‘భూ భారతితో భూ సమస్యలకు పరిష్కారం’.
ధరణి వల్ల రెవెన్యూ శాఖలో చిక్కులు
పేద ప్రజల భూ సమస్యల పరిష్కారానికి నాంది.
జడ్చర్ల /నేటి ధాత్రి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న భూభారతి పోర్టల్ ద్వారా రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం జడ్చర్ల కేంద్రంలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజాపాలనలో ప్రజల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయనే దానికి భూభారతి ముఖ్య ఉదాహరణ అని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ పరిపాలనలో ధరణి పోర్టల్ ద్వారా రెవెన్యూ శాఖలో అనేక చిక్కులు ఏర్పడ్డాయని విమర్శించారు. అధికారులు భూ సమస్యలను పరిష్కరించడంలో ధరణి పోర్టల్ ద్వారా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భాలు ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి పోర్టల్ తీసుకొచ్చి రెవెన్యూ శాఖకు ప్రజలకు మధ్య సంబంధాలు లేకుండా చేశారని తెలిపారు.

ప్రతిరోజు హైదరాబాద్ లోని నా.. నివాసానికి ఎంతోమంది భూ సమస్యలపై వస్తుంటారని అనిరుధ్ రెడ్డి గుర్తు చేశారు. ప్రజలు ఇచ్చిన భూ ఫిర్యాదులన్నిటిని ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ కు పంపించి వాటిని పరిశీలన చేయాలని కోరానని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులుగా ఉన్న మా యొక్క భూ సమస్యలే పరిష్కారం కావడం లేదనీ.. పేద ప్రజల భూ సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని వివరించారు. నేను కూడా భూభారతిలో నా యొక్క భూ సమస్యలపై దరఖాస్తు చేసుకుంటానని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వెల్లడించారు. భూ భారతిపై నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి అధికారులతో కలిసి వెళ్లి అవగాహన సదస్సులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.