
Driving
రయ్…. రయ్ మంటూ కుర్రకారు జోష్ డ్రైవింగ్..
వేసవి సెలవుల్లో కుర్రకారుపై పోలీసులు నిఘా పెట్టాలి…
యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితం కోల్పోతున్నారు…..
రాత్రి వేళల్లో పెట్రోలింగ్ నిర్వహించే సిబ్బందితో నిఘా పెంచాలి…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
వేసవి సెలవులు రాగానే పిల్లల్లో ఎక్కడా లేని సంతోషం కనిపిస్తుంది. రయ్ … రయ్ మంటూ కుర్రకారు ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వాహనాలు నడుపుతుంటారు. ట్రిపుల్ రైడింగ్ చేస్తుంటారు. ఈ సమయంలో కాలక్షేపం కోసం చేసే పనులు ఊహించని ప్రమాదాలకు దారితీస్తుంటాయి. ఒక్కోసారి అవి కన్నవారికి కడుపుకోత మిగులుస్తాయి. బడిలో అయితే నిత్యం ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఉంటారు.

చదువుకోవలసి ఉండడంతో విరామం దొరకదు. వేసవి సెలవుల్లో అధిక సమయం ఖాళీగా ఉండే నేపథ్యంలో రాత్రి,పగలు రోడ్లపైకి వెళ్లి బైక్ లపై ముగ్గురేసి పిల్లలు, యువకులు ఎక్కి హై స్పీడ్ లో వెళ్తూ, సడన్ గా బ్రేకులు వేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పోలీసులు నిఘా పెంచాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. మధ్యాహ్నం వేళ పోలీసుల నిఘా ఉంటున్నప్పటికీ, రాత్రి వేళల్లో కూడా పెట్రోలింగ్ నిర్వహించే పోలీస్ సిబ్బందితో నిఘా పెట్టాలని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.

ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటే వారిలో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.ర్యాష్ డ్రైవింగ్,ఎక్కువ శబ్దాలు వచ్చే వాహనాల పై పోలీసులు నిఘా పెట్టాలని కోరుతున్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియం, రైల్వే స్టేషన్, కాకతీయ కాలనీ, ఆర్కే ఫోర్ గడ్డ, ఆదివారం సంత సమీపంలోని సింగరేణి క్వార్టర్స్, నాగార్జున కాలనీ, సింగరేణి సిహెచ్పి, ఏ జోన్ ఏరియాలలో యువకులు సిగరెట్లు సేవిస్తూ, మత్తు పదార్థాలకు అలవాటు పడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆరోపణలు సైతం ప్రజల నుండి వినిపిస్తున్నాయి. సింగరేణి ప్రాంతం కావడంతో పిల్లల తండ్రులు సింగరేణి ఉద్యోగానికి వెళ్తుంటారు.

ఈ సందర్భంలో వేసవి సెలవులు కావడంతో కుర్రకారు స్నేహితులు తో కలిసి కాలక్షేపానికి అలవాటుపడి మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని, పోలీసులు నిఘా పెంచి యువకులను క్రమశిక్షణలో పెట్టేలా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
పిల్లలు వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటాం..
ఆర్కెపి ఎస్సై జి రాజశేఖర్
వేసవి సెలవులు ఉన్నాయని తల్లిదండ్రులు మైనర్లకు సరదా కోసం బైకులు ఇస్తే చర్యలు తీసుకుంటాం.పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తాం. హెల్మెట్, లైసెన్స్ లేకుంటే కేసులు నమోదు చేస్తాం.ర్యాష్ డ్రైవింగ్ చేస్తే బండిని సీజ్ చేసి కేసు నమోదు చేస్తాం.రాత్రి వేళల్లో పెట్రోలింగ్ సిబ్బందితో నిఘా పెంచుతాం. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తాం.