ఆశలు బారెడు.. ఆచరణ మూరెడులా రాష్ట్ర బడ్జెట్
గత బడ్జెట్ పై శ్వేత పత్రం ప్రకటించాలి
ఎన్నికల హామీలు అమలయ్యే విధంగా బడ్జెట్ సవరించాలి
వ్యవసాయరంగానికి 10 శాతం కేటాయించకపోవడం శోచనీయం
ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్
నర్సంపేట నేటిధాత్రి:
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మూడు లక్షల నాలుగువేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయలు బడ్జెట్ ఆశలు బారెడు.. ఆచరణ మూరెడులా ఉందని ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ ఎద్దేవా చేశారు.బడ్జెట్ అంకెల్లో గొప్పగా కనిపిస్తున్నప్పటికీ ఆచరణలో కేటాయింపులను చూస్తే ఎన్నికల హామీలు అమలయ్యే విధంగా లేవని, గత బడ్జెట్ కేటాయింపులపై ఖర్చులపై ప్రభుత్వానికి ఎంత మాత్రం చిత్తశుద్ధి ఉన్న తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలని రమేష్ డిమాండ్ చేశారు.
బుదవారం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పై పెద్దారపు రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఎన్నో ఆశాజనకమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజల ఆశలను అడియాశలు చేసిందని ఈ క్రమంలో ఈ బడ్జెట్ లోనైనా హామీలన్నీ అమలయ్యే విధంగా కేటాయింపులు ఉంటాయని ఆశిస్తే ప్రజలకు శఠగోపం పెట్టారని ఆరోపించారు.ఆరు గ్యారెంటీలను అరకొర అమలుచేసి ప్రచారా ఆర్భాటం చేస్తున్నారని అలాగే 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామని అసెంబ్లీలో తీర్మానం చేసి బడ్జెట్లో మాత్రం అందుకు అనుగుణంగా కేటాయింపులు లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించే వ్యవసాయ రంగానికి కేవలం 24,439 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారని వాస్తవ సాగుదారులకు నేటికీ 2 లక్షల రుణమాఫీ పూర్తిగా అమలు కాదని, రైతు భరోసా రైతుల ఎకౌంట్లో పడలేదని అన్నారు.ధాన్యానికి క్వింటాకు 500 బోనస్ రైతులందరికీ వర్తింపజేయకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు ఎలాంటి పరిహారాన్ని నిధులు కేటాయించకపోవడం అన్యాయం అని పేర్కొన్నారు.ఇప్పటికైనా గత బడ్జెట్ ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేసి ఎన్నికలు వచ్చిన హామీలన్నీ అమలయ్యే విధంగా బడ్జెట్ సవరణలు చేయాలని డిమాండ్ చేశారు లేకపోతే ప్రజల నుంచి ప్రతిఘటన తప్పదని ఈ సందర్భంగా రమేష్ హెచ్చరించారు.