
బాల్యం పై పుస్తకాల భారం…?
పెరుగుతున్న బడి పుస్తకాల బరువు…
కిలోల కొద్ది బరువును విద్యార్థుల వీపునకు తగిలిస్తున్న వైనం…
పుస్తకాల అధిక బరువు పిల్లల పాలిట శాపంగా మారనుందా?..
బరువుకు మించిన బడి సంచి…
విద్యార్థులకు తప్పని తిప్పలు…
అమలు కానీ నో బ్యాగ్ డే…
పుస్తకాల సంఖ్య తగ్గించాలి అవసరమైన పుస్తకాలను మాత్రమే అందించాలి…
నేటి ధాత్రి
-మహబూబాబాద్ -గార్ల :- ప్రైవేటు,కార్పోరేట్ విద్యాసంస్థల్లో ఒత్తిడితో కూడిన విద్య బోధనతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు.నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన తరుణంలో విద్యార్థులపై మళ్లీ బ్యాగు భారం మొదలైంది.అడుతూ, పాడుతూ చదువుకోవాల్సిన వయసులో పుస్త కాల భారం విద్యార్థులకు శాపంగా మారుతోంది.ఏటా పై తరగతికి వెళ్తుంటే, పుస్తకాల సంఖ్య కూడా పెరుగుతోంది.
ప్రైవేటు స్కూళ్లలో పిల్లలు,బ్యాగు నిండా పుస్తకాలతో నాలు గైదు అంతస్తుల మెట్టు ఎక్కేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఫలితంగా పట్టుమని 15 ఏళ్లు నిండక ముందే చాలా మంది నడుము, మెడ నొప్పి, కండరాల సమస్యల తో సతమతమవుతు న్నారు.విద్యార్థులకు గుణాత్మక నైపుణ్యత విద్యను అందించాలని విద్య హక్కు చట్టం చెబుతున్న ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యం పట్టించుకున్న పాపాన పోలేదు.పుస్తకాల భారం తగ్గించాలని,2006లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చిన ప్పటికీ,వాటిని అమలు చేయడం లేదు,దీంతో విద్యార్థులు అవస్థలు పడుతూనే ఉన్నారు.
మరోవైపు పిల్లలపై పుస్తకాల భారం వలన వారి శారీరక, మానసిక ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం పడుతుంది.పాఠశాల బ్యాగుల బరువు, తరగతి గదిలో అవసరమయ్యే పుస్తకాల సంఖ్య, ఇంటి వద్ద చదవాల్సిన హోంవర్క్ పుస్తకాల పరిమాణం అన్నీ కలిపి పిల్లలపై అధిక భారాన్ని పెంచుతున్నాయి.బరువైన పుస్తకాలు మోయడం వలన వెన్నునొప్పి,కండరాల నొప్పులు, భుజాల నొప్పి వంటి శారీరక సమస్యలు వస్తాయి. పుస్తకాల భారం పిల్లలపై ఒత్తిడిని పెంచుతుంది.ఇది వారి మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
చదువుపై ఏకాగ్రత తగ్గడం, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి.అవసరం ఉన్న లేకున్నా వేలాది రూపాయలు వెచ్చించి కిలోల కొద్ది బరువులను విద్యార్థుల వీపునకు తగిలిస్తున్నారు. పోటీ చదువుల పేరిట అటు తల్లిదండ్రులు,ఇటు పాఠశాల యాజమాన్యాలు పిల్లలపై పుస్తకాల భారం మోపుతున్నారు.ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల నిర్వహకులు ఇష్టమొచ్చినట్లు పుస్తకాలు అంటగడుతున్నారు.
దీంతో పుస్తకాల అధిక బరువు పిల్లల పాలిట శాపంగా మారనుంది. పాఠశాలలు పుస్తకాల సంఖ్య తగ్గించాలి అవసరమైన పుస్తకాలను మాత్రమే అందించాలి అనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.విద్యార్థులకు పుస్తకాల బరువు తగ్గించేలా ఆయా పాఠశాలల్లో ర్యాక్స్ ఏర్పాటు చేసి పాఠ్యపుస్తకాలు అన్ని పాఠశాలల్లోనే ఉంచుతూ,హోంవర్క్ పుస్తకాలు మాత్రమే ఇంటికి తీసుకెళ్లేలా చర్యలు చేపట్టాలని విద్యావంతులు, మేధావులు,ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు. పిల్లలకు పుస్తకాలతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగించేలా విద్యాబోధన ఉండాలని ఈ విషయంలో పాఠశాలల యాజమాన్యాలు అధికారులు చొరవ చూపాలని కోరుతున్నారు.