బడ్జెట్ సమావేశాల్లోనే ఆశాలకు 18వేల కనీస వేతనం నిర్ణయించాలి
కాంగ్రెస్ ఆశాలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానం అమలు చేయాలి
లేదంటే ఆశాల పోరాటం ఉదృతం చేస్తాం
సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణ
నల్లగొండ జిల్లా, నేటిధాత్రి:
ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ 18,000/ లు ఫిక్సిడ్ వేతనం నిర్ణయించాలని పీఫ్, ఈ ఎస్ ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని లేదంటే ఆశాలు సమరశీల ఉద్యమాలకు సిద్ధమవుతారని సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం కోసం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ మేరకు నల్గొండ కలెక్టరేట్ ముందు భారీ ధర్నా నిర్వహించారు. గేటు ముందు బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ జె శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి చినపాక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎన్నికల ముందు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం ఆశాల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని,ఆశాల వేతనాలు పెంచడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని కనీస వేతనం 18 వేలు పెంచుతామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. కానీ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్న ఆశాల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు.ఆశాల సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు ప్రభుత్వానికి అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన కనీసం చలనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్ హెచ్ ఎం స్కీం లో భాగంగా గత 19 సంవత్సరాల నుండి రాష్ట్రంలో ఆశ వర్కర్లు పనిచేస్తున్నారు, వీరంతా బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళలు, రాత్రనకా పగలనకా ఉదయం నుండి రాత్రి వరకు నిరంతరం ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తూ డెలివరీల సందర్భంగా రోజుల తరబడి కుటుంబాన్ని వదిలి హాస్పిటల్ వద్ద ఉండాల్సి వస్తుందని అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని ఆశాలు పోరాడుతుంటే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న హక్కులను కాలరాస్తుందని అన్నారు.45వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫారసులు ప్రకారం 26 వేల కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం మాట్లాడుతూ కరోనాకాలంలో ఆశాల శ్రమను గుర్తించిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆశా వర్కర్లు గ్లోబల్ లీడర్స్ అని ఆశాలకు అవార్డును ప్రకటించింది.కానీ మన కేంద్ర ప్రభుత్వం నేటికీ ఆశల శ్రమను గుర్తించడానికి సిద్ధపడట్లేదు పైగా ఎన్ హెచ్ ఎం స్కీంకు బడ్జెట్ ను తగ్గిస్తుంది, కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి సంఘం పెట్టుకునే హక్కు సమ్మె చేసే హక్కు లేకుండా చేసి కార్మిక హక్కులను కాల రాస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఆశ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 21న పి హెచ్ సి ల ముందు ధర్నాలు, 24న చలో హైదరాబాద్ కు ఆశాలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆశ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి మహేశ్వరి,టీ వెంకటమ్మ,సిఐటియు జిల్లా నాయకులు పెంజర్ల సైదులు, పోలే సత్యనారాయణ, బైరం దయానంద్,అవుట రవీందర్ అశా యూనియన్ నాయకులు రమావత్ కవిత, కె శైలు, విమల పుష్పలత, ఎస్ జయమ్మ, స్వర్ణ, పార్వతమ్మ, ప్రేమలత, బి అనూష, ధనలక్ష్మి, కె సునీత, వీరభద్రమ్మ, మంగతాయి తదితరులు పాల్గొన్నారు