
సిఐటియులో చేరిన అంగన్వాడీలు.
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట ప్రాజెక్టు పరిధిలోని నల్లబెల్లి మండలంలోని అంగన్వాడి టీచర్లు, ఆయాలు మంగళవారం సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి సమక్షంలో సిఐటియులో చేరారు.ఈ సందర్భంగా కాసు మాధవి మాట్లాడుతూ కార్మికుల మెడపై కత్తిలా వేలాడుతున్న లేబర్ కోడ్ లను రద్దు చేయాలని కార్మిక వర్గం ఉద్యమిస్తున్న తరుణంలో అంగన్వాడీలు సిఐటియులో చేరడం అభినందనీయమని, పోరాడే శక్తిని పెంచుతుందని, ఉద్యమాలకు ఊతమిస్తుందని తెలిపారు.అంగన్వాడీల సమస్యలపై రాజీలేని పోరాటాలు చేసి విజయాలు సాధించింది సిఐటియు మాత్రమేనని ఆమె తెలిపారు. రానున్న కాలంలో మరిన్ని విజయాలు సిఐటియు ఆధ్వర్యంలో సాధించడానికి ఈ చేరికలు మరింత బలాన్ని చేకూరుస్తాయని, ఉద్యమ శక్తిని పెంచుతాయని చేరిన అంగన్వాడీలను అభినందించారు.బుదవారం జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అంగన్వాడీలు భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రాజెక్టు ఆఫీసులో సమ్మె నోటీసు అందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు హన్మకొండ శ్రీధర్ పాల్గొన్నారు సిఐటియులో చేరిన అంగన్వాడి నాయకుల్లో జాటోత్ సుజాత, పిన్నింటి రజిత, ఉదయ, జమున, భాగ్యమ్మ, సుమలత, కల్పన, శీలాభాయి, ఎండి అస్మత్ తదితరులు ఉన్నారు.