రెండు ఉప ఎన్నికలు..పార్టీలకు పరీక్షలు!

`రాజాసింగ్‌ రాజీనామా ఆమోదం పొందితే గోషామహల్‌ ఖాళీ.

`రెండు ఉప ఎన్నికలలో కాంగ్రెస్‌ పై చేయి సాధించేనా!

`రెండు గెలిచి కాంగ్రెస్‌ కు తిరుగులేదని నిరూపించేనా!

`ఇప్పటికే కంటోన్మెంట్‌ గెలిచిన బలం కొనసాగేనా!

`రెండు చోట్ల గెలిచి హస్తం హవా చూపేనా!

`ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలుపు బీఆర్‌ఎస్‌ దేనా?

`బీఆర్‌ఎస్‌ పార్టీ చెప్పేది నిజమౌనా!

`కారు గేరు మార్చేనా..పరుగందుకునేనా!

`కమలం తెలంగాణలో ఊపందుకునేనా!

`బీజేపీ రెండు గెలిచి వచ్చే ఎన్నికలకు సై అనేనా!

`తెలంగాణకు మేమే దిక్కని బీజేపీ చాటేనా!

`రాజాసింగ్‌ ఇంత కాలం సొంత బలంతో గెలిచాడా!

`బీజేపీ వల్లనే గెలిచాడా అనేది తేలిపోతుందా!

`కాంగ్రెస్‌ గెలిస్తే ఇక తెలంగాణలో తిరుగుండదు.

`సీఎం. రేవంత్‌ రెడ్డికి ఎదురుండదు.

`కారు పార్టీకి గడ్డు రోజులు తప్పవు.

`బీఆర్‌ఎస్‌ గెలిస్తే కాంగ్రెస్‌లో లుకలుకలు తప్పవు.

`బీజేపీ గెలిస్తే భవిష్యత్తు ఇక కమలానిదే.

`ఈ రెండు ఉప ఎన్నికలలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీదే జిహెచ్‌ఎంసి.

`ఏ పార్టీ గెలుస్తుందో చూడాలి మరి.

`జూబ్లీ హిల్స్‌ లో కాంగ్రెస్‌ గెలిస్తే అధికారం సుస్థిరం.

`రెండు ఉప ఎన్నికలు కాంగ్రెస్‌ గెలిస్తే వచ్చే ఎన్నికలు కూడా కాంగ్రెస్‌ సొంతం.

`బీఆర్‌ఎస్‌ రెండు గెలిస్తే సానుభూతి అనే వాదన వుండదు.


`బీజేపీ గెలిస్తే తెలంగాణలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ లకు చోటుండదు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
రాష్ట్ర రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. అనూహ్యంగా గోషామహల్‌ బిజేపి ఎమ్మెల్యే తన పదవికి, పార్టీకి రాజీనామ చేశారు. ఇంకా స్పీకర్‌ ఆమోదించలేదు. కాని రాజాసింగ్‌ వ్యవహారం చూస్తుంటే ఖచ్చితంగా దూరం జరిగినట్లే అనిపిస్తోంది. పైగా బిజేపి కూడా రాజాసింగ్‌ తలనొప్పిని తట్టుకోలేకపోతోందని అంటున్నారు. గత ఐదారేళ్లుగా రాజాసింగ్‌ ఎంతో అసంతృప్తిగా వున్నారు. పార్టీ తనకు సముచితమైన స్ధానం కల్పించడం లేదన్న ఆందోళన అనేక సార్లు వ్యక్తం చేశారు. 2018 ఎన్నికల్లో బిజేపి నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. కాని అనూహ్యంగా ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో రఘునందన్‌రావు, ఈటెల రాజేందర్‌ గెలుపుతో బిజేపి మూడు సీట్లకు చేరుకున్నది. అయినా రాజాసింగ్‌కు బిజేపి పక్షనాయకుడిగా గుర్తించలేదు. అంతే కాకుండా రాజాసింగ్‌ దూడుకు, సొంత పార్టీ నేతలపై ఏడుపులతో ఆయనను కొంత కాలం పార్టీ పక్కన పెట్టింది. ఒక దశలో సస్పెండ్‌ కూడ చేసింది. అయినా ఎన్నికల సమయంలో ఆయన సస్పెన్షన్‌ ఎత్తి వేసింది. మళ్లీ బిజేపి టికెట్‌ ఇచ్చింది. ఆ ఎన్నికల్లోనూ రాజాసింగ్‌ గెలిచారు. ఈసారి ఎన్నికల్లో బిజేపి నుంచి 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అయినా ఈసారి కూడా రాజాసింగ్‌కు బిజేపి పక్ష నాయకుడి పదవి ఇవ్వలేదు. దాంతో ఆయన అసంతృప్తి తారా స్ధాయికి చేరుకున్నది. పార్లమెంటు ఎన్నికల్లో హైదరాబాద్‌ టికెట్‌ మాధవిలతకు ఇస్తే, పోటీ చేసేందుకు మగాడే దొరకలేదా? అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. ఇక అప్పటి నుంచి రాజాసింగ్‌ పార్టీకి దూరం కావాలనే చూస్తున్నాడు. పార్టీ కూడా రాజాసింగ్‌ను దూరం పెట్టడమే మేలనుకుంటూ వచ్చింది. రాష్ట్ర అద్యక్ష పదవి తనకు ఇవ్వాలని రాజాసింగ్‌ బలంగా కోరుకున్నాడు. కాని ఆయనకు ఇచ్చేందుకు బిజేపి ససేమిరా అన్నది. దాంతో రాజాసింగ్‌ పార్టీకి, ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే రాజాసింగ్‌ ఇలాంటి బెదిరింపులు సహజమే అని కూడా అంటున్నారు. కాకపోతే రాజాసింగ్‌ తన దారి తాను ఇక ఎంచుకున్నట్లే..శివసేన నుంచి పోటీ చేస్తానని కూడా చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక హైదరాబాద్‌లో రెండు ఉప ఎన్నికలు ఖాయంగానే కనిపిస్తున్నాయి. ఇటీవలే జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాద్‌ మరణించారు. త్వరలో జరగనున్న బిహార్‌ ఎన్నికలతోపాటు ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం లేకపోలేదు. ఇప్పుడు మూడు ప్రధాన పార్టీ పరిస్తితి ఏమిటన్నది జోరుగా చర్చ జరుగుతోంది. ఈ రెండు ఉప ఎన్నికలు ప్రతిపక్షాల కన్నా, పాలక పక్షం కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మాకం. ఈ రెండు సీట్లు కాంగ్రెస్‌ గెలుచుకుంటే మాత్రం ఆపార్టీని ఆపడం ఇక ఎవరి తరం కాదు. అందుకే ఎలాగైనా రెండు సీట్లు సాదించాలన్న వ్యూహాలకు కాంగ్రెస్‌ పదును పెడుతుందనిచెప్పడంలో సందేహం లేదు. కాంగ్రెస్‌ పార్టీ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఆ పార్టీలో ఏ నాయకుడైనా,ఏదైనా మాట్లాడినా చెల్లుతుంది. తర్వాత చిన్న సారీ చెబితే సరిపోతుంది. ఇదే కాంగ్రెస్‌కు వరం. ఇదే కాంగ్రెస్‌కు శాపం. అందుకే కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని వదులకోవడం లేదు. జూబ్లీ హిల్స్‌ మరణించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్‌ బిఆర్‌ఎస్‌ నాయకుడు. ఆ సీటు బిఆర్‌ఎస్‌ది. గతంలో ఒక బిఆర్‌ఎస్‌ సీటు కాంగ్రెస్‌ వశం చేసుకున్నది. కంటోన్‌ మెంటుకు జరిగిన ఉప ఎన్నికలో బిఆర్‌ఎస్‌ సీటును కాంగ్రెస్‌ గెల్చుకొని తన మెజార్టీకి మరో సీటును జత చేసుకున్నది. ఇప్పుడు జరిగే రెండు ఉప ఎన్నికలను గెల్చుకుంటే స్వతహాగానే కాంగ్రెస్‌కు మరింత బలం పెరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎదరులేకుండా పోతుంది. ఆయన నాయకత్వానికి తిరుగులేకుండా పోతుంది. అధిష్టానం వద్ద రేవంత్‌ రెడ్డి పలుకుబడి కొండంత పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే సిఎం. రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోఓ ఉప ఎన్నిక గెలిపించి చూపించారు. ఇప్పుడు రెండు ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే ఇక కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎదురుండదు. హైదరాబాద్‌ విషయంలో హైడ్రా, మూసీ సుందరీకరణ ప్రభావం వుంటుందని అంటున్నారు. ఆ రెండు సీట్లు గెలిస్తే మాత్రం ప్రజల నాడి వచ్చే సార్వత్రిక ఎన్నికల దాకా తెలిసిపోతుంది. పైగా వచ్చే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తుంది. గత రెండు ధపాలుగా జిహెచ్‌ఎంసికి దూరమైన కాంగ్రెస్‌ మరోసారి తన పాలన అక్కడ కూడా మొదలు పెట్టే అవకాశం ఏర్పడుంది. హైదరాబాద్‌లో బిఆర్‌ఎస్‌ ఖాళీ అయ్యేందుకు కూడా మార్గం పడుతుంది. ఈ రెండు సీట్లు కాంగ్రెస్‌ గెల్చుకుంటే ఇప్పటికే మారిన పది మంది ఎమ్యెల్యేలతోపాటు, మరో పది మంది ఎమ్మెల్యేలైనా కాంగ్రెస్‌ గూటికి చేరే అవకాశం లేకపోలేదు. బిఆర్‌ఎస్‌ అస్దిత్వం ప్రశ్నార్థకంలో పడక తప్పదు. ఎందుకంటే గత ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు ఆయువు పోసిందే హైదరాబాద్‌. పల్లెల్లో ఎలాగూ కారుకు గత ఎన్నికల్లో స్ధానం లేకుండా పోయింది. పార్లమెంటు ఎన్నికల్లో పల్లెల్లో గులాబీ తుడిచిపెట్టుకుపోయింది అందువల్ల ఈ ఉప ఎన్నికలు పంచాయితీ ఎన్నికలకు ముందు జరిగితే రెండు రకాలుగా కాంగ్రెస్‌ లాభం పొందే అవకాశం కూడా వుంది. హైదరాబాద్‌ గెలుపు పల్లెల్లో కూడా ప్రభావం చూపుతుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వం మరింత బలపడేందుకు ఛాన్స్‌ వుంది. ఒక వేళ ఈ రెండు సీట్లు బిఆర్‌ఎస్‌ గెలిస్తే మాత్రం కాంగ్రెస్‌కు గడ్డు రోజులు వచ్చినట్లే అనుకోవచ్చు. నిన్నటి వరకు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక గురించే అందరూ మాట్లాడుకున్నారు. ఆ స్ధానంలో కాంగ్రెస్‌ గెలిస్తే ఆ పార్టీకి కొంత బలం పెరిగేది. కాని బిఆర్‌ఎస్‌ గెలిస్తే సానుభూతి పనిచేసిందని అనేందుకు కూడ కాంగ్రెస్‌కు అవకాశం వుండేది. ఒక వేళ ఇప్పుడు రెండు ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌ రెండు చోట్ల ఓడిపోతే మాత్రం తీరని నష్టాన్ని చవి చూసే పరిస్ధితి రావొచ్చు. కారు గెలిస్తే ఆ పార్టీని ఆపే వారు ఇక వుండరు. పైగా జూబ్లిహిల్స్‌ అనేది సానుభూతితో గెల్చుకున్నారన్న మాట మాట్లాడేందుకు కూడాకాంగ్రెస్‌కు అవకాశం వుండదు. కారు పార్టీ ఈ రెండు ఉప ఎన్నికలు గెల్చితే పల్లె పోరు కారు వైపు తిరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జిహెచ్‌ఎంసి కూడా మళ్లీగులాబీ కైవసం చేసుకుంటుందన ఊహించొచ్చు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కారుదే జోరు అంటూ నిత్యం బిఆర్‌ఎస్‌ నాయకులు అంటున్నారు. పంచాయితీ ఎన్నికలు పెట్టే ధైర్యం కాంగ్రెస్‌కు లేదంటున్నారు. ఈ రెండు ఉప ఎన్నికలు గులాబీ పార్టీ గెలిస్తే రాజీనామా చేసిన పది మంది ఎమ్మెల్యేలపై ప్రజల నుంచి కూడా ఒత్తిడి రాకతప్పదు. వారు కూడా రాజీనామా చేయక తప్పదు. ప్రజా క్షేత్రంలో గులాబీ శ్రేణులు వారిని తిరగనివ్వరు. దాంతో పది ఉప ఎన్నికలు రాకతప్పదు. ఇక ఈ రెండు పార్టీలను కాదని హైదరాబాద్‌ ప్రజలు బిజేపి వైపు చూస్తే భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌లకు నూకలు చెల్లినట్లే. ఎందుకంటే ఒక్కసారి బిజేపి పాగా వేసిందంటే చాలు ఆ రాష్ట్రాలల ఓటమిని చవి చూడడం లేదు. గుజరాత్‌లో ఇప్పటికీ వరసగా ఏడు సార్లు గెలిచి రికార్డు సృష్టించింది. ఇక హాట్రిక్‌ విజయాలు అనేక రాష్ట్రాలలో చవి చూస్తోంది. ఆయా రాష్ట్రాలలో బిజేపిని ఓడిరచడం ఏ పార్టీ వల్ల కావడం లేదు. ఆప్‌లాంటి పార్టీ కూడా డిల్లీలో ఓడిపోయింది. భవిష్యత్తులో బిజేపి తెలంగాణలో పాగా వేస్తే మరో రెండు మూడు దఫాలు ఇతర పార్టీలు లేవడం కష్టమ అవుతుంది. వచ్చే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో బిజేపి జెండా ఎగురవేస్తుందని చెప్పడంలో సందేహం అవసరమే లేదు. అంతే కాకుండా ఈ రెండు గెలిస్తే, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కూడా వేటు వేయాలని బిజేపి డిమాండ్‌ చేస్తుంది. ఆ కార్యాచరణ ఊపందుకుంటుంది. ఇతర పార్టీల నుంచి బిజేపిలోకి వలసలు కూడా మొదలౌతాయి. పంచాయితీ ఎన్నికల్లో కూడా బిజేపి మెరుగైన స్ధానాలు గెల్చుకుంటుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తీర్పు వస్తే, ఉప ఎన్నికలు మళ్లీ వస్తే ఆ స్ధానాలు బిజేపి వశం కాకతప్పదు. పైగా ఇంత కాలం గోషామహల్‌ నుంచి రాజాసింగ్‌ వ్యక్తిగత బలంతో గెలుస్తున్నాడా? లేక బిజేపి బలంతో గెలుస్తున్నాడా కూడా తేలిపోతుంది. ఒక వేళ ఈ ఉప ఎన్నికలో కూడా రాజాసింగే గెలిస్తే మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో రాజాసింగ్‌ హీరో కావడం కూడా స్పష్టం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!