బీద బిడ్డకు సాయం చేయాలనే ఆలోచన చేయరా…!

Helping poor children

బీద బిడ్డకు సాయం చేయాలనే ఆలోచన చేయరా…
– శ్రీపాద ట్రస్టు ద్వారా ఒక్కరికైనా సాయం చేసిండ్లా
– చిన్నసారు పుట్టిన రోజున బీద బిడ్డ గుర్తుకు రాలేదా
– 40 ఏండ్ల అధికారానికి కాటారమే కేంద్ర బిందువు
– అబద్దాలతో సాయం చేసే స్థితిలో లేకుండా చేసిండ్లు
– కులాలను వాడుకోవడం తప్పా పైసా సాయం చేయరు
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌

మంథని :- నేటి ధాత్రి

తన ఉన్నత విద్యకు ఆర్థిక స్థోమత అడ్డుగా ఉందని, మెడికల్‌ సీటు వచ్చినా ఫీజు కట్టలేని స్థితిలో ఉన్న ఓ బీదబిడ్డకు సాయం చేయాలనే ఆలోచన కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు ఎందుకు రావడం లేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ ప్రశ్నించారు. మంథని పట్టణంలోని రాజగృహాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాటారం మండల కేంద్రానికి చెందిన జ్యోత్స్న అనే బీద బిడ్డకు మెడికల్‌ సీటు వచ్చిందని, అయితే ఫీజు కట్టలేని స్థితిలో ఉన్నానని, తన తండ్రి బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతున్నాడని సాయం చేయాలని నెల రోజుల క్రితం సోషల్‌ మీడియా, పత్రికల్లో వచ్చిన కథనాలు చక్కర్లు కొట్టాయని ఆయన తెలిపారు. అయితే రెండు రోజుల క్రితం శ్రీపాద ట్రస్టు చైర్మన్‌ పుట్టిన రోజు సందర్బంగా నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారని, ఈ వేడుకలు నిర్వహించిన వారిలో ఎక్కువగా బీసీ, ఎస్సీ బిడ్డలే ఉన్నారన్నారు. అయితే వేడుకలు నిర్వహించే కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు బీద బిడ్డ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. శ్రీపాద ట్రస్టు చైర్మన్‌ పుట్టినరోజు సందర్బంగా ఆ బీద బిడ్డకు సాయం చేస్తారని అనుకున్నానని, కానీ అలాంటి ఆలోచన చేయకపోవడం బాధాకరమన్నారు.స్వాతంత్రం వచ్చిన 78ఏండ్ల చరిత్రలో ఏనాడైనా శ్రీపాద ట్రస్టుద్వారా ఒక్క పేదవాడికి సాయం చేశారా అని ప్రశ్నించారు. అయితే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సింహబాగంలో కాటారం మండలం కాంగ్రెస్‌ పార్టీకి మెజార్టీ ఇస్తుందని, అలాంటి మెజార్టీ ఇచ్చే కాటారం మండలంలోని ఏ ఒక్కరికైనా సాయం చేశారో చెప్పాలన్నారు. కేవలం మూడు ఓట్లు ఉన్న ఆ కుటుంబానికి 40ఏండ్లు అధికారం ఇవ్వడంలో కాటారమే కీలక పాత్ర పోషించిందన్నారు. అలాంటి కాటారం మండల కేంద్రానికి చెందిన ఓ బీద బిడ్డ తనకు సాయం చేయాలని కోరితే సాయం చేయకపోవడం విడ్డూరమన్నారు. తాను పదేళ్ల కాలంలో మెడికల్‌ సీట్లు వచ్చిన కనీసం ఐదుగురికి ఫీజు కట్టానని, మరికొంత మంది బీద బిడ్డలకు అమెరికా వెళ్లేందుకు సాయం చేశానన్నారు.కానీ తనపై అబద్దాలు, అబండాలు వేసి సమాజానికి దూరం చేశారని, కనీసం సాయం చేయలేని స్థితికి తీసుకువచ్చారని అన్నారు. బీదబిడ్డ జ్యోత్స్న మెడికల్‌ సీటు కోసం తాను సాయం చేయలేని పరిస్థితిలో ఉన్నానని ఆ కుటుంబం తనను క్షమించాలన్నారు. ఓట్లు వస్తెనే నోట్ల కట్టలతో వచ్చే నాయకులు కలెక్షన్‌ కోసం కార్యాలయాలు సైతం ఏర్పాటుచేశారని ఆయన ఆరోపించారు. అనేక ఏండ్లుగా అమెరికాలోనే ఉంటున్న దుద్దిళ్ల కుటుంబం తమ ఏ సంస్థ ద్వార నైనా బీద బిడ్డకు సాయం చేసే అవకాశం ఉన్నా ఆ దిశగా ఆలోచన చేయలేదని, ఈ మట్టిలో పుట్టిన వాళ్లు ప్రజాప్రతినిధులైతే ఏ విధమైన పాలన ఉంటుందో, మట్టితో సంబంధం లేకుండా ఉన్న వ్యక్తులకు అధికారం ఇస్తే ఎలా ఉంటారో ప్రజలు గమనించాలన్నారు. మన ఆకలి, కష్టాలుతెలియని వాళ్లు నోట్లతోనే అధికారం వస్తుందనే ఆలోచనలో ఉన్నారని, కులాలను వాడుకుంటారే తప్ప పైసా సాయం చేయరన్నారు. ఇప్పటికైనా ప్రజలు గమనించి ఆలోచన చేయాలని ఆయన ఈ సందర్శంగా కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!