
Farmers Cultivate.
ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు…
నేటి ధాత్రి -గార్ల :-
వాణిజ్య పంటలో అధిక లాభాలు వచ్చే ఆయిల్ ఫామ్ పంటలను రైతులు సాగు చేసి అధిక లాభాలు పొందాలని గార్ల వ్యవసాయ అధికారి కావటి రామారావు తెలిపారు.శనివారం మండల పరిధిలోని బుద్దారం గ్రామంలో డోర్నకల్ ఉద్వాన వన అధికారి శాంతి ప్రియ,ఏఈఓ రాజ్యలక్ష్మి లతో కలిసి ఆయిల్ ఫామ్ పంట క్షేత్ర సందర్శన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరి, పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితిలు ఉన్నాయన్నారు.ఆయిల్ ఫామ్ పంట దిగుబడి వచ్చేంతవరకు అంతర పంటల సాగుతో రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు.వరి,పత్తి పంటలతో పోల్చితే రైతులు తక్కువ పెట్టుబడి,తక్కువ శ్రమతో మంచి లాభాలు సాధించే అవకాశం ఉంటుందన్నారు.ఆయిల్ పామ్ మొక్కలను ఒకసారి నాటితే 30 సంవత్సరాల వరకు దిగుబడి ఇస్తాయని, నాలుగవ సంవత్సరం నుంచి రైతుకు పంట చేతికి వస్తుందని అన్నారు.రైతులు ప్రతి ఏటా ఒకే పంట కాకుండా పంట మార్పిడి విధానం అవలంబించుకుంటూ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను,నికర ఆదాయం లభించే పంటలను సాగు చేయడం ద్వారా సుస్థిర ఆదాయం పొందడమే కాకుండా భూసారం కాపాడుకోవచ్చు అన్నారు.ప్రస్తుతం మార్కెట్లో ఆయిల్ ఫామ్ కు మంచి డిమాండ్ తో పాటు రవాణా, మార్కెట్,ప్రాసెసింగ్ సౌకర్యంతో పాటు గిట్టుబాటు ధర ఉందని తెలిపారు.ఆయిల్ ఫామ్ పంటలో అంతర పంటలను నాలుగు సంవత్సరాల వరకు వేరుశనగ, మొక్కజొన్న,కూరగాయలు మరియు నాలుగు సంవత్సరాల తర్వాత పైనాపిల్,కోకో వంటి పంటలను సాగు చేసుకుని అధిక ఆదాయం పొందవచ్చు అని సూచించారు.ఆయిల్ ఫామ్ పంట సాగుకు చీడపీడల బెడద ఉండదని, కోతుల సమస్య రాదని,అకాల వర్షాలు,వడగండ్ల వాన ఇబ్బందులు ఉండవని అన్నారు.ఎకరా మొక్కలకు 11600, అంతర పంటలకు ప్రతి సంవత్సరంకు 4200 చొప్పున నాలుగు సంవత్సరాలకు 16,800, బిందు సేద్యానికి 22518 మొత్తము కలిపి 50 వేల 918 రూపాయలు రాయితీ పొందవచ్చు అని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.