ఎంఈఓ ను వెంటనే సస్పెండ్ చేయాలి .
ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దందాపై స్పందించని ఎంఈఓ
నర్సంపేట,నేటిధాత్రి:
ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దందాపై స్పందించని ఎంఈఓను వెంటనే సస్పెండ్ చేయాలని ఏఐఎఫ్డిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి మార్తా నాగరాజు డిమాండ్ చేశారు.నర్సంపేట పట్టణంలో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి,ఫీజుల దోపిడీ కొనసాగిస్తున్న,అనుమతి లేకుండా పుస్తకాలు అమ్ముతున్న స్థానిక ఎంఈఓ ఏమాత్రం పట్టించుకోవడంలేదని అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రైవేట్ పాఠశాలల ఆర్దిక దోపిడిని అరికట్టాలని కోరుతూ నర్సంపేట ఆర్డీవో కార్యాలయంలో ఏవోకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా మార్త నాగరాజు మాట్లాడుతూ నర్సంపేట పట్టణంలో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తూ,ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న స్థానిక విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.స్థానిక ఎంఈఓకు అనేక మార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదన్నారు.తక్షణమే ప్రవేట్ పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలతో కుమ్మక్కైన నర్సంపేట ఎంఈఓ ను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు.లేని పక్షంలో తమ సంఘం ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కల్లపల్లి రాకేష్ పాల్గొన్నారు.