కులబలం కాదు నాయకుడి సమర్థత ముఖ్యం
నియంత్రించే నాయకుడు లేకపోతే జనబలం నిరర్ధకం
జనమనే అస్త్రాన్ని ప్రయోగించే సామర్థ్యం నాయకుడికి అవసరం
జనసంఖ్య అధికమే…నాయకుడు మాత్రం ఒక్కడే
బిహార్ రాజకీయాలు చెబుతున్న పాఠం
ఛరిష్మా నాయకుడు లేకపోతే ఏ పార్టీ మనుగడ అయినా కష్టమే
బిహార్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలన పరిశీలిస్తే, దేశంలో కులగణన జరిపిన రాష్ట్రం గా పేరుతెచ్చుకున్నా, కులాల లెక్కలు రాజకీయాలో పెద్దగా పనిచేయడంలేదన్న సంగతి ఇప్పుడి ప్పుడే వెల్లడవుతోంది. ముఖ్యంగా కుల జనాభా కాదు, ప్రాంతాన్ని నియంత్రించే నాయకుడి అవసరాన్ని బిహార్ రాజకీయాలు నొక్కి చెబుతున్నాయి. నాయకత్వ సామర్థ్యం లేనప్పుడు కుల బలంఎందుకూ పనికిరాదన్న సత్యం స్పష్టమవుతోంది. కుల రాజకీయాలకు పెట్టనికోటగా పరిగణించేబిహార్‌లోనే ఈ పరిస్థితి వుంటే, తెలంగాణ పరిస్థితిని చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇక్కడ కూడా రేవంత్ ప్రభుత్వం కులగణన చేపట్టింది. బిహార్ నేర్పుతున్న పాఠాలు, ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం తన కులగణన రాజకీయ వైఖరిలో మార్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితిని ఏర్పరచవచ్చు. అంతేకాదు కులగణన ద్వారా జనాభా ప్రాతిపదికన ఎన్ని ప్రయోజనాలు చేకూర్చినా ఒక ప్రాం తాన్ని నియంత్రించే బలమైన నాయకుడున్నప్పుడు అవేవీ పనిచేయవన్న సత్యాన్ని బిహార్ రాజకీ యాలు స్పష్టం చేస్తున్నాయి. అయినప్పటికీ నితిష్ కుమార్ ఇటీవల చేపట్టిన మంత్రివర్గ విస్తరణ లో కులాలకే ప్రాధాన్యం ఇచ్చారు. బీసీలు/ఎస్టీలను నియంత్రించే గట్టి నాయకుడిగా కూర్మీ వర్గానికి చెందిన నితిష్ వున్నంతకాలం మరే కుల నాయకుడు ఆధిపత్యం సాధించడం కష్టం. కూర్మీ వర్గం జనాభా కేవలం సుమారు మూడుశాతం మాత్రమే! మరి నితిష్ ఇప్పటివరకు రాష్ట్ర రాజకీ యాలన శాసిస్తున్నారంటే ఆయన ఛరిష్మాయే కారణం. ఛరిష్మా కలిగిన నాయకుడు లేకుండా ఏపార్టీ అయినా ఎన్ని కుల రాజకీయాలు చేసినా ఫలితం వుండదన్నది వర్తమాన రాజకీయ చరిత్ర చెబుతున్న సత్యం.
మంత్రివర్గ విస్తరణ
గత ఫిబ్రవరి 26న బిహార్‌లోని నితిష్‌కుమార్ ప్రభుత్వం బహుశా తన టర్మ్‌లో చివరి మంత్రివర్గవిస్తరణ చేసింది. మంత్రివర్గ విస్తరణలో విశేషమేముందన్న ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది. ఈ ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో నితిష్‌కుమార్ చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో అందరి అంచనాలకు భిన్నంగా కూటమి ప్రభుత్వ భాగస్వామి బీజేపీకి ఏకంగా ఏడు బెర్త్‌లు కట్టబెట్టడం బిహార్ రాజకీయాలను పరిశీలిస్తున్నవారిని ఒక్కసారి సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. మహా అయితే ఐదు బీజేపీకి, రెండు జేడీయూకు కేటాయిస్తారని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. హిందూస్తాన్ అవామ్ మోర్చా (హెచ్‌ఏఎం) చీఫ్, కేంద్ర ఎం.ఎస్.ఎం.ఈ.మంత్రి జితిన్‌రామ్ మంరిa తనయుడు ఇప్పటివరకు నిర్వహించిన మూడు పోర్ట్‌ఫోలియోల్లో రెండిరటిని ఆయన్నుంచి తప్పించి బీజేపీ నాయకులైన కృష్ణకుమార్ మంతూ, విజయ్‌కుమార్ మండల్‌కు అప్పగించడం విశేషం. ఈ రెండిరటిలో ఒకటి సమాచార మంత్రిత్వ శాఖ కాగా రెండవది విపత్తు నిర్వహణ మంత్రిత్వశాఖ. ఈ విస్తరణతో ప్రస్తుతం బీహార్ కేబినెట్ లో 36 మంది మంత్రులుండగా వీరిలో 21మంది బీజేపీకి చెందినవారు కావడం విశేషం. మం త్రివర్గంలో మొదట్నుంజీ జేడీయూ వాటా 13లో ఏవిధమైన మార్పు లేదు. త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో క్రమంగా నితిష్ ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్న రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి మంత్రివర్గంలో ప్రస్తుతం తమ వాటా సంతృప్తినిచ్చివుండవచ్చు.
నితిష్ శైలే వేరు
నిజం చెప్పాలంటే నితిష్‌కుమార్ పరిపాలనా శైలిని ఎవరూ అంచనా వేయలేరు. ఎందుకంటే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినా పూర్తిస్థాయి నియంత్రణ తనచేతుల్లోనే వుండేలా జాగ్రత్త పడతా రు. ఆయన దృష్టిలో మంత్రులు కేవలం ఎగ్జిక్యూటివ్‌లు మాత్రమే! విశేషమేంటంటే ఇప్పుడు కొత్తగా మంత్రిపదవులు దక్కిన ఏడుగురిలో, ఆరుగురు మిథిలాంచల్ ప్రాంతానికి చెందినవారు. ఈ ప్రాంత సరిహద్దుల విషయంలో వివాదం కొనసాగుతున్నప్పటికీ, ముజాఫర్‌పూర్, సరన్, సీ తామర్హి జిల్లాలు కూడా ఇందులో కలిపే అవకాశముంది. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రత్యేక మిథిలాంచల్ రాష్ట్ర పోరాటంలో దర్భంగా కేంద్రం కానుంది. ఇప్పుడు మంత్రివర్గంలో స్థా నం సంపాదించిన సంజయ్ సరౌగో (దర్భంగా స్థానం) మిథిలాంచల్ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతి స్తున్నారు. ఈ మిథిలాంచల్ ప్రాంతంలో బీజేపీకి గట్టి పట్టుంది. 2025`2026 కేంద్ర బడ్జెట్‌లోమఖానా బోర్డు ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతంలో మౌలిక ప్రాజెక్టుల అభివృద్ధికి కేటాయింపులు జరగడం గమనార్హం.
మిథిలాంచల్‌కు ప్రాధాన్యం
కొత్తగా మంత్రివర్గంలో నితిష్‌కుమార్ మిథిలాంచల్ ప్రాంతానికి ప్రాధాన్యమిచ్చినట్టు స్పష్టమవు తోంది. ఇదే సమయంలో ఇక్కడ కులం కార్డు కూడా బలంగా వుండటం గమనార్హం. మంత్రివ ర్గంలో బెర్త్ సంపాదించిన వారిలో రాజుకుమార్ సింగ్, జీవేష్‌కుమార్‌లు రాజ్‌పుట్, భూమిహార్ కులాలకు చెందినవారు. ఈరెండూ అగ్రవర్ణాలు. ఇక విజయ్‌కుమార్ మండల్ నిషాద్ కులానికి చెందినవాడు కాగా మోతిలాల్ ప్రసాద్ వైశ్యుడు. మోతీలాల్ రీగా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కృష్ణకుమార్ మంటో కూర్మి వర్గానికి, సునీల్ కుమార్ కుశావా వర్గానికి చెందినవారు. వీరిద్దరూ ఓబీసీలు. సంజయ్ సరోగి కూడా వైశ్యుడే. ఇప్పుడు మొత్తం 36 మంది మం త్రుల్లో 11మంది అగ్రకులాలకు చెందినవారు. వీరిలో ఐదుగురు రాజ్‌పుత్‌లు, ముగ్గురు భూమి హర్‌లు కాగా ఇద్దరు బ్రాహ్మణులు, ఒకరు క్షత్రియుడు. ఇక ఓబీసీలకు చెందిన పదిమంది మం త్రుల్లో నలుగురు కోయ్‌రి`కుశావహ వర్గానికి చెందగా ముగ్గురు కూర్మీలు, ఇద్దరు వైశ్యులు. మరో ఏడుగురు మత్రులు పూర్తి వెనుకబడిన కులాలకు చెందినవారు (ఈబీసీ). వీరిలో ముగ్గురు మలాప్‌ా కులానికి చెందగా కోహార్, తెలి, నోనియా, ధనుక్ కులాలనుంచి ఒక్కొక్కరు మంత్రివ ర్గంలో వున్నారు. మరో ఐదుగురు షెడ్యూల్డు కులాలకు చెందినవారు. వీరిలో ఇద్దరు పాశ్వాన్ వర్గానికి, రవిదాస్, పాసి కులాలనుంచి ఒక్కొక్కరు చెందినవారున్నారు. మహాదళిత్ (ముషార్) వర్గానికి చెందినవారు ఇద్దరు, ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఒకరికి ప్రస్తుతం నితిష్‌కుమార్ మంత్రివర్గంలో చోటు దక్కింది.
కులగణనామంత్రివర్గంలో స్థానాలు
బిహార్‌లో నిర్వహించిన కులగణన ప్రకారం జనాభాలో ఓబీసీలు 27.12% వున్నారు. అందువల్లరాష్ట్ర కేబినెట్‌లో వీరికి 28% ప్రాతినిధ్యం దక్కింది. ఇక పూర్తి వెనుకబడిన వర్గాల (ఈబీసీ) జ నాభా 36శాతం కాగా నితిష్ మంత్రివర్గంలో వీరి వాటా 19శాతం మాత్రమే వుంది. బిహార్ జనాభాలో షెడ్యూల్డు కులాలు (దళితులు కూడా వీరిలో భాగం) 19.65శాతం కాగా, మంత్రివ ర్గంలో వీరి వాటా 19శాతం వుంది. వీటన్నింటికి విరుద్ధంగా జనరల్ కేటగిరీకి చెందినవారు మంత్రివర్గంలో 31శాతం వరకు వున్నారు. వీరి మొత్తం జనాభా 15.52%కు మించి లేరు! ఇక్కడ ఇద్దరు అగ్రవర్ణాలవారిని మంత్రివర్గంలో తీసుకోవడానికి ప్రధాన కారణం గత రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించిన నితీష్ ఇప్పుడు ఆవి ధంగా చేయలేకపోవడం. ఫలితంగా అగ్రవర్ణాలు, ప్రాంతీయంగా బలీయంగా వున్న నేతలు మరే ఇతర పార్టీలో చేరిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రతిష్ట అట్టడుగుకు దిగజారిన నేప థ్యంలో ప్రాంతీయంగా బలంగా వున్న అగ్రవర్ణావారు ప్రశాంత్‌కిషోర్‌కు లేదా మరే ఇతర నాయకుడికైనా మద్దతివ్వడానికి వెనుకాడటంలేదు. ఇందుకు ఉదాహరణ ముజాఫర్‌పూర్‌నుంచి ము న్నా శుక్లా తాజాగా రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) తీర్థం పుచ్చుకోవడం. 2020లో సాహెబ్‌గం జ్ నియోజకవర్గం నుంచి వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) తరపున గెలిచిన రాజూ సింగ్ బీజేపీలో చేరిపోయారు. తనతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా తీసుకెళ్లడానికి నజరానాగాఆయనకు మంత్రివర్గంలో ప్రమోషన్ దక్కింది. ఈ సింగ్‌కు ముజాఫర్‌పూర్, వైశాలి, తూర్పు చంపరాన్ ప్రాంతాల్లో మంచి పట్టుంది. ఈ నేపథ్యంలో బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశం లేకపోలేదు.
విజయ్‌కుమార్ మండల్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడం నిషాద్ వర్గాన్ని తమవైపు తిప్పుకోవాలన్న భాజపా వ్యూహంలో భాగం. ముఖ్యంగా వికాస్ శీల్ ఇన్సాఫ్ పార్టీ నాయకుడు ముఖేష్ సహానీ మద్దతును భాజపా కోరుకుంటోంది. 2024 సాధారణ ఎన్నికల్లో ముఖేష్ సహానీ ఆర్‌జేడీతో జట్టుకట్టినా, తేజస్వినీ యాదవ్‌తో గత అర్థసంవత్సరంగా ఈయన కలిసి తిరిగిన దాఖలాలు లే వు. దీన్ని తనకు అనుకూలంగా మలచుకోవాలని భాజపా యత్నిస్తోంది. అయితే కృష్ణకుమార్ మంటూ లేదా కృష్ణ పటేల్, సునీల్ కుమార్‌లను మంత్రివర్గంలోకి తీసుకోవడం వివాదం సృష్టి స్తోంది. ఎందుకంటే కుమార్ కుశ్‌వాహా వర్గానికి, కృష్ణకుమార్ మంటూ కూర్మీ వర్గాలకు చెందినవారు. నితీష్‌కుమార్ కూడా కూర్మీ కులానికి చెందినవాడే! బిహార్‌లో కూర్మీల జనాభా 2.87 శాతం కాగా నలంద, చుట్టుపక్కల ప్రాంతాల్లో వీరి ప్రాబల్యం ఎక్కువ. ఇక కుశ్‌వాహా వర్గంవా రు రాష్ట్ర జనాభాలో 4.21%. ఈ రెండు వర్గాలు ఓబీసీ కేటగిరీ కిందికి వస్తారు. ఈ రెండువర్గాలు రాష్ట్రంలో యాదవుల (14%) తర్వాతి స్థానాన్ని ఆక్రమిస్తున్నారు. 1990 ప్రాంతంలో లల్లూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వ హయాంలో యాదవుల ఆధిపత్యాన్ని మొట్టమొదట సవాలు చేసింది కూర్మీలే!
కూర్మీ నేతగా నితిష్
1994లో నిర్వహించిన కూర్మీ చింతన ర్యాలీలో నితిష్ పాల్గనడం ద్వారా లాలూ ప్రసాద్‌తో విభేదించడం మొదలుపెట్టారు. ఈ ర్యాలీ తర్వాత కూర్మీ`కోయిరీ (కుశావహ) వర్గాల నాయకుడిగా నితీష్ స్థిరపడ్డారు. నితిష్‌కుమార్ పార్టీ కూర్మీలకు సముచిత స్థానం కల్పించింది. విచిత్రమేమంటే చింతన ర్యాలీ జరిగిన 31 సంవత్సరాల తర్వాత మళ్లీ కోయిరీ`కూర్మీ వర్గాల భవితవ్యం నిర్దిష్ట దిశలేని స్థితికి చేరుకుంది. శకుని చౌదరి, ఆయన కుమారుడు ప్రస్తుత డిప్యూటీ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, ఉపేంద్ర కుశావహ వంటి నాయకులున్నప్పటికీ, వారెవ్వరికీ కూర్మీల్లో నితీష్ కుమార్‌కున్న పట్టులేదు. ఇప్పుడు నితీష్ వయసురీత్యా ఇతరత్రా కారణాలవల్ల క్రమంగా బలహీన పడటం కూర్మీలకు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఆర్‌జేడీ, బీజేపీలు ఈ వర్గాల్లో పలుకుబడి పెంచుకోవడానికి యథాశక్తి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ నాయకుడు కృష్ణకుమార్ మంటూ ఇటీవల పాట్నాలో ‘కూర్మీ ఏక్తా ర్యాలీ’ నిర్వహించారు. ప క్కనే వున్న నేపాల్ నుంచి కూడా ఈ వర్గానికి చెందిన ఏడుగురు ప్రజాప్రతినిధులను ఆహ్వానించడం విశేషం. కూర్మీల్లో కూడా అనేక ఉపకులాలున్నాయి. కులగణన నిర్వహించినప్పుడు కూర్మీ జనాభాను తక్కువగా చూపారని, నిజానికి లెక్కల్లో చూపినదానికంటే వీరి జనాభా చాలా అధిక మన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ర్యాలీ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్నదని విస్తృ తంగా ప్రచారం చేసినా, నిజానికి దీనికి కర్త కర్మ క్రియ భాజపానే. నితీష్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్‌ను ఈ ఈవెంట్‌కు ఆహ్వానించినా ఆయన రాలేదు. దీనికి నితిష్‌కూడా గైర్హాజ రుకావడం గమనార్హం. ఈ ర్యాలీ రాష్ట్రంలో మీడియా పతాక శీర్షికల్లో చోటుచేసుకోవడం ద్వారా మోటూను ముందుకు తీసుకెళ్లడంలో బీజేపీ కొంతమేర విజయం సాధించినందని చెప్పాలి.
నితిష్‌ను సవాలు చేయడం బీజేపీ లక్ష్యం
ఇప్పుడు నలంద ప్రాంతానికి చెందిన బిహారీషరీఫ్ నియోజకవర్గం నుంచి విజయం సాధించి ప్రస్తుతం మంత్రివర్గంలో స్థానం సంపాదించిన సునీల్‌కుమార్‌ను కుశావహ నాయకుడిగా భాజపా ప్రోత్సహిస్తూ, నలంద ప్రాంతంలో నితిష్‌కుమార్ నాయకత్వాన్ని సవాలుచేయాలని కోరుతోంది. రెండు దశాబ్దాలుగా అప్రతిహతంగా ఈ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని నితిష్ నిలుపుకుంటూ వస్తున్నారు. ఇందుకు ఆయనకు శ్రావణ్‌కుమార్ పూర్తి వెన్నుదన్నుగా వుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రణాళిక ఎంతవరకు విజయవంతమవుతుందో చెప్పడం కష్టం. బహుశా నితిష్ కుమార్ చురుగ్గా వ్యవహరించలేకపోతున్నారు కనుక దీర్ఘకాలంలో ప్రయోజనకారి కావచ్చు.
వైఖరి మార్చుకుంటున్న నితిష్
నితిష్‌కుమార్ తన తనయుడు నిశాంత్‌కు రాజకీయ శిక్షణ ఇవ్వాల్సిన తరుణంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతుండటానికి ప్రధాన కారణం ఈ ఏడాది జరగబోయే అ సెంబ్లీ ఎన్నికలేనని చెప్పక తప్పదు. ఇప్పుడిప్పుడే నిశాంత్ కూడా తన గత జీవనశైలిని మార్చు కొని స్పష్టమైన రాజకీయ నేతగా ఎదగడానికి యత్నిస్తున్నారు. నితిష్‌కుమార్ కూడా గతంలో వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించిన వ్యవహారశైలినుంచి క్రమంగా వైదొలగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఆయనకు నిశాంత్ నుంచి అవసరమైన మద్దతు లభించడంలేదు. ఎందుకంటే ని శాంత్ లాలూప్రసాద్ యాదవ్ పట్ల సానుకూలంగా వుండటమే. ఇదే సమయంలో బీజేపీ మం టూ, సునీల్‌కుమార్‌లను గట్టి నాయకులుగా ముందుకు తెస్తోంది. అంతేకాకుండా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు దిలీప్ జైస్వాల్, నితిష్ నాయకత్వంలో పనిచేయడానికి ఇష్టపడటంలేదు. అయితే ఈ దాగుడుమూతల రాజకీయాలు బిహార్‌లో మరికొద్దినెలలు కొనసాగే అవకాశముంది. పూర్తిగా తన చేయి దాటిపోతే నితిష్‌కుమార్ కేంద్రంలో మద్దతు ఉపసంహరించుకుంటానని బెదిరించే అవ కాశాలు కూడా లేకపోలేదు.
నిశాంత్‌కు పూలబాట కాదు
ఇటీవల ఇండియా టుడే ‘సీ ఓటర్ సర్వే’ ఫలితాలను విడుదల చేసింది. దీని ప్రకారం బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్‌కు 41% ఓటర్ల మద్దతు లభిస్తే, నితిష్‌కుమార్‌కు 18% మంది మాత్ర మే అనుకూలంగా వుండటం గమనార్హం. విచిత్రమేమంటే ప్రశాంత్ కిషోర్‌కు అనుకూలంగా 15% మంది వ్యవహరించడం మరో విశేషం. 50శాతం మంది ప్రజలు నితీష్ పాలనపై అసం తృప్తిని వ్యక్తం చేశారు. ఇన్ని పరిణామాల నేపథ్యంలో నిశాంత్‌కుమార్ రాజకీయ రంగ ప్రవేశం పూలబాటగా సాగదనేది స్పష్టమవుతోంది. ఈ ముళ్లబాటలో ఆయన ఎట్లా పయనం సాగిస్తారనేది వేచి చూడాలి.