
Revuri Prakash Reddy
అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయండి.
⏩సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి
⏩పారిశుద్ధ్యం,తాగునీటి, విద్యుత్ సరఫరా పై ప్రత్యేక అధికారులు దృష్టి సారించాలి.
రేవూరి ప్రకాష్ రెడ్డి
పరకాల శాసనసభ్యులు.
కాశిబుగ్గ నేటిధాత్రి.
పరకాల నియోజకవర్గంలో 15 16 17 వ డివిజన్ లలో పలు అభివృద్ధి పథకాల కింద చేపట్టి కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని స్థానిక శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అధికారులను ఆదేశించారు.నియోజకవర్గం పరిధిలోని 15,16,17 డివిజన్ల పురోభివృద్ధిపై నగర మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ భాజ్ పాయి లతో కలిసి బల్దియాలోని మేయర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.15,16,17 డివిజన్లలో అభివృద్ధి పనుల పురోగతి,పారిశుద్ధ్యం నిర్వహణ,మంచినీటి, విద్యుత్ సరఫరాకు సంబంధించిన పలు సమస్యలపై సమీక్షించడం జరిగింది.
⏩ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ
సాధారణ నిధులు,15వ ఆర్థిక సంఘం నిధులు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్,స్టాంప్ డ్యూటీ నిధులతో మూడు డివిజన్లో సుమారు 727 లక్షల రూపాయలతో 32 అభివృద్ధి పనులు చేపట్టగా అందులో దాదాపు కోటి రూపాయల వ్యయంతో 18 పనులు పూర్తి కాగా,కోటి రూపాయల వ్యయంతో కొనసాగుతున్న రెండు అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయని, మిగిలిన పనులకు వెంటనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ప్రారంభించాలన్నారు.
వర్షాకాలం నేపథ్యంలో ప్రణాళిక బద్ధంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు జరగాలని,మురుగు కాలువలలో పూడికలు తీయడంతోపాటు,చెత్త సేకరణ,ఫాగింగ్,బ్లీచింగ్ పౌడర్ చల్లడం, దోమలు ప్రబలకుండా ఆయిల్ బాల్స్ వేయడం జరగాలన్నారు.డివిజన్లలోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ నీటి ప్రెషర్ వల్ల నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని, ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలన్నారు.స్వచ్ఛమైన మంచి నీటిని అందించుటకు ట్యాంకులు ఎప్పటికపుడు శుభ్రం చేస్తూ వాటి వివరాలు ఆయా ట్యాంకులపై ప్రదర్శించాలన్నారు.గాడిపల్లి లో మంచినీటి పైప్ లైన్ సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బల్దియాకు సంబంధించిన వార్డ్ ఆఫీసర్,పారిశుద్ధ్య, మంచినీటి సరఫరా,విద్యుత్ అధికారుల ఫోన్ నంబర్లు, బల్దియా టోల్ ఫ్రీ నెంబర్లు
మూడు డివిజన్లోని ఈ 11 గ్రామాల కూడలిల గోడలపై ప్రదర్శించాలని,ఏమైనా సమస్య ఉత్పన్నమైతే ఆయా ప్రాంతాల ప్రజలు అధికారులను సంప్రదించి పరిష్కరించుకోవచ్చునని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై ఎమ్మెల్యే సమీక్షిస్తూ 404 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించగా అందులో 296 మంది లబ్ధిదారులకు మంజూరు చేయగా,మిగిలిన 108 ఇళ్లను త్వరితంగా లబ్ధిదారులకు అందజేయాలన్నారు.
ధర్మారంలో మహిళల కొరకు నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటుకు వేగవంతంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం గ్రేటర్ వరంగల్ లోని 66 డివిజన్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇంచార్జ్ ఎస్ ఈ మహేందర్ వివరించారు.ఈ సమావేశంలో అదనపు కమిషనర్ జోనా, ఎం హెచ్ ఓ డాక్టర్ రాజారెడ్డి, ఇంచార్జ్ ఎస్ ఈ, సి పి లు మహేందర్, రవీందర్ రాధాకర్, ఉప కమిషనర్ ప్రసన్న రాణి, ఇంజనీరింగ్, పారిశుద్ధ్య, ఎలక్ట్రికల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.