
Educational institutions
విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయాలి
* పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్.*
హైదారాబాద్/వికారాబాద్,నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని అలాగే ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడిని అరికట్టాలని,రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23 న వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలు, జూనియర్ కళాశాలల బంద్ నిర్వహిస్తున్నట్లు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ప్రకటించారు.ఈ సందర్భంగా పిడిఎస్యు రంగారెడ్డి ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఖానాపురం రాజేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయివేటు, కార్పొరేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకువస్తామని చెప్పి తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందనీ అన్నారు.ఇప్పటికీ రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి దిక్కులేడని తక్షణమే నియమించాలన్నారు. ఖాళీగా ఉన్న టీచర్, ఎంఈవో, డీఈవో పోస్టులను భర్తీ చెయ్యాలనీ డిమాండ్ చేశారు. ఇంటర్ కళాశాలలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలనీ, పెండింగ్ స్కాలర్ షిప్ లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ విద్యాసంస్థలలో మౌలిక సదుపాయాలు కల్పించి,నిధులు కేటాయించాలని కోరారు.బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలు విడుదల చెయ్యాలన్నారు.సంక్షేమ హాస్టల్ తో పాటు గురుకులాలకు సొంతభవనాలు నిర్మాణం చేయాలని అలాగే ప్రతి మండలంలో గురుకులాలు,మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.విద్యార్థులందరికీ ఉచిత బస్ పాసులు ఇవ్వాలని,నూతన జాతీయ విద్యా విధానాన్ని తెలంగాణలో అమలు చెయ్యకుండా అసెంబ్లీలో తీర్మానం చెయ్యాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ 23న వికారాబాద్ జిల్లాలో ఉన్న ప్రైవేటు పాఠశాలల, జూనియర్ కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు స్వచ్ఛందంగా బంద్ లో భాగస్వామ్యం కావాలనీ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పీడీఎస్యు వికారాబాద్ ఇంచార్జ్ కార్యదర్శి బొజ్జి శ్రీకాంత్,ఎస్ఎఫ్ఐ నాయకులు శేఖర్,సంగమేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.