
జూలై 9 కార్మిక సమ్మేలో బిఎంఎస్ పాల్గొనదు
నస్పూర్,నేటి ధాత్రి:
శ్రీరాంపూర్ ఏరియాలోని నస్పూర్ కార్యాలయం నందు సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (బి ఎం ఎస్) ఆధ్వర్యంలో నాతాడి శ్రీధర్ రెడ్డి ఏరియా ఉపాధ్యక్షులు అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం రోజున జరిగినది.ఈ సందర్భంగా మాట్లాడుతూ..జూలై 9న కొన్ని కార్మిక సంఘాలు రాజకీయ ఉద్దేశాలతో పిలిచిన దేశవ్యాప్త సమ్మెలో భారతీయ మజ్దూర్ సంఘ్ (బిఎంఎస్) పాల్గొనదని స్పష్టం చేశారు.దేశంలో అమలులో ఉన్న 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం నాలుగు కొత్త కార్మిక కోడ్లుగా రూపుదిద్దిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.వాటిలో వేతనాల కోడ్ 2019 మరియు సామాజిక భద్రత కోడ్ 2020లను బిఎంఎస్ స్వాగతించిందని పేర్కొన్నారు.ఈ కోడ్ల ద్వారా అన్ని రంగాల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతన హక్కు,గిగ్ మరియు ప్లాట్ఫామ్ కార్మికులకు సామాజిక భద్రత వంటి అనేక ప్రయోజనాలు లభిస్తున్నాయని వివరించారు.ఇతర రెండు కోడ్లైన ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020,ఆక్యుపెన్షియల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020లో కొన్ని సవరణలు అవసరమని పేర్కొన్నారు.ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతున్నప్పటికీ,మరింత లోతుగా చర్చించి వీలైనంత త్వరగా సవరణలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.రాజకీయ ప్రయోజనాల కోణంలో కొన్ని కార్మిక సంఘాలు జూలై 9 సమ్మెకు పిలుపునిస్తున్నప్పటికీ,బిఎంఎస్ మాత్రం కార్మికుల హక్కుల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా రాజకీయాలకతీతంగా వ్యవహరిస్తుందని చెప్పారు.అందుకే కార్మికులు బాధ్యతాయుతంగా వ్యవహరిచి ఆ సమ్మెలో పాల్గొనరాదని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో రాగం రాజేందర్ ఏరియా సెక్రటరీ,ఐలవేణి శ్రీనివాస్ సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ,భూoపల్లి రమేష్ జాయింట్ సెక్రెటరీ,కట్కూరి సతీష్ జాయింట్ సెక్రెటరీ,శాంతం సంపత్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ,గోళ్ళ మహేందర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ,కిరణ్ కుమార్,గోనె రామకృష్ణ ఆర్కే 5 పిట్ సెక్రెటరీ,కుంట రాజు ఆర్కే 7 అసిస్టెంట్ సెక్రటరీ,కొమ్మ బాపు,ఎస్ అండ్ పి సి నాయకులు తదితరులు పాల్గొన్నారు.