
సమర శీల పోరాట యోధుడు లింగంపల్లి బిక్షపతి…
విశ్వ జంపాల,న్యాయవాది, విశ్వ సమాజం వ్యవస్థాపకులు…
నేటి ధాత్రి -మహబూబాబాద్ :-
జీవితాంతం ఎర్ర జెండా పోరులో వెలుగై ప్రకాశించిన సమర శీల పోరాట యోధుడు డాక్టర్ లింగంపల్లి బిక్షపతి.ఆయన పోరాట జీవితం నేటి తరానికి స్ఫూర్తి దాయకం. మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండలం, ఎల్లంపేట గ్రామంలో 1942లో లింగంపల్లి బిక్షపతి జన్మించారు. ఆయన బాల్యంలో నాలుగో తరగతి వరకు చదివినప్పటికీ నాలుగు పదుల వయసులో ఎస్.ఎస్. సి. పరీక్షకు హాజరయ్యారు. రేపిడెక్స్ ఇంగ్లీష్ కోర్స్ ను తనకు తాను స్వయంగా అభ్యసించి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలపై పట్టు సాధించారు.34 సంవత్సరాల వయసు వరకు ఆధ్యాత్మిక భావజాలంలో కొనసాగుతూ పౌరాణిక నాటకాలు, కోలాటాలు, జడ కొప్పులు తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రజలను రంజింపజేశారు.
మంగలి కులంలో పుట్టి క్షౌర వత్తి, ఆయుర్వేద వైద్యం, సంగీతంతో పాటు అభ్యుదయ పద్య గీతాలు రాయడం, పాడడం చేశారు. హార్మోనియం, తబలా, డోలక్ వంటి సంగీత పరికరాలు వాయించడమే కాక ఇతరులకు వాటిని నేర్పించడంలో కూడా దిట్ట. ఎల్లంపేట దొరల, భూస్వాముల దోపిడీ, పెత్తందారి దళారీల, పీడన, ఎట్టి చాకిరి చూసి చలించిపోయి తిరుగుబాటుకు దారులు వెతకడం ప్రారంభించారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఎర్ర జెండాకు ఆకర్షితులై తన 34వ, ఏటా 1976లో సిపిఎం పార్టీలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు.
పుచ్చలపల్లి సుందరయ్య, భీమ్ రెడ్డి నరసింహారెడ్డి, ఓంకార్ మార్గ దర్శకత్వంలో ఎల్లంపేట పరిసర ప్రాంతాలలో కమ్యూనిస్టు (మార్క్సిస్ట్) పార్టీ నిర్మాణానికి పూనుకున్నారు. జి. నాగయ్య, జి రాములు, బివి రాఘవులు, గోవర్ధన్ రెడ్డి, మౌలానా తదితర సహచర మిత్రులతో కలసి పనిచేస్తూ ఉద్యమ వ్యాప్తికి కృషి చేశారు. ప్రస్తుతం ఆయన తయారుచేసిన కార్యకర్త మహబూబాబాద్ జిల్లా సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులుగా అల్వాల వీరయ్య ఉన్నారు. భూస్వాముల, దొరల గడీలకు వ్యతిరేకంగా 50 మంది సభ్యులతో గుత్పల సంఘాన్ని ఏర్పాటు చేసి తిరుగుబాటు జెండా ఎగుర వేశారు. ఎట్టి చాకిరికి వ్యతిరేకంగా అనేక రకాల ప్రజా పోరాటాలు నిర్వహించారు.
“భూస్వామి వీధి బాగోతం”, “పంజరంలో చిలుక” “మాయ” వంటి తదితర నాటకాలకు తన దర్శకత్వంలో శిష్యుల ద్వారా ప్రదర్శనలను ఇస్తూ ప్రజలను చైతన్యం చేశారు. వివిధ సభలలో లెనిన్ వేషధారణ ప్రదర్శిస్తూ ప్రజలను ఉద్యమం వైపు ఆకర్షించారు. అనేక కూలి పోరాటాలు నిర్వహించారు . వ్యూహాత్మకంగా తన పోరాటానికి పదును పెడుతూ దొరల భూస్వాములను హడల్ ఎత్తించారు. ఈ పోరాటంలో ఎన్ని అవాంతరాలు కల్పించిన బిక్షపతి తన పోరాటాన్ని ఆపలేదు. డాక్టర్ బిక్షపతి పై ఆయన అనుచరులపై మొత్తం 21 కేసులు నమోదు కాగా, వరంగల్ సెంట్రల్ జైల్లో మూడు దఫాలుగా జైలు జీవితం గడిపారు.
ఒక సంవత్సరం పాటు అజ్ఞాతంలో ఉంటూ తన పోరాటాన్ని కొనసాగించారు. చదువుల ద్వారానే సామాజిక మార్పు సిద్ధిస్తుందని భావించి ఎల్లంపేటలో నేతాజీ ప్రజా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి కార్యదర్శిగా కొనసాగారు. తన పోరాటాలు విజయవంతంగా ముందుకు నడపడం కోసం రాత్రి బడి నిర్వహిస్తూ తోటి కామ్రేడ్ కుటుంబాలకు విద్యాతో పాటు పాటలు నేర్పించారు. ఎల్లంపేట హై స్కూల్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. మద్యపానం, ధూమపానం వంటి సాంఘిక దురాచారాలను మాన్పించుటకు ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు.
ఆయుర్వేద వైద్య వృత్తితో అనేక మంది ప్రాణాలను కాపాడుతూ మంచి డాక్టర్ గా కీర్తి గడించారు. తను జన్మించిన మంగళి సామాజిక వర్గ కుటుంబాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన నోపా గౌరవ సలహాదారులుగా పనిచేశారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక మార్పు కోసం నిరంతరం పనిచేస్తూ, పరితపిస్తూ వృద్ధాప్యంతో తన 82వ ఏటా 29.06.2025న మరణించారు. 1976లో ఎత్తిన ఎర్రజెండాను మరణించెంత వరకు దించలేదు. సమాజ మార్పు కోసం నిరంతరం పోరాటాలు చేస్తూనే తన కొడుకు లింగంపల్లి దయానంద్ ను ఉన్నత చదువులు చదివించి ప్రజాతంత్ర ఉద్యమాల వైపుగా నడిపించారు. లింగంపల్లి దయానంద్ జన విజ్ఞాన వేదిక రాష్ట్ర సాంస్కృతిక విభాగం కన్వీనర్ గా ఉన్నారు.
పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది అన్న కాలోజీ మాటలను నిజం చేస్తూ వైద్య వృత్తిపై గల మక్కువతో వైద్య విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెంది మానవాళికి ఉపయోగపడాలన్న కాంక్షతో తన భౌతికకాయాన్ని మహబూబాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి డొనేట్ చేయాలని తనకు తాను తీర్మానించుకున్నారు. ఆయన కోరిక మేరకు ఆయన పార్థివ దేహాన్ని మహబూబాబాద్ మెడికల్ కాలేజీ వారు స్వాధీనం చేసుకొని వైద్య విద్యార్థుల పరిశోధన పరీక్షల నిమిత్తం భద్రపరిచారు.
బిక్షపతికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. భర్త చేస్తున్న ప్రజా పోరాటాలకు చేయుతనిస్తూ సహ దర్మచారినిగా బిక్షపతి భార్య కమలమ్మ ప్రజల మన్ననలను అందుకుంటున్నారు. మనువాదం నుండి మానవతా వాదానికి, భౌతిక వాదమైన కమ్యూనిజం వైపు తను మారడమే గాక తన తోటి సమాజాన్ని మార్చడం కోసం జీవితాంతం ఆచరణాత్మక పోరాటాన్ని కొనసాగించిన సమరశీల పోరాట యోధుడు కామ్రేడ్ డాక్టర్ లింగంపల్లి బిక్షపతి పోరాట స్ఫూర్తిని ఆయన ఆశయాలను కొనసాగించడమే ఆయనకు మనం అర్పించే ఘన నివాళి.
09.07.2025న ఎల్లంపేట గ్రామంలో కామ్రేడ్ డాక్టర్ లింగంపల్లి బిక్షపతి సంస్మరణ సభ సందర్భంగా డాక్టర్ లింగంపల్లి బిక్షపతి యాదిలో.