
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసిన శ్రామిక వర్గానికి అభినందనలు
పాలకులు ఇప్పటికైనా శ్రమ దోపిడి విధానాలను మానుకోవాలి
ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్
వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:
వినాశనకర దోపిడీ విధానాలను నిరసిస్తూ చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసిన కార్మిక కర్షక ఉద్యోగులకు అభినందనలు తెలియజేస్తూ ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోపిడీ విధానాలకు చరమగీతం పాడి శ్రామికులకు అనుకూలంగా పాలన కొనసాగించాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు.దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం అయిన సందర్భంగా స్థానిక వరంగల్ పట్టణ ఓంకార్ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పెద్దారపు రమేష్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సహజ సంపదను, ఆర్థిక వ్యవస్థను, మానవ శ్రమను పెట్టుబడుదారులకు కార్పోరేట్ శక్తులకు కట్టబెట్టే విధంగా విధానాల రూపకల్పన చేస్తూ అందుకు అనుకూలంగా చట్టాలను రూపొందించి ఊడిగం చేస్తున్నదని అన్నారు.మరోవైపు నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇలాంటి పరిస్థితుల్లో కార్మిక కర్షక ఐక్య పోరాటాలు రాజకీయాలకతీతంగా ఉధృతం అవుతున్నాయని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని రైతు కార్మిక వ్యతిరేక విధానాలను మానుకొని రైతులు పండించిన పంటకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా మద్దతు ధర చట్టాన్ని రూపొందించాలని తెలిపారు. కార్మికులకు పాత చట్టాలను పునరుద్ధరించి కనీస వేతనం అమలు 26వేల రూపాయలు చేయాలని అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 10 గంటల పని దినం పెంపును ఉపసంహరించుకొని ఎనిమిది గంటల పని విధానాన్ని యధావిధిగా అమలు చేయాలని కోరారు.ఈ సమావేశంలో ఎంసిపిఐ యు జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, నగర కార్యదర్శి సుంచు జగదీశ్వర్,నాయకులు ఎగ్గని మల్లికార్జున్, నలివెల రవి, రాయినేని ఐలయ్య, జటబోయిన నరసయ్య తదితరులు పాల్గొన్నారు.