాంస్కృతి, సాంప్రదాయాల వేదికగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎక్కడెక్కడో ఉండే సోదరీమణులు తమ ప్రేమకు, అభిమానానికి గుర్తుగా తమ సోదరులకు రాఖీ కట్టేందుకు వెళ్తారు. అక్కా చెల్లెళ్ళు తమ అన్నదమ్ముల ముఖాన తిలకం దిద్ది, చేతికి ప్రేమగా రాఖీ కట్టి..మిఠాయి తినిపిస్తారు. సోదరులు తమ శక్తి కొద్ది కానుకలు ఇస్తారు. ఒకరికొకరు తీపి తినిపించుకొని అనుబంధాన్ని పంచుకుంటారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ సతీమణి వేముల సునీత హైద్రాబాద్ లో స్థిరపడ్డ తన తమ్ముడు మండల సుమన్ గౌడ్ కు రాఖీ కట్టి తమ్ముడికి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపింది. అనంతరం ఆమె పండుగ విశిష్టతను వివరించారు. ఏటా శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధన్ (రాఖీ) పండుగను నిర్వహించుకుంటామన్నారు. రాఖీ పండుగపై పురాణాల కథనం ప్రకారం రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయన్నారు. అలెగ్జాండర్ చక్రవర్తితో ఆ కాలంలో జరిగిన యుద్ధంలో పురుషోత్తముడనే రాజు ఓటమి పాలవుతాడు. అతడిని బందీ చేసి తీసుకెళుతున్న సమయంలో ఆయన భార్య రాణి సంయుక్త అలెగ్జాండర్ దగ్గరకు వెళ్లి రాఖీ కడుతుంది. దీంతో సంయుక్తను చెల్లెలుగా భావించి ఏం కావాలో కోరుకోమంటే..తన భర్త పురుషోత్తముడిని బందీ నుంచి విముక్తి చేయాలని వేడుకుంటుంది. వెంటనే పురుషోత్తముడిని విడుదల చేసి..సంయుక్తకు విలువైన కానుకలు ఇచ్చి అలెగ్జాండర్ వెళ్ళిపోతాడనేది చరిత్ర చెబుతుందని..అలాగే దుష్టశక్తులను పార ద్రోలడానికి..యుద్ధంలో విజయం సాధించడానికి..రక్షాబంధన్ ధరించాలని శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా మరో కథ ప్రచారంలో ఉందన్నారు. ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు రక్షను ధరించడం హైందవ ఆచారం. ఆ కార్యక్రమం ఏ విఘ్నాలు లేకుండా సజావుగా సాగాలని, అనుక్షణం లక్ష్యం గురించి గుర్తు చేసేందుకు ఈ రక్షను ధరిస్తారు. వివాహం, యజ్ఞ యాగాదులు, వ్రతాలు, నోములవంటి కార్యక్రమాల్లో ఈ రక్షాధారణ తప్పనిసరిగా ఉంటుంది. పూర్వకాలంలో యుద్ధానికి వెళ్లే భర్తలకు భార్యలు, సోదరుల క్షేమాన్ని కాంక్షిస్తూ సోదరీమణులు రక్షలు కట్టేవారు. కాలక్రమేణా రక్షను సోదర ప్రేమకు చిహ్నంగా కట్టే విధానం వచ్చింది. ఈ రక్షను కట్టడంలో ముఖ్య ఉద్దేశం..వారి క్షేమాన్ని కోరడమే..అలాగే ధర్మరక్ష..అంటే ధర్మాన్ని రక్షించడం! ధర్మం అంటే ఇక్కడ మతం అని కాదు..న్యాయాన్ని, సత్యాన్ని రక్షించడం. సహోదరత్వాన్ని, మైత్రీ బంధాన్ని రక్షించడం. బౌద్ధం చెప్పిన జాలీ, దయ, కరుణలను కాపాడుకోవడం. ఇది ఒక ప్రాంతానికి, ఒక దేశానికి సంబంధించినది కూడా కాదు. విశ్వజనుల శ్రేయస్సును ఉద్దేశించి ఏర్పరచుకున్నవి. బౌద్ధంలో సత్యానికి, అహింసకి, శీలానికి, శాంతికి ఎల్లలే లేవు. ఇది చాటి చెప్పడానికి బౌద్దారామాలలో ధర్మరక్షలు ( రక్షాబంధనలు ) కట్టుకుంటారు. దాన్ని ఉపయోగించి రొగ్జానా తన భర్త ప్రాణాల్ని కాపాడుకుంటుంది. అప్పటినుండి అది అన్నాచెల్లెళ్ల..అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక అయ్యింది. మరొక్కసారి హిందూ బంధువులకు రక్షాబంధన్ శుభాకాంక్షలతో..